Home దునియా యాక్టర్ అవ్వడమే పెద్ద గెలుపు

యాక్టర్ అవ్వడమే పెద్ద గెలుపు

ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఏక్టివ్‌గా ఉండే విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఒక పెను తుఫాన్ సృష్టించాడు. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. మెడికల్ స్టూడెంట్‌గా టైటిల్ రోల్ పోషించిన విజయ్ అద్భుత నటనతో అదరగొట్టాడు. తమిళంలోనూ ఈ మూవీని రీమేక్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి పాత్రలో ఒదిగిన తీరుకు మూవీ ఫ్యాన్స్ ఫిదా కాగా.. ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఎన్టీఆర్, ప్రభాస్, చిరంజీవి, బాలయ్య లాంటి హీరోలను పక్కకు నెట్టి మరీ విజయ్ ఫిల్మ్‌ఫేర్‌ను దక్కించుకున్నాడు.

Vijaya-Devara-Konda

మొట్టమొదటి ఫిల్మ్‌ఫేర్‌ను ఎవరైనా ఎంతో అపురూపంగా చూసుకుంటారు. కానీ ‘అర్జున్ రెడ్డి’ మాత్రం ఓ మంచి పని కోసం దాన్ని వేలం వేసేందుకు నిర్ణయించుకున్నాడు. “రోజూ ట్విట్టర్లో చూస్తా, ఎంతో మంది సాయం కోరితే కేటీఆర్ అన్న సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సాయం చేస్తారు. నా తొలి అవార్డు వేలంలో అమ్ముడుపోతే ఆ డబ్బును తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చేస్తాను. ప్రజల్లోనూ అవగాహన వస్తుంది కదా” అని విజయ్ ట్వీట్ చేశాడు. ‘ఈ అవార్డ్ ఒక బోనస్. దీన్ని ఇంట్లో షెల్ఫ్ మీద ఉంచడం కంటే నేను పుట్టిన ఈ సిటీకి ఇది మరింత ఉపయోగకరం’ అని ట్వీట్ చేశాడు.

వెంటనే ట్వీట్‌కు స్పందించిన మంత్రి కెటిఆర్  “సీఎం రిలీఫ్ ఫండ్‌కి నువ్వు సాయం చేయాలని అనుకోవడం ఆనందంగా ఉంది. నీ చొరవను అభినందిస్తున్నా. ఈ విషయంలో ఏం చేయాలో మాట్లాడదాం” అని కెటిఆర్ బదులిచ్చారు. కెటిఆర్ ట్వీట్‌కి విజయ్  స్పందిస్తూ.. అలాగే అన్నా, ఫిల్మ్‌ఫేర్‌తో అనుబంధం ఏర్పడక ముందే దాన్ని ఇంట్లోనో లేదంటే ఆఫీసులోనో ఉంచేస్తానంటూ ట్వీట్ చేశాడు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం తొలి ఫిల్మ్‌ఫేర్‌ను వేలం వేయాలని విజయ్ నిర్ణయించడంపై ఫ్యాన్స్, నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గెలుపు కొత్తకాదు, ఈ అవార్డు బోనస్. నా వరకు నేను యాక్టర్ అవ్వడమే పెద్ద గెలుపు. ఇండస్ట్రీ రెస్పెక్ట్, డబ్బులు ఇచ్చినపుడు మరోసారి గెలిచినట్లు అనిపించింది. అమ్మానాన్నకు ఇల్లు కట్టించి ఇచ్చినప్పుడు గెలిచినట్టు అనిపించింది. మళ్లీ అంతా అభినందిస్తుంటే గెలిచినట్టు అనిపిస్తోంది.  ప్రస్తుతం గీతా ఆర్ట్ బ్యానర్‌లో ‘టాక్సీవాలా’తో పాటు ‘నోటా’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలు చేస్తున్నాడు.

ముద్దుపేరు: విజ్జు
పుట్టిన తేదీ: మే 9, 1989
పుట్టిన ఊరు : అచ్చంపేట, నాగల్‌కర్నూల్ జిల్లా
చదువు: పుట్టపర్తి శ్రీ సత్యసాయి స్కూల్, హైదరాబాద్ లిటిల్ ఫ్లవర్ కాలేజ్, బద్రుక కాలేజ్ ఆఫ్ కామర్స్
తల్లిదండ్రులు: తండ్రి గోవర్దన్ రావు యాక్టర్, టివి డైరెక్టర్.
తల్లి మాధవి సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలపర్ ట్రెయినర్
అన్న: ఆనంద్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు
తెలుగులో చేసిన సినిమాలు : లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లిచూపులు, ద్వారక, అర్జున్ రెడ్డి