Home Default తెలంగాణలో భారీ వర్షాలు

తెలంగాణలో భారీ వర్షాలు

Heavy Rains In Telangana Stateహైదరాబాద్‌: ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కుండపోతగా వర్షం కురిసింది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఎడతెరికి లేకుండా భారీ వర్షం పడింది. ఈక్రమంలో హైదరాబాద్‌లో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నాగోల్‌ పరిధిలోని బండ్లగూడలో అత్యధికంగా 21.2 సెంటీమీటర్లు, వనస్థలిపురంలో 19.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వారు పేర్కొన్నారు..   జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండల పరిధిలోని బస్వాపూర్‌ వద్ద వరద ఉధృతంగా అధికంగా ఉంది.  బస్వాపూర్‌ సమీపంలో ఉన్న మోయతుమ్మెద వాగుకు వరదనీరు  పోటెత్తింది. సిద్దిపేట-హన్మకొండ రోడ్డులో బ్రిడ్జిపై నుంచి వాగు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నంగునూరు, ధూళిమిట్ట మండలాల్లో చెక్‌డ్యామ్‌లు పొంగిపొర్లుతున్నాయి. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల పరిధిలోని దాచారం వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఈ క్రమంలో సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండల పరిధిలో కురిసిన వానలకు ఏట్ల ఎర్రవల్లి వాగుకు వరదనీరు రావడంతో ఉప్పొంగి ప్రవహిస్తున్నది. దీంతో దేవరపల్లి గ్రామ ప్రజలు నాగరగూడ వైపు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. కరీంనగర్‌, మానకొండూరు, శంకరపట్నం, జమ్మికుంట, వీణవంక, కమలాపూర్‌, గంగాధర, ఎల్లారెడ్డిపేట, రుద్రంగి, చందుర్తి, మెట్‌పల్లిలో భారీ వర్షం పడింది. కథలాపూర్‌ మండలంలో కురిసిన వర్షాలతో వరదకాలువ బ్రిడ్జిపై భారీగా నీరు నిలిచిపోయి, రాకపోకలు స్తంభించిపోయాయి.  వేములవాడలో బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం పడింది. ఈ భారీ వర్షంతో రాజన్న ఆలయ ప్రాంగణం జలమయమైంది. ఆలయం ముందు, పాత ఆంధ్రబ్యాంక్ వద్ద డ్రైనేజ్ సరిగా లేకపోవడంతో మురికి నీరు పరిసర ప్రాంతాల్లో ఉన్న దుకాణాల్లోకి చేరడంతో  సరుకులు, సామాన్లు  తడిసి ముద్దయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌పై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో ద్రోణి ఏర్పడింది. ఈ క్రమంలో రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. గురువారం కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావారణ శాఖ అధికారులు హెచ్చరించారు.