Thursday, February 2, 2023

రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు

Rainప్రయాణికులతో హైదరాబాద్‌లో మెట్రోస్టేషన్లు కిటకిట
రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 4.8 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు
- Advertisement -

హైదరాబాద్: హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల గురువారం భారీ వర్షం కురిసింది. పదేళ్ల తరువాత వరుసగా అదనపు వర్షపాతం నమోదు అవుతుండడంతో హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. జీహెచ్‌ఎంసీలో పరిధిలో భారీగా వర్షం నమోదు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఎక్కడికక్క నీరు నిలిచిపోవడంతో మోకాలు లోతు నీరు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. కొందరు బస్సులకు బదులుగా మెట్రో రైలును వినియోగించుకోవడంతో మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. రోడ్లన్నీ చెరువులను తలపించడంతో వాహనదారులు పలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

12 రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ఇప్పటికే ఎపి, తెలంగాణతో పాటు మరో 12 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఒడిశా, జార్ఖండ్, ఉత్తరాఖండ్, తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, బీహార్, పశ్చిమబెంగాల్, అసోం రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీటితో పాటు ఎపిలోని రాయలసీమలో, తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణలో వర్షం ఎక్కువగా కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

0.9 కి.మీల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి

రంగారెడ్డి జిల్లాలోని హయత్‌నగర్‌లో 4.8 సెంటిమీటర్ల వర్షపాతం నమోదుకాగా, మేడ్చల్ మల్కాజిగిరిలో 2.6,హైదరాబాద్‌లో 2.5, సూర్యాపేటలో 5.5, మెదక్ 4.3, యాదాద్రి భువనగిరి 4.2, మహబూబ్‌నగర్ 3.1, వికారాబాద్‌లో 3, సిద్ధిపేట 3, రాజన్న సిరిసిల్ల 3, సంగారెడ్డి 2.8, భద్రాద్రి కొత్తగూడెం 2.5, నల్లగొండ2.5, నాగర్‌కర్నూల్ 2.6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న పశ్చిమబెంగాల్, ఉత్తర కోస్తా ఒరిస్సా ప్రాంతాల్లో 0.9 కి.మీల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

దక్షిణ తమిళనాడు దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కి.మీల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఈ ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు 0.9 కి.మీల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాగల మూడురోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Heavy Rains Across the Telangana State

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles