Home ఎడిటోరియల్ విదేశీ సహాయానికి నో

విదేశీ సహాయానికి నో

Help from foreign governments

కేరళ వరద బాధితుల పునరావాసం నిమిత్తం విదేశీ ప్రభుత్వాల నుంచి సహాయం స్వీకరించరాదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించటంతో, యుఎఇ ప్రభుత్వం ప్రతిపాదించిన రూ. 700 కోట్ల సహాయాన్ని స్వీకరించటంపై కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చకు తెరపడింది. ప్రకృతి విపత్సమయాల్లో సహాయ, పునరావాస చర్యలను అంతర్గత వనరులతో చేబట్టగల సామర్థం భారత్‌కుందని, విదేశీ సహాయం స్వీకరించరాదని 15 ఏళ్లనాడు 2001లో గుజరాత్ భూకంపం, 2004లో తమిళనాడు తీరంలో సునామీ నేపథ్యంలో నాటి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను సాంప్రదాయంగా పాటిస్తున్నట్లు, ఇప్పుడు దాన్ని మార్చవలసిన అవసరం లేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం స్పష్టం చేసింది.

కేరళకు సహాయం అందించటానికి తమ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను భారత ప్రభుత్వం సున్నితంగా తిరస్కరించినట్లు థాయిలాండ్ రాయబారి సోషల్ మీడియా ద్వారా ముందుగా వెల్లడించారు. తదుపరి కొన్ని గంటల్లోనే భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రభుత్వ వైఖరిని అధికారికంగా ప్రకటించింది. అయితే ఎన్‌ఆర్‌ఐలు, ప్రవాస భారతీయులు, ట్రస్టులవంటి సంస్థలు ప్రధానమంత్రి సహాయ నిధికి లేదా ముఖ్యమంత్రి విపత్తుల నిధికి విరాళాలు ఇవ్వవచ్చునని ఎంఇఎ అధికార ప్రతినిధి చెప్పారు. ఇదిలా ఉండగా, తమ దేశం సంస్థల ద్వారా కేరళకు సహాయం అందిస్తున్నట్లు అబుధాబి యువరాజు చెప్పారు.

భారత ప్రభుత్వం తన వైఖరిని అధికారికంగా స్పష్టం చేసిన తదుపరి దానిపై మీమాంస వల్ల ప్రస్తుతానికి ప్రయోజనం లేదు. అయితే “ప్రస్తుత విధానం ప్రకారం, అంతర్గత ప్రయత్నాల ద్వారా సహాయ, పునరావాస అవసరాలు తీర్చటానికి ప్రభుత్వం నిబద్ధమై ఉంది” అని ఎంఇఎ అధికార ప్రతినిధి స్పష్టం చేసినందున జల విలయంతో సర్వనాశనమైన కేరళ జిల్లాలను సంపూర్ణంగా ఆదుకోవలసిన బాధ్యతను సిద్ధాంతరీత్యా కేంద్ర ప్రభుత్వం స్వీకరించినట్లయింది. సహాయక చర్యల నిమిత్తం తక్షణ సహాయంగా కేరళ ప్రభుత్వం దాదాపు రూ. 2 వేల కోట్లు కోరగా, కేంద్రం రూ. 600 కోట్లతో సరిపెట్టింది. సంభవించిన నష్టాలు, పునరావాసానికయ్యే వ్యయం గూర్చి అధికారిక అంచనాల తదుపరి మరికొంత మంజూరు చేయవచ్చు. ఈ ఆపత్సమయంలో కేరళకు విడుదల చేసిన రేషన్ బియ్యానికి డబ్బు కట్టమని కోరిన ప్రభుత్వమిది.

ఈ అమానవీయ డిమాండ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాక డబ్బు కట్టనవసరం లేదని కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి రాం విలాస్ పాశ్వాన్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర సంస్థలు, సంఘాలు, వ్యక్తుల సహాయం ఇప్పటికి రూ. 300 కోట్లకు పైగా కేరళ ప్రభుత్వానికి అందింది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న కృషివల్ల మరికొద్ది వందల కోట్లు సహాయం అందుతుంది. అయితే కేరళకు సంభవించిన నష్టం రూ. 25 వేల కోట్లుగా అంచనా. కేరళ ఈ విపత్తు నుంచి కోలుకుని తన కాళ్లపై తాను నిలబడాలంటే కేంద్ర ప్రభుత్వం రాజకీయ వివక్ష ఆరోపణలకు తావివ్వకుండా సహాయం అందించాలి. 400 మంది ప్రాణాలు కోల్పోయిన, 10 లక్షల మంది నిరాశ్రయులైన ఈ జల ప్రళయం ఇటీవల కాలంలో ప్రకృతి వైపరీత్యాల్లో అతిపెద్దది.

ఇంతటి విపత్సమయంలో మిత్ర విదేశీ ప్రభుత్వాలు ఇవ్వదలిచిన మానవతా సహాయాన్ని (ఇందులో రాజకీయాలు లేవు, భద్రతా సమస్యలు అంతకన్నా లేవు) నిరాకరించటం సబబా అనే ప్రశ్న ఉదయించటం సహజం. 2016 మే నెలలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ విపత్తు మేనేజిమెంట్ ప్రణాళిక, ఇతర దేశాల నుంచి స్వచ్ఛందంగా అందే సహాయాన్ని స్వీకరించవచ్చునని చెబుతున్నదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గుర్తు చేశారు. ఆర్థిక మంత్రి టి.ఎం.థామస్ ఐజాక్ సంబంధిత క్లాజును ఉట్టంకించారు. ‘అంతర్జాతీయ సహకారం’ అనే అధ్యాయంలో ఇలా ఉంది.

“ప్రకృతి విపత్సమయాల్లో భారత ప్రభుత్వం ఒక విధానంగానే విదేశీ సహాయానికి విజ్ఞప్తి చేయదు. అయితే విపత్తు బాధితుల పట్ల సంఘీభావంతో ఏ విదేశీ ప్రభుత్వమైనా సద్భావనపూర్వకంగా సహాయం చేయడానికి ముందుకు వస్తే ఆ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించవచ్చు. భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ, విదేశీ సహాయ ప్రతిపాదనలను సమీక్షించే బాధ్యత కలిగిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుని ఆ సహాయాన్ని రప్పించాలి. హోం శాఖ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి విదేశీ బృందాలు అందించగల సహాయం అవసరాలను మదింపు చేయాలి.” 2016 ప్రణాళికలో ఇలా ఉన్నప్పుడు 15 ఏళ్ల ఆనవాయితీని విధానంగా పునరుద్ఘాటించటంలో ప్రభుత్వ ఉద్దేశమేమిటో దానికే తెలియాలి.