Home తాజా వార్తలు బీభత్సం

బీభత్సం

Heavy rain in Telangana for next 3 days

 

అతలాకుతలం చేసిన కుండపోత వర్షం, మరో 3 రోజులు భారీ వర్షాలు

చెరువులను తలపించిన హైదరాబాద్ రోడ్లు
భారీగా ట్రాఫిక్ జామ్‌లు, తీవ్ర ఇబ్బందులు
రంగంలోకి డిఆర్‌ఎఫ్, సహాయక చర్యలు
పలుచోట్ల కొట్టుకుపోయిన వాహనాలు
వనపర్తి, కొల్లాపూర్‌లలో 11ఏళ్ల తర్వాత
భారీ వర్షం, పొంగిపొర్లిన వాగులు, చెరువులు
ఉమ్మడి వరంగల్ జిల్లాను వదలని వర్షం
పత్తి, వరి, కంది పంటలకు నష్టం

వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృత్యువాత
హైదరాబాద్ ఫిర్జాదిగూడలో గోడకూలి ఇద్దరు, వికారాబాద్ జిల్లా షాపూర్ గ్రామంలో వాగు దాటుతూ పిల్లలను కాపాడబోయి తల్లి మృతి

మన తెలంగాణ/హైదరాబాద్ : అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురిశాయి. రాజధాని హైదరాబాద్ భారీ వర్షంతో తడిసి ముద్దయింది. జోరుగా కురుస్తున్న భారీ వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులు తటాకాలను తలపిస్తున్నాయి. ట్రాఫిక్ స్తంభించింది. భారీ వర్షం కారణంగా మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో పిర్జాదిగూడలో గోడ కూలిన ఘటనలో ప్రవీణ్‌కుమార్(42), మోహన్(12) అనే కార్మికులు మృతి చెందారు. మర్పల్లి మం డం లో వాగును దాటుతుండగా తల్లి మృతి చెందింది. హైదరాబాద్‌లో కుండపోతగా వర్షం కురుస్తుండటంతో జిహెచ్‌ఎంసీ అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ఇల్లు విడిచి బయటకు రావొద్దని ఇటు జిహెచ్‌ఎంసీ, అటు పోలీసు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

అలాంటిది బుధవారం సాయంత్రం నుంచి పెద్దపెట్టున భారీ వర్షం కురుస్తుండటంతో అప్పటికే వివిధ పనులపై తమ తమ వాహనాలతో బయటకు వచ్చిన వాహన చోదకులు రోడ్లన్నీ తటాకాలుగా మారడంతో తమ వాహనాలను నడిపేందుకు ఇబ్బందుల పాలయ్యారు. దీంతో నగర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. వాహన చోదకులు మెట్రో లైన్ వెంబడి తమ వాహనాలను నిలుపుదల చేసుకుని వర్షం ఎప్పుడు తగ్గుతుందోనని నిరీక్షించారు. వర్షం తెరపి ఇవ్వకపోవడంతో కొందరు వాహన చోదకులు అతి కష్టం మీద తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. ముందు జాగ్రత్తగా కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాని నిలిపివేశారు. జిహెచ్‌ఎంసీకి చెందిన మాన్‌సూన్ బృందా లు రంగంలోకి దిగాయి.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో వర్షం దంచికొడుతోంది. కుంభవృష్టినే తలపిస్తోంది. వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. రహదారులు కోతకు గురయ్యాయి. వరద నీరు ఇళ్లల్లోకి వస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో వర్షం బీభత్సాన్ని సృష్టించింది. 11 ఏళ్ల తరువాత ఆ స్థాయికి మించి భారీ వర్షం కురిసింది. వర్ష బీభత్సానికి ఇళ్లు కూలుతున్నాయి. బాధితులని పునరావాస కేంద్రాల్లోకి అధికారులు తరలించారు. కుడికెళ్ల రగామంలో సంఖ్య దేవమ్మ ఇల్లు కూలి మృతి చెందింది. కోడేరు మండలం ముత్తిరెడ్డిపల్లి వద్ద రెండు ట్రాక్టర్‌లు వాగులో ఇసుకకు వెళ్లి చిక్కుకుని కొట్టుకుపోయాయి. రాజాపూర్ గ్రామంలో ఊర చెరువు ఉద్ధృతికి బైక్ కోట్టుకుపోగా బైక్‌పై ఉన్న వ్యక్తిని గ్రామస్థులు కాపాడారు.

పెంట్లవల్లి మండలంలో వర్ష బీభత్సానికి ఇళ్లల్లోకి నీళ్లు రావడంతో 53 మందిని పునరావాసాలకు తరలించారు. 31 ఇళ్లు దెబ్బతిన్నాయి. గంగమ్మ ఆలయంలోకి వరద నీరు వచ్చి చేరింది. చౌట చెరువు ప్రమాదకరంగా మారడంతో రాకపోకలు నిలిపివేశారు. పెద్దకొత్తపల్లి మండలం చంద్రకల్ గ్రామంలో ఇళ్లలో నీళ్లు ఉబికి వస్తూ ప్రమాదకరంగా మారింది. గత నాలుగు రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మూడు రోజులుగా రాత్రి సమయాల్లో వర్షాలు కురుస్తుండగా, బుధవారం పొద్దంతా కుండపోతగా వర్షం కురిసింది. ఈ వర్షాలతో వరదలు ఉప్పొంగుతున్నాయి. చెరువులు, కుంటలు నిండి మళ్లీ అలుగు దూకుతున్నాయి. భారీ వరద ప్రవాహంతో వాగులు ఉప్పొంగి అటవీ ఏజెన్సీ ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పత్తి, మిర్చి, వరి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా నష్టానికి గురవుతున్నాయి.

ఇకపోతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు బిర్రుగా నిండి వర్షపు నీరు మరింత అధికమైతే చెరువులకు ప్రమాదం ఏర్పడనుంది. దీనిపై అధికారులు రానున్న మూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట వాగులో గిరిజన రైతు దంపతులు చిక్కుకున్నారు. బుధవారం ఉదయం భారీ వరద రావడంతో పొలం పనులు ముగించుకుని తిరిగి వచ్చే క్రమంలో వాగులో చిక్కుకున్నారు. ఎన్‌డిఆ౪ర్‌ఎఫ్ బృందాలతో డిండి వాగులో చిక్కుకున్న గిరిజన దంపతులను రక్షించే పనులను పర్యవేక్షిస్తున్నారు. నారాయణపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి జిల్లాలోని చెరువులు,కుంటలు నిండటంతో పాటు వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. చెక్ డ్యాంలు మత్తడి దుంకుతున్నాయి.

మంగళవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి వనపర్తి జలదిగ్బంధమైంది. పట్టణంలోని పలు కాలనీల్లోకి వరద వచ్చి చేరింది. తాళ్ల చెరువుకు నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంతో పొంగిపొర్లుతోంది. శ్వేతానగర్ కాలనీ, శ్రీరామటాకీస్, బ్రహంగారి వీధిలోకి ప్రవాహం వచ్చింది. నివాసాలు, వ్యాపార సముదాయాల్లో వరద నీరు వచ్చి చేరింది. పలు చోట్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా సత్వారాలో 9.8 సె.మీల వర్షపాతం నమోదవ్వగా, షేక్‌పేటలో 9.4 సెంమీ మేర వర్షపాతం నమోదైంది. అబ్ధుల్లాపూర్ మెట్‌లో 8.8 సెంమీ మేర వ్షపాతం నమోదైంది. భూత్పూరులో 8.1, టోలిచౌక్‌లో 8 సెంమి మేర వర్షపాతం నమోదైంది. మెహిదీపట్నంలో 7.4 సె.మీ మేర వర్షపాతం నమోదవ్వగా, గుడిమల్కాపూర్‌లో 6.7 సెంమీ వర్షపాతం నమోదైంది. దీంతో భాగ్యనగరమైన హైదరాబాద్ పూర్తిస్థాయిలో వర్షానికి తడిసి ముద్దయింది.

కుమార్తెలను కాపాడబోయి తల్లి మృతి…
వికారాబాద్‌లో షాపూర్ తండా సమీపంలో వాగులో చిక్కుకున్న తన ఇద్దరు కుమార్తెలను కాపాడబోయే ప్రయత్నంలో తల్లి అనితాబాయి మృతి చెందింది. గ్రామానికి చెందిన దశరధ్, అనితాబాయిలు తమ ఐదుగురు పిల్లలు, మరో ముగ్గరు కలిసి పత్తిపంటలో కలుపు తీయడానికి ఆటోలో వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో వాగు ఉద్దృతంగా ప్రవహించింది. ఆ క్రమంలో కుమారులతో తండ్రి దశరధ్ వాగు దాటారు. ఆ తర్వాత కుమార్తెలు అనితాబాయి వాగు దాటిస్తున్న క్రమంలో వారు జారి వాగులో పడిపోయారు. దీంతో వారిని కాపాడబోయే ప్రయత్నంలో అనితాబాయి వాగులో కొట్టుకుపోయింది. అప్రమత్తమైన దశరథ్ తన ఇద్దరు కుమార్తెలను రక్షించాడు కానీ భార్య అనితను కాపాడుకోలేకపోయా డు. ఇక వాగు అవతల చిక్కుకున్న మరో ముగ్గురిని స్థానికులు తాడు సాయంతో దాటించారు.

ముగ్గురు యువకులు క్షేమం…
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని గంధలమల చెరువు మత్తడి వరద కాల్వలో పడి బుధవారం రెండు బైకులు గల్లంతయ్యాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షంతో ఎగువ ప్రాంతాల నుంచి కాల్వ ద్వారా వస్తున్న వరద నీటితో గంధమల్ల చెరువు నిండి అలుగు పొస్తున్నది. కాగా, తుర్కపల్లి నుంచి గంధమల్ల గ్రామానికి అలుగులోంచి దారి ఉంది. ఈ క్రమంలో తుర్కపల్లి నుంచి మదర్ డెయిరీ సిబ్బంది బొత్త మహేశ్, మధులు ఒక బైక్‌పై గంధమల్లకు చెందిన జాగర్ల వెంకటేశ్, మరో బైక్‌పై గ్రామానికి వెళ్తున్నారు. గంధలమల్ల చెరువు మత్తడి నుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నీటిలో పడి రెండు బైక్‌లు కొట్టుకుపోగా బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అతి కష్టంపై బయటకు వచ్చారు.

మరో మూడ్రోజుల పాటు భారీ వర్ష..
తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్, కుమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్గొండ, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట జిల్లాలలో భారీ వర్షాలు పడుతాయని వాతా వరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో వివరించింది. అలాగే అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మెస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈశాన్య బంగాళాఖాతంలో దాని పరిసర ప్రాంతాలలో సుమారుగా సెప్టెంబర్ 20న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. తెలంగణ దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలలో కొనసాగుతున్న అల్పపీడనం బుధవారం ఉదయం బలహీనపడిందన్నారు. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తెలంగాణ దాని పరిసర ప్రాంతాలలో 3.1 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతోందని పేర్కొన్నారు.

Heavy rain in Telangana for next 3 days