Home తాజా వార్తలు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

Heavy Rainfall forecast in Next 3-4 days

 

ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం

మనతెలంగాణ/హైదరాబాద్ : రాబోయే మూడు, నాలుగు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం తెలిపారు. ప్రస్తుతం దక్షిణ కోస్తాంధ్ర మీదుగా 1.5 కిలోమీటర్ల నుంచి 3.6 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ఆమె తెలిపారు. మరోక ఉపరితల ఆవర్తనం మరఠ్వాడా ప్రాంతంలో 3.1 కి.మీలో కేంద్రీకృతమైందని, ద్రోణి ఒకటి మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర వరకు కొనసాగుతోందని నాగరత్నం వెల్లడించారు.

అయితే షేర్ జోన్ బలహీనపడిందని దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందన్నారు. అటు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి, మహబూబ్ నగర్, వనపర్తి, జనగాం, నల్గొండ, జయశంకర్ భూపాలపల్లి, భద్రాచలం ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.

నగరంలో భారీ వర్షం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, రాణిగంజ్, ట్యాంక్‌బండ్, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్, అసిఫ్‌నగర్, లక్డీకాపూల్, మెహదీపట్నంలో కురిసిన వర్షానికి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. రోడ్లపైకి వర్షపు నీరు వచ్చి చేరడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. మంగళవారం ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

సంగారెడ్డిలో 71.5 మిల్లీమీటర్లు
సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షం తాలుకూ వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి 71.5 మిల్లీమీటర్లు, జనగాం 59.5, కామారెడ్డి 57.5, భద్రాద్రి కొత్తగూడెం 57.3, మేడ్చల్ మల్కాజిగిరి 51.8, హైదరాబాద్ 48, రంగారెడ్డి 46, నిజామాబాద్ 44.5, రాజన్న సిరిసిల్ల 44.5, సిద్దిపేట 43.8, ఆదిలాబాద్ 43.3, కరీంనగర్ 41, నల్లగొండ 39.3, వరంగల్ అర్భన్ 34.5, వరంగల్ రూరల్ 30.8, జయశంకర్ భూపాలపల్లి 28.5, నిర్మల్ 23, ఖమ్మం 22.3, సూర్యాపేట 21.5, మెదక్ 20.8, ములుగు 18.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్టు వాతావరణ శాఖ తెలిపింది.

Telangana wide rain over the next 3-4 days