Home తాజా వార్తలు వరుణుడి ప్రకోపం

వరుణుడి ప్రకోపం

Heavy Rains to continue four days in 6 districts

 

వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం

నాలుగు రోజులుగా ఆరు జిల్లాలను కుదిపేస్తున్న భారీ వర్షాలు
మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలను ముంచెత్తిన వాన, 500 ఎకరాల్లో నీట మునిగిన పత్తి
ఆర్‌డిఎస్ కాలువకు గండి
నల్లగొండ జిల్లాలో 4,836 ఎకరాల్లో పంట నష్టం
హైదరాబాద్‌ను వీడని వర్షం
నాలాలో కొట్టుకొచ్చిన మహిళ కాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వరుణుడు తన ప్రకోపాన్ని చూపుతున్నాడు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నల్గొండ జిల్లాలు అతలా కుతలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. రహదారులు అధ్వాన్నంగా మా రాయి. రోడ్లపై చేరిన వరద, వర్షపు నీరు సమీప ఇండ్లలోకి చేరుతోంది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థల పాలయ్యారు. ఎగువ నుంచి వస్తున్న వరదనీరు, రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పలు చోట్ల చెరువులు, కుంటలకు గండ్లు పడ్డాయి. మరోవైపు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల కల్వర్టులు దెబ్బతిన్నాయి. చెరువులు అలుగు పోస్తుండటంతో వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లుతోంది.

నల్గొండలో 4836 ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. తొమ్మిది మండలాల్లో 44 గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసా య శాఖ విభాగం అంచనా ప్రకారం 321 మంది రైతులకు చెందిన 1664 ఎకరాల్లో 3172 ఎకరాల్లో వరి పం టలు దెబ్బతిన్నట్లుగా సమాచారం. శనివారం తెల్లవారు జాము నుంచి గద్వాల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. గద్వాల్‌లో కుండపోతగా వర్షం కురియడంతో కుంటవీధి, నల్లకుంట, సుంకులమ్మమెట్టు తదితర ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వరదనీరు చేరింది. నిత్యావసర వస్తువులు తదితరాలు తడిసి ముద్దయ్యాయి. గద్వాల పాతబస్టాండ్ వద్ద భారీగా వరద నీరు నిలిచింది. కేటిదొడ్డి మండలం నందిన్నె వద్ద రాయచూర్ రహదారిపై తాత్కాలిక వంతెన కొట్టుకుపోయి లారీ వరదలో చిక్కుకుపోయింది.

మానవపాడు వద్ద పెద్దవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో మానవపాడు, అమరవాయి గ్రామా ల మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఇటిక్యాల మండలంలో సతర్ల వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. మానవపాడు మండల కేంద్ర సమీపంలో ఉన్న ఆర్డీఎస్ కాలువకు గండిపడింది. డి30 వద్ద కాలువ తెగిపోవడంతో పంటపొలాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. తీవ్రంగా పంటనష్టం వాటిల్లింది. మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని సీతారాంపేట గ్రామంలోని ప్రధాన చెరువుకు వరదనీరు రావడం వల్ల చెరువుకట్టకు గండిపడింది. అక్కడ వరదనీరు పొంగిపొర్లుతూ ఆయకట్టు పొలాలాను నిండా ముంచేసింది. సుమారు ఐదు వందల ఎకరాల్లో పత్తి పంట నీట మునిగినట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో చెరువులు, కుంటలు పొం గిపొర్లుతూ పంటలు నీట మునిగాయి.

రహదారులు ధ్వంసమయ్యాయి. గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కౌకుంట్ల గ్రామంలో కుంటలు తెగిపోవడం వల్ల కౌకుంట్లతో పాటు రాజోలి వెంకటగిరి, రేకులపల్లి తదితర గ్రామాల్లో 2 వేల ఎకరాల పత్తి పంట నీట మునిగింది. చింతకుంట మండలంలో ముత్యాల చెరువుకు గండిపడి పలు గ్రామాలు జలమయం అయ్యాయి. అడ్డాకులు, మూసాపేట, భూత్‌పూర్ మండలాల్లోనూ వాగులు పొంగిపొర్లుతున్నాయి. వనపర్తి జిల్లా పెద్ద మందడి, ఖిల్లా ఘణపురం మండలాల్లో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వెల్టూరు సమీపంలో రహదారిపై భారీగా వరద నీరు చేరింది. మోజెర్లలో ఇళ్లల్లోకి నీరు చేరింది. చెరువులు అలుగు పారడం వల్ల పలు గ్రామాల్లో పంట నీట మునిగింది. అచ్చంపేట నియోజకవర్గంలోనూ కుండపోత వర్షం కురిసింది. కాలనీలోని రోడ్లు చెరువులను తలపించాయి.

రోడ్లపై మోకాళ్ల లోతు వరదనీరు ప్రవహించింది. అంబటిపల్లియాపట్ల గ్రామాల మధ్య వంతెనపై నీరు పొంగిపొర్లడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది. వికారాబాద్ జిల్లాలోని పరిగి, నస్కల్‌లో మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. మరికొన్ని చోట్ల పంటలు నీట మునిగాయి. కాలువలు, కుంటలు తెగి నెస్కల్ గ్రామంలోని ఎస్సీ కాలనీలోని ఇళ్లల్లో మురుగునీరు ప్రవేశించింది. పరిగి నుంచి నస్కల్, వికారాబాద్ వెళ్లే రహదారి వరదనీటిలో మునిగిపోగా రాకపోకలు నిలిచిపోయాయి. నస్కల్‌లో సైడ్ డ్రైనేజీ లేకపోవడం వల్ల వరద నీరు నేరుగా ఇళ్లల్లోకి వస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లికి సమీపంలోని మూసీవాగు, తీగలవాగు పొంగి పొర్లుతున్నాయి. దీంతో వరద నీరు శంకర్‌పల్లి పట్టణంలోకి భారీగా చేరింది. పట్టణమంతా నదిని తలపిస్తోంది.

భాగ్యనగరాన్ని వీడని వరుణుడు.
భాగ్యనగరాన్ని వరుణుడు వీడటం లేదు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దయింది. శనివారం నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దాదాపుగా గంటపాడు వర్షం దంచికొట్టింది. ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు వీచాయి. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, మాదాపూర్, గచ్చిబౌలి, పంజాగుట్ట, కూకట్‌పల్లి, మైత్రీవనం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కూకట్‌పల్లిలో గరిష్టంగా 4.8 సెంమీల వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రోడ్లన్నీ జలమయ్యాయి. ట్రాఫిక్ జామ్‌లతో వాహన చోదకులు ఇక్కట్ల పాలయ్యారు. కొన్ని చోట్ల విద్యుత్‌కు అంతరాయమేర్పడింది. తెరిపి ఇచ్చినట్లే ఇచ్చి వర్షం కురుస్తుండటంతో భాగ్యనగర్ వాసుల ఇక్కట్లు అంతా ఇంతా కాదు. ఇదిలా ఉండగా, మళ్లీ మూడ్రోజుల వర్ష సూచనతో భాగ్యనగర్ వాసులు బెంబేలెత్తుతున్నారు.

20 ఏళ్ల తర్వాత అలుగు పారుతున్న ఊరచెరువు
మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం శాగాపూర్ సమీపంలోని ఊరచెరువు 20 ఏళ్ల తర్వాత అలుగు పారుతోంది. వరదనీటి ఉద్ధృతిలో 44వ జాతీయరహదారిపై ఉన్న కల్వర్టు దెబ్బతింది. కర్నూల్ నుండి హైదరాబాద్ వెళ్లే జాతీయరహదారి కుంగిపోవడం వల్ల గ్రామస్తులు అప్రమత్తమై ఆ దారిలో వచ్చే వాహనాలను నిలిపివేశారు. వాహనాల రాకపోకలను హైదరాబాద్‌బెంగళూరు రహదారివైపు మళ్లించారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మత్తులు చేపట్టారు.

సెల్ఫీ దిగేందుకు వెళ్లి కొట్టుకుపోయిన యువకుడు
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం లింగంపేట గ్రామ సమీపంలోని దుందుబి వాగులో విషాదం చోటు చేసుకుంది. ఏళ్ల తరువాత నిండుగా ప్రవహిస్తోన్న దుందుభి వాగును చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వాగులో ఈత కొడుతూ సరదాగా సెల్ఫీలు దిగుతున్నారు. ఈ క్రమంలోనే అఫ్రోజ్ అనే 22 ఏళ్ల యువకుడు ఈత కొడుతూ సెల్ఫీదిగేందుకు యత్నించాడు. ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం వల్ల అందరూ చూస్తుండగానే అప్రోజ్ కొట్టుకుపోయాడు. గల్లంతుకు ముందు.. స్థానికులు స్పందించి కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. సమాచారం తెలిసి అధికారులు సైతం సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. ఎంత వెతికినా వాగు ఉద్ధృతికి అఫ్రోజ్ కన్పించలేదు. దీంతో ప్రజలెవ్వరూ వాగు వద్దకు వెళ్లకూడదని అధికారులు హెచ్చ రికలు జారీ చేశారు.

హైదరాబాద్ నాలాలో కొట్టుకొచ్చిన మహిళ కాలు..?
హైదరాబాద్‌లోని చంపాపేట రెడ్డి బస్తీలోని నాలాలో మహిళ కాలు కొట్టుకొచ్చి కనిపించడంతో కలకలం రేగింది. స్థానికులలో భయాందోళన మొదలైంది. ఇది ఎవరి కాలు అయి ఉంటుందని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు.. చుట్టుపక్కల డెడ్‌బాడీ కనిపిస్తుందేమోనని నాలాలో వెతికినా కనిపించకపోవడంతో డయల్ 100కి ఫోన్ చేసి సమాచారం అందించారు. సంఘటనస్థలానికి సైదాబాద్ పోలీసులు చేరుకుని ఆ కాలుని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

మరో మూడ్రోజుల పాటు భారీ వర్ష సూచన
రానున్న మూడు రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, జనగామ, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర సంచాలకులు తెలిపారు. ఉత్తర కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో 0.9 కి.మీ. ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని.. ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఆదివారం నాడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ సంచాలకులు పేర్కొన్నారు. రానున్న 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం బలపడే అవకాశం ఉందని తెలిపారు.

Heavy Rains to continue four days in 6 districts