Friday, April 19, 2024

ఇరు రాష్ట్రాల్లో మారిపోయిన వాతావరణం

- Advertisement -
- Advertisement -

Heavy Rains

 

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వాతావరణం చల్లబడింది. చలికాలంలో వర్షాలు పడుతున్నాయి. ఆకాశమంతా మబ్బు పట్టి అక్కడక్కడ వర్షం కురుస్తోంది. అయితే మరో రెండు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు నుంచి ఛత్తీస్‌గఢ్ వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో ఆదివారం, సోమవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

1.5 కి.మీల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం
దక్షిణ ఇంటీరియర్ ఒరిస్సా దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కి.మీల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ తమిళనాడు నుంచి ఛత్తీస్‌గఢ్ వరకు ఇంటీరియర్ కర్ణాటక మరఠ్వాడ, విదర్భ మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడిందని అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఆగ్నేయ దిశ/తూర్పు దిశ నుంచి గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.

ఖమ్మం జిల్లాల్లో…
ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం తెల్లవారు జామున జిల్లాలోని కూసుమంచి పరిసరాల్లో భారీ వర్షం పడింది. దీంతో కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి మొత్తం తడిసింది. ఆరుగాలం కష్టించి పండించిన పంట వర్షార్పణం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట కోసం వేల రూపాయల పెట్టుబడి పెట్టామని, పంట చేతికొచ్చిన సమయంలో వర్షం తీరని నష్టాన్ని మిగిల్చిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జయశంకర్ భూపాల జిల్లాలో..
జయశంకర్ భూపాల జిల్లాలోని మహదేవపూర్, పలిమేల, మహముత్తారం, కాటారం మల్హర్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. మిర్చితో పాటు వరి పంట నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

మిర్యాలగూడ..
నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడను అకాల వర్షం ముంచెత్తింది. తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లో వరద నీరు పొంగి పొర్లింది. చెరువులు కుంటల్లోకి వరద నీరు చేరి సమీప ప్రాంతాల నుంచి పంట పొలాల్లోకి వరద నీరు ప్రవహించింది. వ్యవసాయ విద్యుత్ మోటార్లు నీట మునిగడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎపిలో…
ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాతో పాటు ఉత్తరాంధ్రలో పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. తమిళనాడు నుంచి కోస్తా తీరం మీదుగా, ఒడిశా వరకు ఉపరితల ద్రోణి ఏర్పడటంతో వర్షాలు పడుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గత రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో ఓ మోసర్తు వర్షం కురుస్తోంది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో స్వల్ప వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లా తెనాలిలో చలిగాలులతో కూడిన వర్షం పడడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు.

Heavy rains in Telangana over next two days
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News