Tuesday, April 23, 2024

దక్షిణ తెలంగాణలో దంచికొట్టిన వాన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/న్యూస్ నెట్‌వర్క్:ఎడతెరిపిలేకుండా బుధ, గురువారాల్లో దక్షిణ తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలతోపాటు, ఖమ్మం, నిజామా బాద్ జిల్లాల్లో కురిసిన జోరు వానకు అయా జిల్లాల ప్రజానీకం ఉక్కిరిబిక్కిరయ్యారు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలను భారీ వర్షం ముంచెత్తింది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ము ఖ్యంగా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఒక్కుదుటున కురుస్తున్న వర్షాలతో ప్రజలు భీతెల్లారు. దీంతో అయా ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మహబూబ్‌నగర్ పట్టణంలోని రామయ్య బౌలి, బికె రెడ్డి కాలనీ, శెట్టి కాలనీ, వల్లభ్‌నగర్, గణేష్ నగర్ తదితర ప్రాంతాల్లో ఇండ్లు నీటమునిగాయి. పాలమూరు ప్రధాన రహదారిపై పెద్దఎత్తున వరద నీరు పారుతుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ వెంకట్రావు మున్సిపల్ అధికారులతో కలిసి పరిస్థితి సమీక్షించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అనేక చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. భారీవర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుధవారం నుంచి కురుస్తున్న వానలతో చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు (సంఘం బండ) భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. కోల్‌సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పోటెత్తింది. దీంతో అధికారులు ఐదు గేట్లు ఎత్తి 3500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. వెల్దండ మండలంలో భారీ వర్షాలతో మళ్ళీ ఉప్పొంగుతున్న బైరాపూర్ వాగు, ఆమనగల్లు చెరువు నుంచి అలుగు పారుతుండడంతో గట్టి తండా బ్రిడ్జి పైనుంచి బెల్లంపల్లి చెరువుకు ఉధృతంగా ప్రవహిస్తున్న నీటితో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వనపర్తి జిల్లాలో ఊకచెట్టువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొత్తకోట-ఆత్మకూరు ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువన సరళసాగర్ సైఫన్లు తెరచుకోవడంతో కాజ్‌వేపై నుంచి వరద ప్రవహిస్తున్నది. పెద్దమండలి మండలం దొడగుంటపల్లి వద్ద చెరువు తెగిపోయింది. దీంతో పంటపొలాలు నీటమునిగాయి. నారాయణపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. ధన్వాడ మండలంలోని వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొల్లాపూర్ సమీపంలో నార్లపూర్ ఎర్రగట్టు పెద్దవాగు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దుందుభీ, ఊకచెట్టువాగుల్లో వరద పెరిగింది. చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు అలుగు పారాయి. జిల్లా కేంద్రంలోని జెర్రిపోతుల మైసమ్మ వద్ద ఉన్న వాగు, నల్ల చెరువు, తాళ్ల చెరువును గురువారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. చెరువులు కుంటలు తెగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో బుధవారం అర్థరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకు రెండు పర్యాయాలు కుండపోత వర్షం కురవడంతో జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాలలో భారీ వర్షపాతం నమోదయ్యింది. వాగులు, వంకలు ప్రమాదస్థాయిలో ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాజ్‌వేల వద్ద వరద అధికంగా ఉండడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. బిజినపల్లి, వట్టెం మధ్య కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద వరద ప్రవాహం ఉధృతంగా మారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. జిల్లా కేంద్రంలోని నాగనూల్ చెరువు, తూడుకుర్తి చెరువు అలుగు పారుతుండడంతో రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. లింగసానిపల్లి, గగ్గలపల్లి, కార్వంగ తదితర ప్రాంతాలలోని వాగులు ప్రమాదస్థాయిలో ప్రవహిస్తున్నాయి.
దారూర్‌లో వాగులో కొట్టుకుపోయిన కారు
గంటల వ్యవధిలోనే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. జిల్లాలోని పలు మండలాల్లో కుండపోత వర్షంతో జన జీవనం ఆస్తవ్యస్తం అయింది. జిల్లాలోని ఆమన్‌గల్, తలకొండపల్లి, ఇబ్రహింపట్నంతో పాటు పలు మండలాల్లో కుండపోత వర్షం కురిసింది. ఇబ్రహింపట్నం పెద్ద చెరువుకు గతంలో ఎనాడు లేని స్థాయిలో వరద రావడంతో చెరువు జలకలను సంతరించుకుంది. ఈసి, మూసిల ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షం తో పొంగిపొర్లుతు జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.
తెగిన కాలువ.. పొంగిన కాగ్నా
వికారాబాద్ జిల్లాలో బుధవారం రాత్రి కురిసిన వర్షం జన జీవనం ఆస్తవ్యస్తం అయింది. కాగ్నా నది ప్రమాదస్థాయిలో ప్రవహిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదురుకున్నారు. దారూర్ మండలం నాగారం వాగులో కారు కొట్టుకుపోయింది. కారులో ప్రయాణిస్తున్న దోర్నాల గ్రామానికి చెందిన భార్యభర్తలు చెట్టును పట్టుకుని ప్రాణాలు కాపాడుకోగా స్థానికులు వారిని రక్షించారు.
ఆరుతడి పంటలకు నష్టం
అల్పపీడన ప్రభావంతో నల్లగొండ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయా ప్రాంతాలలో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఇప్పటికే చెరువులు, కుంటలతో పాటు జలాశయాలన్నీ నీటితో నిండి ఉండడంతో అడపదడప కురుస్తున్న వర్షాలతో మత్తడులు దుంకుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే వాణిజ్య పంటలైన పత్తి చేలలో గతంలో కురిసిన వర్షాలకు తడి ఆరని పరిస్తితితో కొంత ఇబ్బందులు పడుతున్న అన్నదాతలకు వరుస రోజులలో విరామం లేకుండా కురుస్తున్న వర్షాలు ఇబ్బందికర పరిస్థితులకు కారణమవుతున్నాయి. ఖమ్మం జిల్లా వేంసూరులో భారీ వర్షం కురిసింది. చెరువులు, కుంటలలో లంక సాగర్ ప్రాజెక్టులో పుష్కలంగా నీరు కన్పిస్తోంది.

నేడు, రేపు అతి భారీ వర్షసూచన
రాష్ట్రంలో పలు చోట్ల శుక్రవారం అతి భారీ వరాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మూడు రోజులు పాటు వానలు కొనసాగుతాయని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. శుక్రవారం దక్షిణకోస్తా,రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

Heavy Rain likely to Telangana for next 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News