Home జాతీయ వార్తలు భారీ వర్షాలతో మునిగి తేలుతున్న ముంబై

భారీ వర్షాలతో మునిగి తేలుతున్న ముంబై

Heavy rainfall, waterlogging in parts of Mumbai

 

ముంబై : ముంబై మళ్లీ భారీ వర్షాలతో సతమతమౌతోంది. గత రాత్రి భారీ వర్షాల కారణంగా ముంబై, పొరుగునున్న థానే జిల్లా అనేక చోట్ల జలమయమయ్యాయి. లోకల్ రైళ్లు, రోడ్డు రవాణా సర్వీసులు దెబ్బతిన్నాయి. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అత్యవసర సర్వీసులు తప్ప మిగతా వాణిజ్యసంస్థలు, ఇతర సంస్థలు మూసివేయడం మంచిదని, పౌరులు ఇళ్ల వద్దనే ఉండాలని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బిఎంసి) మంగళవారం హెచ్చరించింది. రైలు పట్టాలు వర్షం నీటిలో మునిగిపోవడంతో హార్బర్ లైన్‌లో సబర్బన్ రైలు సర్వీసులు ఆగిపోయాయి. వెస్టర్న్, సెంట్రల్‌రైలు లైన్ల సర్వీసులు కూడా నడవలేదు.

కరోనా నేపథ్యంలో అత్యవసర సర్వీసుల కోసం మాత్రమే ముంబై, సబర్బన్ ప్రాంతాల్లో లోకల్‌రైళ్లు నడుస్తున్నాయి. సబర్బన్ కండివలి వద్ద కొండచరియ విరిగి పడడంతో పశ్చిమ సబర్బన్ ప్రాంతాల నుంచి దక్షిణ ముంబై వైపు వెళ్లాల్సిన వాహనాలు ఆగిపోయాయి. కొన్ని ప్రాంతాలు జలమయం కావడంతో బైకుల్లా నుంచి దక్షిణ ముంబై వరకు ట్రాఫిక్ సాగడం లేదు. పశ్చిమ సబర్బన్ ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి 254 మిమీ వర్షం కురిసినట్టు శాంతాక్రూజ్ అబ్జర్వేటరీ వెల్లడించగా, కొలబా అబ్బర్వేటరీ 220 మిమీ వర్షం కురిసిందని ప్రకటించింది.

మహాలక్ష్మి వాతావరణ కేంద్రం 172 మిమీ వర్షపాతాన్ని, విద్యావిహార్ కేంద్రం 159 మిమీ వర్షపాతాన్ని నమోదు చేశాయి. పశ్చిమ సబర్బన్ ప్రాంతాల్లో 152 మిమీ వంతున వర్షపాతం కురిసినట్టు రామ్‌మందిర్, మీరా రోడ్డు వాతావరణ కేంద్రాలు నమోదు చేశాయి. ఉత్తరముంబై, థానే వాతావరణ కేంద్రాలు 150 మిమీ వర్షపాతాన్ని నమోదు చేశాయి. మరో 48 గంటలపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హెచ్చరించాయి. బైకుల్లా, భాందూప్, తదితర ప్రాంతాల్లో నిల్చిపోయిన నీటిని తోడివేయడానికి ఎక్కువ సామర్థం కలిగిన వాటర్‌పంపులను బిఎంసి ఏర్పాటు చేసింది.

Heavy rainfall, waterlogging in parts of Mumbai