Home తాజా వార్తలు మరో మూడురోజులు భారీ వర్షాలు

మరో మూడురోజులు భారీ వర్షాలు

heavy rains for the next three days in Telangana

హైదరాబాద్ : రాబోయే మూడు రోజుల పాటు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రానున్న మూడురోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి, సోమ, మంగళవారాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో చెరువులకు, కుంటలకు జలకళ వచ్చింది.

కొన్ని ప్రాంతాల్లో చెరువులు అలుగు పారుతున్నాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ పంటలు వేస్తున్నారు. ఎపిలో కూడా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తన ద్రోణీతో పాటు ఉత్తర బంగాళాఖాతంలో ఆగస్టు 4వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో ఎపి వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన వర్షపాతానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వనపర్తి జిల్లాలో 156.3 మిల్లీమీటర్ల వర్షపాతం, రంగారెడ్డి 141.5, ఖమ్మం 118.5, మేడ్చల్ మల్కాజిగిరి 103.8, ములుగు 87.5, మహబూబాబాద్ 86.5, భద్రాద్రి కొత్తగూడెం 75.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.