Home తాజా వార్తలు పగబట్టిన వరుణుడు

పగబట్టిన వరుణుడు

వారం రోజులుగా ఎడతెరిపిలేని
వర్షాలతో జనం ఉక్కిరిబిక్కిరి
ఉమ్మడి మహబూబ్‌నగర్,
నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్
జిల్లాల్లో జనజీవనానికి ఆటంకం
 ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద
మరో నాలుగు రోజులు వానలు
వాతవరణ శాఖ హెచ్చరిక

మన తెలంగాణ/హైదరాబాద్: వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తుండడంతో పత్తి, కంది చేలల్లో నీరు ని లిచిపోగా, వరి పంట నీట మునిగింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పత్తి, వరి, కంది, మొక్కజొన్న తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతోపాటు చెరువులు అలుగులు పోస్తుండడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల జనజీవన స్తంభించింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వారంరోజులుగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి వరదనీటిలో ఓ వ్యక్తి కొట్టుకుపోయిన సంఘటన సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఆదివారం రాత్రి సుమారు 7.30 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు స్కూటీ వాహనంపై సరూర్‌నగర్ చెరువుకట్టపై నుంచి కర్మాన్‌ఘాట్ వైపు వస్తున్నారు. అయితే మధ్యలో తపోవన్ కాలనీ వద్దకు రాగానే అక్కడ వేగంగా ప్రవహిస్తున్న వరదనీటిలో చిక్కుకుపోయి స్కూటీ ఆగిపోయింది. దీనితో వెనకాల కూర్చున్న నవీన్‌కుమార్ (45) కిందికి దిగి వాహనాన్ని నెట్టడానికి ప్రయత్నిస్తూ పట్టుతప్పి వరదనీటిలో పడ్డారు. ప్రవాహ వేగం ఎక్కువగా ఉండటంతో నవీన్ ఆ నీటిలో కొట్టుకుపోయాడు. ఇది గమనించిన కొందరు స్థానికులు నవీన్ కాపాడేందుకు ప్రయత్నించగా ఫలితం లేకుండా పోయింది. వెంటనే సమచారాన్ని సరూర్‌నగర్ పోలీసులకు, అగ్నిప్రమాద శాఖ వారికి తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపకశాఖ వారు నవీన్‌కుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షానికి జనజీవనం అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

వాగులో కొట్టుకుపోయిన ఆటో: కాపాడిన గ్రామస్థులు

వికారాబాద్ జిల్లాలోని పెద్దేముల్ మండలం జయరామ్ తండా గ్రామం దగ్గర ఓ ఆటో వాగులో కొట్టుకుపోయింది. అందులో శంకర్‌పల్లి మండలం తెల్లగూడెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రాముడుతో పాటు మరో ఇద్దరున్నారు. గ్రామస్తులు చెప్పినా వినకుండా వాగు దాటేందుకు వారు ప్రయత్నించగా కొంతదూరం రాగానే ప్రవాహంలో ఆటో కొట్టుకుపోయింది. దీంతో గ్రామస్తులు తాడుసాయంతో వారిని కాపాడారు. ఆటోను ఒడ్డుకు తీసుకువచ్చారు.

మరో నాలుగు రోజులు వానలు…

రాష్ట్రంపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనానికి తోడుగా ఈ నెల 20న ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది 24 గంటలు గడిచిన తర్వాత వాయవ్య బంగాళాఖాతం వైపు బలపడనున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్రానికి భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు సైతం కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

ఈనెల 20 శాతం అధికం….

గత నెలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కాగా ఈ నెల కూడా వర్షపాతం అంతేమొత్తంలో నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెల తొలివారంలో వర్షాల తీవ్రత కాస్త తగ్గింది. ఈ నెల పదో తేదీ వరకు అక్కడక్కడా తేలికపాటి వర్షాలే కురవగా 12వ తేదీ నుంచి మళ్లీ ఊపందుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సగటున ప్రతి రోజు వానలు కురుస్తునట్లుగా వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. సెప్టెంబర్‌లో రాష్ట్రంలో సగటు వర్షపాతం 12.7 సెంటీమీటర్లు నమోదు కావాల్సి ఉంది. ఈ లెక్కన ఈ నెల 19వ తేదీ నాటికి వర్ష పాతం 8.18 సెంటీమీటర్లు కురవాల్సి ఉండగా శనివారం నాటికి ఏకంగా 14.8 సెంటీమీటర్లు కురిసింది. సగటు వర్షపాతానికి రెట్టింపు, ఈనెల సాధారణ వర్షపాతం కంటే 20 శాతం అధికంగా వానలు కురిసినట్లు వాతావరణ శాఖ లెక్కలు చెబుతున్నాయి.
ఆదివారం ఉదయం 05.30 గంటలకు అల్పపీడనం

ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 05.30 గంటలకు అల్పపీడనం ఏర్పడిందని, ఉదయం 08.30 గంటలకు అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉందని, ఇది రాగల 24 గంటలలో వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగల 2-3 రోజులలో ఇది వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. తూర్పు-పశ్చిమ shear zone Lat.16.0 deg.N వెంబడి పెనిన్సులర్ భారతదేశం మీదుగా 3.1 కి.మీల నుంచి 7.6 కి.మీల ఎత్తు మధ్య కొనసాగుతోందని, ఇది ఎత్తుకి వెళ్లేకొద్దీ అల్పపీడనానికి అనుబంధ ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మీదుగా దక్షిణ దిశ వైపుకు వంపు తిరిగి ఉందని అధికారులు తెలిపారు. ఈనేపథ్యంలోనే అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు మూడురోజుల పాటు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కోమురంభీం -ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్-పట్టణ, వరంగల్-గ్రామీణ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మూసీ మూడు గేట్లు ఎత్తివేత

మూసీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ మూడు గేట్ల నుంచి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 645 అడుగులు(4.46టిఎంసిలు) కాగా.. ప్రస్తుత నీటి మట్టం 643.60 అడుగులు (4.02టిఎంసిలు)గా ఉంది. అలాగే ఇన్ ఫ్లో3,475 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 6,250 క్యూసెక్కులుగా నమోదయ్యింది.

వరదల్లో నలుగురు గల్లంతు..ఇద్దరు మృతి

రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లడంతో ఇద్దరు మృతి చెందగాచ మరో నలుగురు గల్లంతయ్యారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బోడకొండ వాటర్ ఫాల్స్ వద్ద ప్రమాదం జరిగింది. వాటర్ ఫాల్స్ చూడటానికి వచ్చిన అత్తాపూర్ కు చెందిన 16 సంవత్సరాల బాలుడు ఈశ్వర్ సింగ్ ,కొండ పైనుండి జారీ కింద పడటంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మృతి చెందాడు. అత్తాపూర్ నుండి మొత్తం 11 మంది యువకులు జలపాతాన్ని చూడటానికి వచ్చారు. వారిని అక్కడికి పోకూడదని పోలీసులు హెచ్చరించిన అప్పటికి ఒక వ్యక్తి మాత్రం జలపాతాన్ని చూడాలనే ఉత్సాహంతో కొండ పైకి వెళ్ళాడు. ఆ తర్వాత అక్కడి నుండి జారిపడి తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడని పోలీసులు తెలిపారు. అలాగే సరూర్‌నగర్ తపోవన్ కాలనీలో ఓ వ్యక్తి వరద నీటిలో గల్లంతయ్యాడు. స్కూటీపై వెళ్తూ ఓ నాలా దగ్గర వరద ప్రవాహంలో చిక్కుకున్నారు. వెనుక కూర్చున్న వ్యక్తి స్కూటీని నెడుతున్న సమయంలో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో అందరూ చూస్తుండగానే వ్యక్తి వరద నీటిలో కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న జిహెచ్‌ఎంసి రెస్య్కూ టీమ్, పోలీసులు గాలింపు చేపట్టారు. అలాగే పెద్దేముల్ మండలంలో ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో హన్మాపూర్-జైరాం తండా మధ్య కాలువ దాటుతుండగా కొట్టుకుపోయింది. గమనించిన స్థానికులు తాడు సాయంతో ఆటోను బయటకు తీశారు. దీంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. నగరంలోని చైతన్యపురి కాలనీ ప్రాంతంలో వరదలో గుర్తు తెలియని వ్యక్తి గల్లంతయ్యాడు.మహబూబ్‌నగర్ జిల్లాలో దుందుభి వాగు ఉదృ్ధతంగా ప్రవహిస్తున్న సమయంలో లింగంపేట గ్రామ సమీపంలోని చెక్ డ్యాం వద్ద అఫ్రోజ్ అనే యువకుడు సెల్ఫీ తీసుకునే క్రమంలో గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న అధికారులు అక్కడకు చేరుకుని ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఒక చెట్టు ఆగిన చోట యువకుని మృతదేహాన్ని గుర్తించి బయటకు తీసి జడ్చర్ల ఆసుపత్రికి తరలించారు. భారీ వానల కారణంగా వాగు పరిసర ప్రాంతాల్లో ఈతకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు