Friday, March 29, 2024

తెరిపి లేకుండా వానలు

- Advertisement -
- Advertisement -

Mana Telangana news,Telangana Online News,National news in telugu, latest National news in telugu

రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా దంచికొడుతున్న వానలు
రాగల 72 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు.. జంపన్న వాగులో ఇద్దరి గల్లంతు
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. రెండు రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో అన్ని ప్రాంతాలు జలమయ్యాయి. పలుచోట్ల వాగులు, చెరువులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని జిల్లాలో పిడుగులు పడుతుండగా, మరికొన్ని చోట్ల పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తుండగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే రెండు రోజుల పాటు (బుధవారం, గురు, శుక్రవారాల్లో) తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఒకటి రెండు ప్రదేశాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వారు వెల్లడించారు. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.
బలహీనపడిన అల్పపీడనం
పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య పరిసరాల్లోని ఉత్తర ఆంధ్రా, దక్షిణ ఒడిస్సా తీరంల దగ్గర కొనసాగిన అల్పపీడనం మంగళవారం బలహీన పడిందని వాతావరణ శాఖ తెలిపింది. అనుబంధంగా ఉన్న ద్రోణి దక్షిణ ఒడిస్సా నుంచి ఉత్తర కోస్తా ఆంధ్రా మీద కొనసాగుతూ మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయి వరకు వ్యాపించి నైరుతి వైపు కొనసాగుతోందని, దీని కారణంగా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు.
మూడు రోజులు ఉరుములు, మెరుపులు…
రాగల 72 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని నగరంలోని వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మూడు రోజులు ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. దీంతోపాటు గంటకు 30 నుంచి 40కిమీ. వేగంతో కూడిన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. సోమవారం ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉన్న ఉత్తర ఆంధ్రా, దక్షిణ ఒడిస్సా తీరం దగ్గర స్థిరంగా కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా మధ్య ట్రోపోస్పీయర్ స్థాయి వరకు వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి వైపునకు వంపు తిరిగి స్థిరంగా ద్రోణి కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. కుచ్ నుంచి ఉత్తర మధ్య మహారాష్ట్ర, విదర్భ, దక్షిణ ఛత్తీస్‌ఘడ్, ఉత్తర కోస్తా ఆంధ్రా మీదగా అల్పపీడన ప్రాంతం వరకు ద్రోణి వ్యాపించి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
దేశవ్యాప్తంగా విస్తరించిన రుతుపవనాలు: ఐఎండి
నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించాయని, ఐదు రోజుల ఆలస్యంగా ఇవి ఉత్తర భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ(ఐఎండి) వెల్లడించింది.
జంపన్న వాగులో పడి ఇద్దరు యువకుల గల్లంతు
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని జంపన్న వాగులో పడి గల్లంతైన ఇద్దరు యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సోమవారం సాయంత్రం స్నానం కోసం వాగులోకి దిగిన ఇద్దరు యువకులు శ్యామల్‌రావు, కోటేశ్వరరావు ప్రమాదవశాత్తు వాగులో మునిగి గల్లంతయ్యారు. వారి కోసం సోమవారం సాయంత్రం నుంచి గాలిస్తున్నారు. వాగులో నీరు ఎక్కువగా ఉండడంతో వెతకడం కష్టమవుతోంది. గల్లంతైన ఇద్దరు యువకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరుకు చెందినవారిగా గుర్తించారు.

Heavy Rains in Several Areas of Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News