Home తాజా వార్తలు నగరంలో భారీ వర్షాలు

నగరంలో భారీ వర్షాలు

Heavy rains forecast for 24 hours in Hyderabad

 

హైదరాబాద్: భారీ వర్షాలతో నగరం తడిసి ముద్దవుతోంది. చినుకు పడితే చాలు చిత్తడిగా మారే నగరం గడిచిన మూడు రోజులుగా కుండపోత వర్షం కురుస్తుండడంతో జన జీవనం పూర్తిగా స్థంభించింది. వర్షం కురిసినప్పుడల్లా రెండు గంటల వ్యవధిలోనే 4 నుంచి 8 సెం.మి.వర్షపాతం నమోదు అవుతుండడంతో నగరం పూర్తిగా జలమయంగా మారుతోంది. దీంతో లొతట్టు ప్రాంతాల్లో నడుం లోతువరకు నీరు చేరుతుండడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోపైపు రోడ్లపై భారీగా వరద నీరు చేరుతుండడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుండడంతో ప్రయాణికుల కష్టాలు వర్ణాతీతంగామారాయి.

శనివారం మధ్యాహ్నాం ప్రారంభమైన వర్షం నగర వ్యాప్తంగా రాత్రి వరకు కొనసాగగా, ఆదివారం తెల్లవారు జామున తిరిగి భారీ వర్షం కురిసింది. దీంతో నగరం మరోసారి జల దిగ్బంధనంలో చిక్కుకుంది. అయితే తెల్లవారు జాము కావడంతో పాటు ఆదివారం సెలవు దినం కావడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమైయ్యారు. దీంతో వర్షకారణంగా పడే ఇబ్బందులను తప్పించుకున్నారు. అయితే ఉదయం వేళా కురిసిన భారీ వర్షం కారణంగా వారంతపు మార్కెట్లలో కూరగాయాలు వివిధ వస్తువులు అమ్ముకునే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా రైతు బజార్లు, ఇతర కూరగాయ మార్కెట్లు వర్షం కారణంగా పూర్తిగా చిత్తడిగా మారడంతో కోనుగోలుదార్లు అష్టకష్టాలు పడ్డారు.

24 గంటల్లో నగరంలో 10.38 సె.మి. వర్షపాతం నమోదు
శనివారం ఉదయం 8.30 గంటల నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటలకు వరకు నగరంలో 13 ప్రాంతాల్లో 6.45 సె.మి.ల నుంచి 11.5.5 సె.మి. మేర భారీ వర్ష పాతం నమోదైంది. అదేవిధంగా 102 ప్రాంతాల్లో 1.56 సె.మి.ల నుంచి 6.44 సెంమిల వరకు మోస్తారు వర్ష పాతం నమోదుగా కాగా, 33 ప్రాంతాల్లో సాధారణం, ఒక చోట అతి సాధార వర్ష పాతం నమోదైంది. గడచిన 24 గంటల్లో ఉప్పల్ బండ్లగూడ పరిసర ప్రాంతంలో 10.38 సె.మి. వర్షపాతం నమోదు కాగా, కెబిహెచ్‌బిలో 8.68 సె.మి. కాగా, కాప్రాలో 0.5 మి.మి. అతి సల్ఫ వర్షపాతం నమోదైంది. ఈ నెల 4 వ తేదీన ఉత్తర బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడనుండడంతో నగరంలో ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షంతో పాటు గాలులు కూడా తోడు కావడంతో దీంతో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి పడడంతో పాటు విద్యుత్ స్థంబాలు నేలకూలడంతో వైర్లు తెగిపడ్డాయి.

అనేక ప్రాంతాల్లో ప్రధాన రహదారుల్లో చెట్టు విరిగి వాహనాల మీద పడడంతో పలు కార్లు, ద్విచక్రవాహనాలు ధ్వంసం అయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో జిహెచ్‌ఎంసి అత్యవసర సహాయ బృందాలు 24 గంటల పాటు సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలోని వర్షపు నీటిని తక్షణమే తొలగించేందుకు సమస్యత్మక ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన 89 స్టాటిక్ బృందాలు చురుకుగా పని చేస్తున్నాయి. ఈ బృందాలతో పాటు 118 మిని మొబైల్ , మరో 79 మొబైల్ ఎమర్జెన్సీ బృందాలు సహాయ చర్యలను అందిస్తున్నాయి. ఈ బృందాల పాటు పారిశుద్య కార్మికులు, జలమండలి సిబ్బంది, పోలీసులు సైతం సహాయ సహకారాలు అందిస్తు పరిస్థితులను ఎప్పటికప్పుడు చక్కదిద్దుడడంతో నగరవాసులకు కాస్తా ఇబ్బందులు తప్పుతున్నాయి.

Heavy rains forecast for 24 hours in Hyderabad