Home దునియా హైదరాబాదీగా గర్వపడతా…

హైదరాబాదీగా గర్వపడతా…

అందాల తార అదితీరావు హైదరీ తెలుగు మూలాలున్న అమ్మాయి. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఆమె మంచి పేరుతెచ్చుకుంది. దీపికా పదుకునే ప్రధాన పాత్రలో ఇటీవల వచ్చిన ‘పద్మావత్’ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించిన అదితి ప్రేక్షకులను మెప్పించింది. ఇక మణిరత్నం  ‘చెలియా’ చిత్రంతో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఆమె నటించిన తొలి తెలుగు చిత్రం ‘సమ్మోహనం’. ఈ చిత్రంలో సుధీర్‌బాబుకు జోడీగా నటించిన అదితీరావు హైదరీ మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ ఉత్సాహంతో తెలుగులో మరిన్ని మంచి సినిమాలు చేసి ప్రేక్షకులను అలరిస్తానని అంటోంది ఈ హైదరాబాదీ భామ… 

Adithi-Rao

విద్యారావు, ఎహషాన్ హైదరీ నా తల్లిదండ్రులు. నేను పుట్టింది హైదరాబాద్‌లోనే. నన్ను ఎప్పుడు ఎవరు అడిగినా నేను హైదరాబాదీనే అని చెబుతా. అలా చెప్పుకోవడానికి నేను గర్వపడతాను. అమ్మవాళ్ల నాన్న వనపర్తి రాజు రాజేశ్వరరావు. ఆయన ‘ఓరియంట్ బ్లాక్‌స్వాన్’ ప్రచురణ సంస్థను స్థాపించారు. నాన్న వాళ్ల తాత నిజాం నవాబుల కాలంలో హైదరాబాద్‌కు ప్రధానిగా పనిచేశారు. మా తాత ఇంట్లో ఉర్దూ, తెలుగు మాట్లాడమని చెప్పేవారు. ఇక ‘సమ్మోహనం’ సినిమాలో నా పాత్రకు తెలుగులో స్వయంగా డబ్బింగ్ చెప్పడం ఎంతో ఆనందాన్నిచ్చింది.

హీరోయిన్ కావాలని కలలు కనేదాన్ని…

నేను రెండేళ్ల వయసులో ఉన్నప్పుడే మా అమ్మా నాన్నలు విడిపోయారు. అనంత రం మా అమ్మ ఢిల్లీలో ఉంటూ ఓరియంట్ బ్లాక్‌స్వాన్ సంస్థ నిర్వహణను చూసేది. చిన్నప్పుడు హైదరాబాద్, ఢిల్లీలో ఎక్కువగా ఉండేదాన్ని. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ భార్య కిరణ్‌రావు నాకు వరుసకు సోదరి. కిరణ్‌రావు వాళ్ల అమ్మ, మా అమ్మ అక్కాచెల్లెళ్లు. ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలో ఉన్న రిషీ వ్యాలీ స్కూల్‌లో చదువుకున్నాను. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశాను. డిగ్రీ చదువుకుంటున్న సమయంలోనే హీరోయిన్ కావాలని కలలు కనేదాన్ని.

అమ్మను చూసి కళలపై ఆసక్తి…

మా అమ్మ విద్యారావు మంచి గాయని. తుమ్రీ డ్యాన్స్‌లోనూ ఆమెకు ప్రవేశం ఉంది. మా అమ్మను చూసి నాకు కళలంటే ఇష్టం ఏర్పడింది. రిషీవ్యాలీలో చదువుతున్నప్పుడు కళలపట్ల ఆసక్తి ఇంకా పెరిగింది. ఆరేళ్ల వయసు నుంచే భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నాను. లీలా శాంసన్ వద్ద భరతనాట్యం నేర్చుకున్నాను.

సినీ రంగంలోకి…

ఓసారి చెన్నైలో నా భరతనాట్యం ప్రదర్శన చూసి ముగ్దురాలైన శారద రామనాథ్ నృత్య ప్రధానంగా సాగే తన చిత్రం ‘శృంగారం’ అనే సినిమాలో నటించమని అడిగారు. మా అమ్మ కూడా సరేననడంతో సినిమాలపైన ఉన్న ఆసక్తితో ఈ ఆఫర్‌ను వెంటనే ఒప్పుకున్నాను. ఈ చిత్రంలో దేవదాసిగా ప్రధానమైన పాత్రలో నటించాను. ‘శృంగారం’ చిత్రం 2007 అక్టోబర్ 5న విడుదలైంది. అయితే హీరోయిన్‌గా మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టితో కలిసి నటించిన ‘ప్రజాపతి’ (2006) ముందుగా విడుదలైంది. ఈవిధంగా నా సినీ కెరీర్ మొదలైంది.

బాలీవుడ్ ప్రయాణం…

బాలీవుడ్‌లో నేను నటించిన మొదటి చిత్రం ‘ఢిల్లీ-6’. ఇందులో చిన్న పాత్ర చేశాను. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్, సోనమ్‌కపూర్‌లు హీరోహీరోయిన్లు. 2011లో వచ్చిన రొమాంటిక్ డ్రామా ‘యే సాలీ జిందగీ’ చిత్రం హీరోయిన్‌గా నాకు మంచి పేరును తెచ్చిపెట్టింది. అదే ఏడాది వచ్చిన రణబీర్‌కపూర్ చిత్రం ‘రాక్‌స్టార్’లో ఓ ముఖ్యమైన పాత్రలో నటించాను. 2013లో వచ్చిన మహేష్‌భట్ చిత్రం ‘మర్డర్ 3’లో నా పాత్రకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఆ తర్వాత బాలీవుడ్‌లో బాస్, ఖూబ్‌సూరత్, గుడ్డు రంగీలా పదికి పైగా చిత్రాలు చేశాను.

నటిగా మంచి గుర్తింపు…

2016లో వచ్చిన అమితాబ్ చిత్రం ‘వజీర్’ చిత్రం నటిగా నాకు మంచి క్రేజ్‌ను తెచ్చింది. 2018 జనవరిలో విడుదలైన దీపికాపదుకునే ప్రధాన పాత్రలో నటించిన ‘పద్మావత్’ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటించాను. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకుంది. అనంతరం తెలుగులో నా మొదటి చిత్రం ‘సమ్మోహనం’ చేశాను. ఈ సినిమా మంచి సక్సెస్‌ను సాధించడంతో టాలీవుడ్‌లో మంచి అవకాశాలు వస్తున్నాయి.

నా కోరిక నెరవేరింది…

సినీ రంగంలోకి వచ్చిన తర్వాత లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం సినిమాలో నటించాలని కలలు కనేదాన్ని. చివరికి 2017లో వచ్చిన మణిరత్నం తమిళ చిత్రం ‘కాట్రు వెలియిదయ్’ (తెలుగులో చెలియా)లో నటించడంతో నా కోరిక నెరవేరింది. ఆస్కార్ విజేత అయిన మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్‌తో కలిసి ఈ సినిమా చేయడం మరచిపోలేని అనుభూతినిచ్చింది. తెలుగులో సరిగా ఆడకపోయినా తమిళంలో ఈ చిత్రం చాలా బాగా ఆడింది. ఈ చిత్రంతో హీరోయిన్‌గా మరింత పాపులారిటీ వచ్చింది.

పెళ్లయిన కొంతకాలానికే విడాకులు…

21 ఏళ్ల వయసులోనే సత్యదీప్ మిశ్రాతో నా వివాహం జరిగింది. బాలీవుడ్‌లో నా కెరీర్ మూలంగా మా పెళ్లిని రహస్యంగా ఉంచాం. 17 ఏళ్ల నుంచే ఆయన తో పరిచయం ఉంది. తను సివిల్ సర్వెంట్‌గా పనిచేశాడు. సినిమాల్లోకి రావాలని ఉద్యోగం వదులుకున్నాడు. అయితే మనస్పర్థల మూలంగా పెళ్లయిన కొంత కాలానికే మేము విడాకులు తీసుకొని విడిపోయాం.

ఆ దర్శకులతో పనిచేయాలని…

ప్రస్తుతం ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలోని సినిమాలో ఆస్ట్రోనాట్‌గా చేస్తున్నాను. ఇక ఓవైపు హీరోయిన్‌గా చేస్తూనే మంచి సినిమాలో అవకాశం వస్తే క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నాను. కథ నచ్చితే ఎటువంటి పాత్రలోనైనా నటిస్తాను.

 ఎస్. అనిల్‌కుమార్