Tuesday, April 23, 2024

ఆ ‘7’ జిల్లాల్లో హై అలెర్ట్

- Advertisement -
- Advertisement -

high alert in those seven districts in Telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా జిహెచ్‌ఎంసి పరిధితో పాటు కరీంనగర్, మేడ్చల్, రంగారెడ్డి(నాన్‌జిహెచ్‌ఎంసి), వరంగల్ అర్బన్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అధికంగా సోకుతుందని అధికారులు గుర్తించారు. కేవలం వారం రోజుల లోపే ప్రతి జిల్లాల్లో 500 కేసులు కంటే ఎక్కువ నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. దీంతో ఈ ప్రాంతాలకు చెందిన ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ సూచిస్తుంది. అంతేగాక వైరస్ కట్టడికి మరిన్ని పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల డిఎంహెచ్‌ఓలకు హెల్త్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మరో నెలరోజుల పాటు అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.

80 శాతం కేసులు ఇక్కడ్నుంచే…

గత నెల రోజుల క్రిందట వరకు ప్రతి రోజూ నమోదయ్యే కరోనా కేసుల్లో సింహభాగం జిహెచ్‌ఎంసిలోనే తేలేవి. కానీ ప్రస్తుతం 80 శాతం కేసులు జిల్లాల నుంచి వస్తున్నాయి. గత వారం రోజుల్లో జిహెచ్‌ఎంసి పరిధిలో ఏకంగా 3398 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత స్థానంలో రంగారెడ్డి(నాన్‌జిహెచ్‌ఎంసి)లో 1285, మేడ్చల్‌లో 1019 కేసులు నమోదయ్యాయి. వీటి తర్వాత వరంగల్ అర్బన్‌లో 744, కరీంనగర్‌లో 610, సంగారెడ్డి 494, నిజామాబాద్ జిల్లాలో 451 కేసులు చొప్పున నమోదయ్యాయి. దీంతో ఈ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అదే విధంగా గడిచిన వారంలో భద్రాద్రి జిల్లాలో 229, గద్వాలలో 248, ఖమ్మం 294, నల్గొండ 280, పెద్దపల్లి 240, వరంగల్ రూరల్‌లో మరో 173 కేసులు నమోదు కాగా, ఈ ప్రాంతాల్లో వైరస్ తీవ్రత మధ్యస్థంగా ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఉద్యోగం, వ్యాపారం, ఇతర పనుల నిమిత్తం వివిధ ద్వితీయశ్రేణి నగరాల నుంచి చాలా మంది హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకోని వారు వైరస్‌ను వెంటపెట్టుకొని తీసుకువెళ్తున్నారని వైద్యశాఖ చెబుతోంది. ఈక్రమంలోనే అన్‌లాక్ పీరియడ్‌లో అన్ని జిల్లాల్లోకి వైరస్ వెళ్లిపోయిందని అధికారులు తెలిపారు.

ఇంటింటికి ఫీవర్ సర్వే…

వైరస్ వ్యాపిస్తున్న జిల్లాల్లో వైద్యశాఖ మరోసారి ఫీవర్ సర్వే నిర్వహించనుంది. ప్రస్తుతం సీజనల్ వ్యాధుల కాలం ప్రారంభం కావడంతో ఈ ప్రాంతాల్లో అధికారులు మరింత నిఘా పెట్టనున్నారు. ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు, ఆర్‌ఎంపిలు, పిఎంపిలు, గ్రామస్థాయి రెవెన్యూసిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలతో కలసి ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహించి, ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై సమగ్ర సమాచారాన్ని తెలుసుకోనున్నారు. లక్షణాలు ఉన్న వారిని గుర్తించి కరోనా టెస్టులు చేస్తామని ఓ అధికారి తెలిపారు.

ప్రతి పిహెచ్‌సిలో అన్ని సౌకర్యాలు…

కరోనా వైద్యం అనగానే ప్రజలు బెంబేలెత్తకుండా ఉండేందుకు ప్రతి పిహెచ్‌సి(ప్రైమరీ హెల్త్‌సెంటర్)సిహెచ్‌సి(కమ్యూనిటీ హెల్త్ సెంటర్)లలోనూ కరోనా చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు అంటున్నారు. ఇప్పటికే టెస్టింగ్ కొరకు యాంటీజెన్ కిట్లను, పారసెట్‌మాల్, డోలోతో పాటు యాంటివైరల్ డ్రగ్స్ రెమిడెసివిర్, ఫావిఫెరావిర్ మందులు పిహెచ్‌సిలకు పంపామని అధికారులు తెలిపారు. అదే విధంగా డెక్సామెథాసోన్ వంటి స్టెరాయిడ్ మందులను కూడా అందుబాటులో ఉంచామని వైద్యశాఖ చెబుతోంది. ఆసుపత్రుల్లో చికిత్స అవసరమైన రోగికి పిహెచ్‌సిల నుంచే ఇతర రిఫర్ చేసేలా అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.

జూలై 29 నుంచి ఆగస్టు 4 వరకు వైరస్ తీవ్రత

 జిల్లా       కేసుల సంఖ్య
జిహెచ్‌ఎంసి       3398
రంగారెడ్డి          1285
మేడ్చల్          1019
వరంగల్ అర్బన్   744
కరీంనగర్         610
సంగారెడ్డి         494
నిజామాబాద్     451
ఖమ్మం          294
నల్గొండ          280
గద్వాల          248
పెద్దపల్లి          240
భద్రాద్రి           229
వరంగల్ రూరల్ 173

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News