Home తాజా వార్తలు ఏరు, ఊరు ఏకమై

ఏరు, ఊరు ఏకమై

Heavy rainfall across telangana for next two days

 

రాష్ట్రమంతటా ఎడతెరిపిలేని వానలు, పొంగిపొర్లుతున్న వాగులు,చెరువులు
హైదరాబాద్ నగరంలో భారీ వర్షపాతం
పదేళ్లలో ఎన్నడూలేనంతగా జులై నెలలో 359.5మి.మీ. వర్షం
నేడు, రేపు రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు
48 గంటల్లో మరో అల్పపీడనం
ఈశాన్య, తూర్పు తెలంగాణ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

ఎల్లంపల్లికి భారీ వరద 16 గేట్లు ఎత్తివేత

మనతెలంగాణ/హైదరాబాద్ : రానున్న రెండు రోజుల్లో వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నేడు, రేపు తెలంగాణ వ్యాప్తంగా అతి నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే రుతుపవనాలు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో 10 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా మరో రెండు రోజుల పాట వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

బుధవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షానికి పలు చోట్ల రహదారులు దెబ్బతినగా, పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నగరంలో ఉదయం నుంచి కురుస్తున్న ముసురుకు జనజీవనం స్తంభించింది. ఈ నేపథ్యంలో మరో రెండురోజుల పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రెండు రోజుల పాటు ఈశాన్య, తూర్పు తెలంగాణ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఆదిలాబాద్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్‌లో అధికం
ఆదిలాబాద్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, సిద్దిపేట, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, నల్లగొండ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక హైదరాబాద్‌లో కూడా రాబోయే మూడు రోజుల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. మరోవైపు సింగరేణి ఏరియాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.

10 సంవత్సరాల్లో 285.2 మి.మీ. వర్షపాతం అధికం..
నగరంలో ఈ ఏడాది జూలై 20 నాటికి సాధారణ వర్షపాతం కంటే అత్యధిక వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం వరకు నగరంలో 70 శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 10 సంవత్సరాలుగా జూలైలో నెలలో 285.2 మి.మీ. వర్షపాతం అత్యధికంగా నమోదు కాగా ఈ నెల (జూలై 20వ తేదీ వరకు) పదేళ్ల రికార్డును తిరగరాస్తూ 359.5 మి.మీ. వర్షపాతం నమోదు అయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది.

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో…
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో బుధవారం తెల్లవారుజాము నుంచే ఏకధాటిగా వర్షం కురుస్తోంది. ముసురుతో ఎడతెరపి లేకుండా వర్షం పడుతోంది. దీంతో నగరవాసులు ఉదయం నుంచి ఎవ్వరూ బయటకు రావడం లేదు. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురికి కాలువలు పొంగి పొర్లుతున్నాయి.

బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. ఇల్లందు, కోయగూడెం ఉపరితల గనుల్లో పనులకు ఆటంకం ఏర్పడింది. 8 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. 28 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీతకు ఆటంకం ఏర్పడగా కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. మంచిర్యాలలో కేకే, ఆర్కేపీ, ఎస్‌ఆర్పీ, ఇందారం ఉపరితల గనుల్లో ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ఫలితంగా దాదాపు 32 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

4 సింగరేణి ఉపరితల గనుల్లో వరద నీరు
మంచిర్యాల జిల్లాలో 4 సింగరేణి ఉపరితల గనుల్లో వరద నీరు చేరి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మందమర్రి ఏరియాలోని కల్యాణిఖని, రామకృష్ణాపూర్ ఉపరితల గనుల్లో 12 వేల టన్నుల బొగ్గు, శ్రీరాంపూర్ ఏరియాలోని ఇందారం, శ్రీరాంపూర్ ఓసీల్లో 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఉపరితల గనుల్లోని ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో సుమారు మూడు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులకు అంతరాయం ఏర్పడింది. దీంతో సంస్థకు సుమారు 7 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని అధికారులు పేర్కొన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా…
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షం పడుతోంది. ముసురుతో లోతట్టు ప్రాంతాల్లో జనం ఇబ్బందులు పడుతున్నారు. వర్షంతో ఈద్గాల్లో ప్రార్థనలకు అంతరాయం కలిగింది.

జగిత్యాల జిల్లాలో..
జగిత్యాల జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వరుసగా కురుస్తున్న వర్షాలకు జగిత్యాల గ్రామీణ మండలం మోరపల్లిలో పురాతన ఇల్లు కూలింది. ఏటా అట్టహాసంగా జరిగే జగిత్యాల పట్టణంలోని ఈద్గా, ఖిల్లాల్లో ఈ సారి వర్షం కారణంగా ప్రార్థనలు జరపలేదు.

నిర్మల్ జిల్లాలో 77 మిల్లీమీటర్లు
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో 77 మిల్లీమీటర్లు, ఆదిలాబాద్‌లో 59.8, నిజామాబాద్‌లో 55.5. జయశంకర్ భూపాలపల్లిలో 47.5, హైదరాబాద్‌లో 50, రంగారెడ్డిలో 45, మేడ్చల్ మల్కాజిగిరిలో 48 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని అధికారులు తెలిపారు.

Heavy rainfall across telangana for next two days