Home ఖమ్మం ఏజెన్సీలో హై అలర్ట్

ఏజెన్సీలో హై అలర్ట్

అడవుల్లో మొదలైన అలజడి
విస్తృతంగా పోలీసుల కూంబింగ్!
మావోయిస్టు అగ్రనేతల కోసం గాలింపు!
ఛత్తీస్‌ఘడ్‌లో ముగ్గురు గ్రామస్తులను
హతమార్చిన మావోయిస్టులు!
అటవీ ప్రాంతంలో టెన్షన్.. టెన్షన్
భయాందోళనలో గిరిజనులు

policeమన తెలంగాణ/భద్రాచలం: తెలంగాణ, ఛత్తీసగఢ్ సరిహద్దుల్లోని గోట్టెపాడు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ తో అడవుల్లో అలజడి మొదలైంది. నిన్నమెన్నటి వరకు స్తబ్ధుగా ఉన్న దండకారణ్యంలో ఒక్క సారిగా యుద్ధమేఘాలు అలుముకున్నాయి. అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతలు ప్లీనరీ ఏర్పాటు చేశారనే పక్కా సమాచారం మేరకు ప్లీనరీపై విరుచుకు పడిన ప్రత్యేక పోలీసు బలగాలు 8 మంది మావోయిస్టులను హతమార్చారు. మృతదేహాలను హెలీకాప్టర్లలో భద్రాచలం తరలించారు. 2013లో ఇదే తరహాలో జరిగిన ఎన్‌కౌంటర్లో మావోయిస్టులు చనిపోగా వారి మృతదేహాలు తరిలించే క్రమంలో హెలీకాప్టర్లపై మావోయిస్టులు కాల్పులకు దిగారు. ఈ క్రమంలో సిఆర్‌పిఎఫ్ సిఐ శివప్రసాద్ తన ప్రాణాలు కోల్పారు. అదే తంతు జరిగితే ఇబ్బంది తలెత్త అవకాశం ఉందని భావించిన పోలీసులు మృత దేహాలను తరలించే క్రమంలో బలగాలతో మరో రెండు హెలీకాప్టర్లు కాపలా కాశాయి. అడవులను ఇప్పటికే ప్రత్యేక బలగాలు జల్లెడ పడుతున్నాయి. చెట్టుపుట్టలను గాలిస్తున్నారు.
అగ్రనేతల కోసం గాలింపు: ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో జరుగుతున్న ప్లీనరీలో  మావోయిస్టు అగ్రనేతలు హరి భూషణ్, పాపన్న, చంద్రన్నలు ఉన్నారని, వారు చాకచక్యంగా తప్పించుకున్నారనే అనుమానాల నేపథ్యంలో భారీ కూంబింగ్ సాగుతోంది. గత ఏడాది సుమారుగా డిసెంబన్ నెల్లో భద్రాచలం నియోజకవర్గానికి చెందిన టిఆర్‌ఎస్ నాయకులను మావోయిస్టులు కిడ్నాప్ చేసి మూడు రోజుల అనంతరం విడిచిపెట్టారు. అప్పట్లో ఇది రాష్ట్రంలో సంచలనం కలిగిన ఘటన. అయితే విడుదలైన నాయకులు తమకు హెచ్చరికలు జారీ చేసిన వదిలేశారని, వేలాదిగా ఉన్న మావోయిస్టులు తమకు ప్రాణహాని తలపెట్టలేదని, అందులో మావోయిస్టు అగ్రనేత కూడా ఉన్నారని తెలిపారు. దీంతో మంగళవారం నాటి ప్లీనరీలో కూడా వారు ఉన్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఏజెన్సీలో హై అలెర్ట్ నెలకొంది. పోలీసులు ప్రతీ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వచ్చిపోయే వాహనాలపై నిఘా పెట్టారు. ఎదురుదెబ్బ తిన్న మావోయిస్టులు ఏ సమయంలోనైనా విరుచుకుపడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అన్ని రకాలుగా వారిని ఎదుర్కునేందుకు కూంబింగ్ యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ముగ్గురు గ్రామస్తులను హతమార్చిన మావోయిస్టులు: ఎన్‌కౌంటర్ జరిగిన 24 గంటల్లోనే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా కుతుల్ అటవీ గ్రామంలో సుమారు ముగ్గురు గ్రామస్తులను మావోయిస్టులు హతమార్చినట్లు తెలుస్తోంది. దీనిని బస్తర్ ఐజి కూడా ధ్రువీకరించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇన్‌ఫార్మర్ల నెపంతోనే హతమార్చినట్లు తెలుస్తోంది. కాగా అడవుల్లో తమ ఉనికి కోల్పోకుండా మావో యిస్టులు హత్యలకు తెగబడే అవకాశాలు లేకపోలేదని పలువురు భావిస్తున్నారు.
అటవీ గ్రామాల్లో టెన్షన్ టెన్షన్ : ఎన్‌కౌంటర్ నేపథ్యంలో అటవీ గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయా గ్రామాల ప్రజలు ఇటు పోలీసులు, అటు మావోయిస్టుల మధ్య నలిగిపోతున్నారు. పోలీసులకు దళాల సమా చారాన్ని చేరవేస్తే హతమారుస్తామని మావోయిస్టులు, దళాల సమాచారాన్ని చెప్పాలంటూ పోలీసుల వేధింపులు ఇక్కడ సర్వసాధారణం. ఇయితే ఇద్దరి మధ్య అమాయక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు.