Home జాతీయ వార్తలు కేరళలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం

కేరళలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం

Heavy rains continue in Kerala

న్యూఢిల్లీ: గత కొన్నిరోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు కేరళ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. అయితే రానున్న కొన్ని గంటల్లో కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల వల్ల రైలు, బస్సులకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో వాటి సర్వీసులను అధికారులు నిలిపివేశారు. పంబానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తీర ప్రాంతాలన్ని నీటిలో మునిగిపోయాయి. పలు డ్యామ్‌ల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. బాధితులకు సహాయచర్యలు చేసేందుకు వారికి పునరావాసం కల్పించేందుకు  రూ.400కోట్లు అదనంగా మంజూరు చేయాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖను కేరళ సిఎం పినరయి విజయన్ కోరారు. ఈ నేపథ్యంలో అత్యవసర మంత్రివర్గ సమావేశాన్నిఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.

వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలైతే చెరువులను తలపిస్తున్నాయి. ఈ వర్షాల వల్ల సుమారు 44 మందికిపైగానే చనిపోయారు. వరదల వల్ల సుమారు రూ.8,316 కోట్ల నష్టం వాటిల్లినట్టు కేరళ ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేస్తోంది. తాజాగా ఎర్నాకుళం జిల్లాలో 17,974 మంది బాధితులను 117 పునరావాస కేంద్రాలకు పంపించారు. కేరళలోని కోచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలను సైతం నిషేధించారు. పెరియార్ నదిపై ఉన్న డ్యామ్ నుంచి నీటిని కిందకు పంపడంతోపాటు, ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల విమానాశ్రయం పరిసరాల్లో భారీగా వరదనీరు చేరింది. ఈ విమానాశ్రయం ఈ నదికి సమీపంలోనే ఉండడం గమనార్హం.