Thursday, April 25, 2024

ఉప్పొంగిన గోదావరి

- Advertisement -
- Advertisement -

ప్రాజెక్టులకు జలకళ

 భారీ వర్షాలతో ఎగువ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వరద
 భద్రాచలం వద్ద తొలి ప్రమాద హెచ్చరిక జారీ
 పర్ణశాల వద్ద నీట మునిగిన సీతమ్మ నారచీరల ప్రాంతం
 తాలిపేరు 23 గేట్లు ఎత్తివేత
 పలు జిల్లాల్లోనూ వర్ష బీభత్సం
 అక్కడక్కడ కొట్టుకపోయిన రోడ్లు, కల్వర్టులు, రవాణాకు విఘాతం
 సింగరేణిలో బొగ్గు గనుల్లోకి వరద నీరు, ఉత్పత్తికి ఆటంకం
 లక్ష్మీ, సరస్వతి బ్యారేజీలకు పోటెత్తుతున్న వరద
 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
 మరో మూడు రోజులు వానలు

Heavy Rains in Telangana for next 2days

మనతెలంగాణ/హైదరాబాద్: కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కల్వర్టులు కొట్టుకపోతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ బిక్కుబిక్కు మంటున్నాయి. అధిక వరద నీటి ప్రవాహం ఉన్న ప్రాజెక్టులు, దాని ప్రభావం అధికంగా ఉంటే ప్రాంతాలపై సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కిందిస్థాయి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రాణ నష్టం జరగకుండా ముందస్తూ చర్యలు తీసుకున్నారు. కాగా వరద నీటి కారణంగా గోదావరి నది ప్రళయ రూపం దాల్చింది. దీంతో భద్రాచలం వద్ద అధికారులు తొలి హెచ్చరికను జారీ చేశారు. గురువారం సాయంత్రం 35.5 అడుగుల నీటి మట్టం ఉండగా.. శుక్రవారం సాయంత్రం 37.3 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాలు అప్రమత్తం చేశారు. గోదావరి వరద పోటుతో ముంపునకు గురయ్యే తోలట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఇప్పటికే జిల్లా యంత్రానికి కలెక్టర్ ఎంవి రెడ్డి ఆదేశించారు.

అలాగే గోదావరి వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీచేశారు. గోదావరి ప్రవాహానికి పర్ణశాల వద్ద సీతమ్మ నారచీరల ప్రాంతం వరద నీటిలో మునిగిపోయింది. తాలిపేరు ఉగ్రరూపంభారీ వర్షాలతో పాటు ఎగువ నుంచి వచ్చి చేరుతున్న వరద ప్రవాహంతో తాలిపేరు ఉగ్రరూపం దాల్చింది. జలాశయంలో 25గేట్లకు గానూ 23 గేట్లు ఎత్తి లక్షా 28 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువ గోదావరికి విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న చింతవాగు, రోటెంతవాగులు ప్రమాద స్థాయిలో ప్రవహించి తాలిపేరులో కలుస్తున్నాయి. వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని ప్రాజెక్టు ఈఈ రాంప్రసాద్ వెల్లడించారు. లోతట్టు ప్రాంతాలైన తేగడ, గుంపెనగూడెం, దండుపేట, కేశవపురం గ్రామాలను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారం సరస్వతి బ్యారేజికు కూడా భారీగా వరద నీరు రావడంతో ప్రమాద స్థాయికి చేరుకుంది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ ప్రాజెక్టు నుంచి 11 గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేశారు. అలాగే మానేరు స్థానికవ వాగుల ద్వారా వచ్చే ప్రవాహం ఇన్‌ఫ్లో 36,480 క్యూసెక్కులు. అవుట్‌ఫ్లో 50వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లుఎడతెరిపిలేని వర్షాలతో ప్రధాన జలాశయాలకు వరద పోటెత్తుతోంది. కోట్‌పల్లి ప్రాజెక్టు అలుగు పారడంతో నీటి ప్రవాహంతో నాగసమందర్, వికారాబాద్ జిల్లా కేంద్రానికి మధ్యలో ఉన్న కల్వర్టు కొట్టుకుపోయింది. అటు తాండూర్, వికారాబాద్ మధ్యలోని మంచన్ పల్లి దగ్గర ప్రధాన రహదారి కల్వర్టు కొట్టుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లా కురవిమండలం, తాళ్లసంకీస గ్రామంలో పెద్దచెరువు నిండిపోవడంతో హైవేలో ఉన్న లెవల్ వంతెనపై నుంచి అలుగుపారుతోంది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతోపాటు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. వర్షపు నీరు వచ్చి చేరడంతో రామగుండం రీజీయన్‌లో నాలుగు ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రోజుకు దాదాపు 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడిందని అధికారులు తెలిపారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల రోడ్లు దెబ్బతినడంతో పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుండగా, మరికొన్ని చోట్ల రహదారులపై చెట్లు నేలకొరగడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

మేజర్ 71 కాల్వకు తక్షిణ మరమ్మతులు చేయించిన మంత్రి
సూర్యాపేట జిల్లాకు పరుగులు పెడుతున్న కాళేశ్వరం జలాలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం వద్ద డిస్ట్రిబ్యూటర్ మేజర్ 71 కాల్వకు శుక్రవారం ఉదయం గండి పడింది. విషయం తెలుసుకున్న వెంటనే మంత్రి జగదీశ్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్‌తో కలిసి గండి పడిన కాల్వ వద్దకు చేరుకున్నారు. అప్పటికప్పుడు నీటిపారుదల శాఖ అధికారులను కాల్వ వద్దకు రప్పించి పరిస్థితులను సమీక్షించి మరమ్మతు పనులను ప్రారంభించారు. అధికారులు రంగంలోకి దిగి మరమ్మతులు చేయడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
పరవళ్లు తొక్కుతున్న ప్రాణహిత
గోదావరి ఎగువన రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత పరవళ్లు తొక్కుతోంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు నిండి ఆ నీరంతా వచ్చి చేరుతుండటంతో ప్రాణహిత ఉప్పొంగుతోంది. ఇదే సమయంలో గోదావరి పరీవాహకంలోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో రెండు నదులు కలిసే కాళేశ్వరం వద్ద గోదావరిలో 3.79 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదయ్యింది. ఈ మొత్తం సీజన్‌లో ఇవే గరిష్ట ప్రవాహాలు కాగా, మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ప్రాజెక్టుల్లోకి కొత్త నీరు
అన్నారం బ్యారేజీలోకి స్థానికంగా ఉన్న మానేరు నది నుంచి 24 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు వస్తున్నాయి. దీనిలో 10.87 టిఎంసిలకు 9.25 టిఎంసిల మేర నీటి నిల్వ ఉండటంతో 8 పంపుల ద్వారా 20వేల క్యూసెక్కులకు పైగా నీటిని సుందిళ్లలోకి పంపింగ్ చేస్తున్నారు. సుందిళ్లకు వస్తున్న నీటిని వచ్చినవి వచ్చినట్లు ఎల్లంపల్లికి పంపింగ్ చేస్తున్నారు. ఎగువ పంపింగ్ చేస్తున్న నీటికి తోడు స్థానిక ప్రవాహాలు కలిసి ఎల్లంపల్లిలోకి ప్రస్తుతం 25,916 క్యూసెక్కుల మేర ప్రవాహాలు వస్తున్నాయి. దీంతో ఎల్లంపల్లిలో నీటి నిల్వ 20.18 టిఎంసిలకు గాను 12 టిఎంసిలకు చేరింది. ఇక్కడి నుంచి నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల ద్వారా మిడ్‌మానేరుకు నీటి తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం మిడ్‌మానేరులోకి 21వేల క్యూసెక్కుల మేర నీటిని ఎత్తిపోస్తుండగా నిల్వ 25.87 టిఎంసిలకు 15.31 టిఎంసిలకు చేరింది. అన్నారం నుంచి మిడ్‌మానేరు వరకు కాళేశ్వరం ద్వారా గోదావరి ఎత్తిపోతలను మరో వారంపాటు కొనసాగించనున్నారు. రోజుకు రెండు టిఎంసిల చొప్పున కనీసంగా 14 టిఎంసిల నీటిని ఎత్తిపోసినా మిడ్‌మానేరు, ఎల్లంపల్లి పూర్తిగా నిండనున్నాయి. ఇక శ్రీరాంసాగర్‌లోకి నీటి ప్రవాహాలు స్థిరంగా నమోదవుతున్నాయి. ప్రాజెక్టులోకి 23,522 క్యూసెక్కుల మేర వరద వస్తుండగా, ప్రాజెక్టులో నిల్వ 90 టిఎంసిలకుగాను 41 టిఎంసిలకు చేరింది. ఇప్పటివరకు ప్రాజెక్టులోకి మొత్తంగా 27 టిఎంసిల మేర కొత్త నీరు వచ్చి చేరింది.

అన్ని గేట్లు ఎత్తి 4 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు
కాళేశ్వరం వద్ద ఏటా జూన్ రెండో వారం నుంచే ప్రవాహాలు మొదలవుతుండగా, ఈ ఏడాది జూలై మొదటి వారం నుంచి ప్రవాహాలు మొదలయ్యాయి. గతేడాది జూలై మొదటి వారం నుంచే 50వేల క్యూసెక్కులకు పైగా నీరు రాగా, ఈ ఏడాది జూలై చివరి వారం నుంచి 50వేల నుంచి 1.10 లక్షల క్యూసెక్కుల వరకు ప్రవాహాలు వచ్చాయి. అయినా అవి మళ్లీ 80వేల క్యూసెక్కులకు తగ్గిపోయాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో కాస్త పుంజుకొని, ఈ నెల 11న 83వేల క్యూసెక్కుల మేర నమోదుకాగా, 12న 2లక్షల క్యూసెక్కులకు పెరిగాయి. ఇక 13న గురువారం ఏకంగా 3.79 లక్షల క్యూసెక్కులకు చేరింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో ఇప్పటికే 16.17 టిఎంసిలకు గాను 9.20 టిఎంసిల మేర నీరు నిల్వ ఉండటంతో అన్ని గేట్లు ఎత్తి 4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ నదిలోకి వదిలేస్తున్నారు. ఇక మేడిగడ్డ పంపుహౌస్‌లోని పంపులను సైతం నిలిపివేశారు.
హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఈ సీజన్‌లో బంగాళాఖాతంలో దాదాపు మూడోసారి అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ సీజన్‌లో రాష్ట్రంలో గురువారం నాటికి సాధారణ వర్షపాతం 47.3 సెంటిమీటర్లు కాగా, ఇప్పటికే 56.9 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. గురువారం ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరో మూడురోజుల పాటు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణతో పాటు హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో ఈదురు గాలులతో పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Heavy Rains in Telangana for next 2days

నేడు, రేపు వానలు:
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శుక్రవారం రాత్రి, శని, ఆదివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా శనివారం ఆదిలాబాద్, నిర్మల్, కొమురంభీం -ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్-పట్టణ, గ్రామీణ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశ ఉందని అధికారులు పేర్కొన్నారు.
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
రాష్ట్ర వ్యాప్తంగా నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో రానున్న ఐదు రోజుల పాటు కొన్నిచోట్ల భారీవర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కురిసిన వర్షపాతం వివరాలు..
రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం 83.5 మిల్లీమీటర్లు, మహబూబాబాద్ 56.8, వరంగల్ రూరల్ 96.8, ఖమ్మం 88, ములుగు 126.5, పెద్దపల్లి 49.5, జయశంకర్ భూపాలపల్లి 75.3, కరీంనగర్ 47.3, మంచిర్యాల 42.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.

Heavy Rains in Telangana for next 2days

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News