Home ఆదిలాబాద్ ఉప సర్పంచ్‌కే పోటీ తీవ్రం

ఉప సర్పంచ్‌కే పోటీ తీవ్రం

చెక్‌పవర్ ఉండడం, రిజర్వేషన్ లేకపోవడంతో గ్రామాల్లో మొదలైన హడావిడి

Telugu Story about Meetings in Villages

మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలోనే ఇప్పటి వరకు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కనిపించని సీన్ తొలిసారి తెలంగాణ రాష్ట్రంలో కనిపించబోతోంది. అధికారాలతో పాటు వార్డు సభ్యుల మద్ధతు అవసరం లేకుండా, ప్రత్యక్ష పద్ధతిలో జరిగే సర్పంచ్ పదవికి సహజంగా పోటీ తీవ్రంగా ఉంటుంది. పైగా ఈ సారి తెలంగాణ రాష్ట్రం సర్పంచ్‌కు విశేషాధికారాలు కల్పించడంతో ఈ పదవికోసం పోటీ బాగా ఉంటుందని అందరు భావించారు. అయితే గ్రామాల్లో దీనికి భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. సర్పంచ్ పదవితో సమానంగా, కొన్ని చోట్ల అంత కంటే ఎక్కువగానే ఉపసర్పంచ్‌కు పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. ప్రధానంగా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మహిళలు ఇలాంటి రిజర్వేషన్ కేటగిరిలో ఉన్న పంచాయతీల్లో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సారి పంచాయతీల్లో పెట్టే ప్రతిపైస ఖర్చుకు నిధుల విడుదలలో సర్పంచ్‌తో సమానంగా ఉపసర్పంచ్‌కు అధికారాలు కల్పించారు. ఇతరత్ర అధికారాలపై కంటే నిధుల విషయంలో పెత్తనం ఉంటే ఆ అధికారాలలో కూడా ఉపసర్పంచ్ ముద్ర వేసుకోవచ్చన్న భావం చాలా మంది గ్రామీణనేతల్లో నెలకొంది. ఈ సారి పంచాయతీల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పటి వరకు 8684పంచాయతీలు ఉండగా ఈ సారి 12751పంచాయతీలు ఏర్పడ్డాయి.

500లోపు జనాభా ఉన్న చిన్న పంచాయతీల సంఖ్య కూడా బాగానే ఉంది. దీంతో ఇక్కడ వార్డు సభ్యుల సంఖ్య రెండు లేదా మూడుకు మించదు. ఇలాంటి చోట్ల ఒకరిద్దరు వార్డు సభ్యులను మచ్చిక చేసుకుంటే ఉపసర్పంచి పదవిని కైవసం చేసుకోవచ్చు. మొత్తం పంచాయతీలోని ఓటర్ల మనసు చూరగొని మెజార్టీ సాధించడం పంచాయతీల్లో కత్తిమీద సాములాంటిది. కారణం రాజకీయ పార్టీలతో ప్రమేయం లేకుండా పంచాయతీల్లో ఓటింగ్ ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. సర్పంచి పదవికి పోటీ చేసే అభ్యర్థికి సంబంధించిన బంధువులు, మిత్రులు, ఇతరత్ర శ్రేయోభిలాషులు పంచాయతీ ఎన్నికల్లో పార్టీలకతీతంగా తమకు దగ్గరి వారికి ఓటేసే అవకాశాలు ఉంటాయి. దీంతో సర్పంచ్ పదవికి పోటీ పడి గెలవడం అంత సులువు కాదు. ఈ నేపథ్యంలో సర్పంచ్‌కు ఉండే కీలకమైన చెక్‌పవర్‌లో ఉపసర్పంచ్‌కు భాగస్వామ్యం వచ్చే సరికి పంచాయతీలో చక్రం తిప్పవచ్చన్న భావన చాలా మందిలో కలిగింది. దీనికి తోడు సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు ఉంటాయి. ఉపసర్పంచ్ పదవికి రిజర్వేషన్ లేదు. అంటే ఏ కేటగిరికి చెందిన వార్డు సభ్యుడైనా ఉపసర్పంచ్ పదవిని దక్కించుకోవచ్చు. దీంతో సర్పంచ్ పదవిపై ముందు నుంచి ఆశలు పెట్టుకుని రిజర్వేషన్ల కేటాయింపులో ఆ స్థానం దక్కని వారు ఉపసర్పంచ్ పదవిపై కన్నేసారు. దీనికి మరో కారణం ఉంది.

ఈ సారి ఖరారైన సర్పంచ్ స్థానం రిజర్వేషన్ పది సంవత్సరాల పాటు ఉంటుంది. సర్పంచ్ పదవి కోసం ఎన్నాళ్లో నుంచో ఎదురుచూస్తున్న వారికి ఈ సారి రిజర్వేషన్ కారణంగా దక్కకపోతే వారు అంత కాలం అధికారం లేకుండా ఉండలేమని భావించి ఉపసర్పంచ్ పదవిపై కన్నేయడం మొదలుపెట్టారు..12751 పంచాయతీల్లో మొత్తం 1.13లక్షల వార్డులు ఉన్నాయి. ఈ వార్డు సభ్యులుగా ఎన్నికైన వారు 12751 మంది ఉపసర్పంచ్‌లను ఎన్నుకోనున్నారు. ఆగస్టు 1 నుంచి వీరంతా పదవుల్లో కొలువుదీరుతారు. ఎన్నికల షెడ్యూల్ ఇంకా ప్రకటించనప్పటికి అధికారం చేపట్టే ఆఖరు గడువు తెలియడం, అది కూడా ఎంతో దూరంలో లేకపోవడంతో ఉపసర్పంచ్ పదవికోసం ఆరాటపడే వారే కాకుండా సర్పంచ్, వార్డు సభ్యులుగా ఎన్నిక కావాలని కోరుకుంటున్న వారిలో కూడా ఉత్సుకత నెలకొంది. షెడ్యూల్ ప్రకటనపై అంతగా దృష్టి సారించకుండా ఇప్పటి నుంచే పోటీలో ఉండే వారి గూర్చి ఆరా తీస్తున్నారు. పోటీ పడతారని భావిస్తున్న వారితో పదవులు ఆశించే వారు ఇప్పటి నుంచే దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వారిని మచ్చిక చేసుకుని వీలైనంతలో ఏకగ్రీవం కావడానికే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు వారికి చెందిన వారిని ఏకగ్రీవం చేసుకోవడానికి ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వారి సొంత గ్రామాలతో పాటు వారి నియోజకవర్గాల్లో తమ అనుయాయులను రంగంలోకి దించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నయానా భయానా నచ్చచెప్పి ఏకగ్రీవం చేయడం కోసం ప్రధాన నేతలంతా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

బోనమ్మతాండ పంచాయతీ పూర్తిగా ఏకగ్రీవం : పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే గ్రామాల్లో ఏకగ్రీవ ప్రయత్నాలు ఊపందుకున్నాయనడానికి ఇదీ ఉదహరణ. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం రుద్రారం గ్రామ పంచాయతీ నుండి విడిపోయి ఈ సారి బోనమ్మతాండ కొత్త పంచాయతీగా ఏర్పడింది. ఆదివారం రుద్రారం సర్పంచ్ దామోదర్‌రెడ్డి, మాజి సర్పంచ్ సా యిలు సమక్షంలో తాండ పెద్దలంతా సమావేశమయ్యారు. కొత్త పంచాయతీలో మూడు వార్డులు ఉన్నాయి. సర్పంచ్ పదవికి గోవింద్‌నాయక్, ఉపసర్పంచ్ పదవికి సుందర్‌నాయక్‌లను వారు ఎంపిక చేశారు. ఉపసర్పంచ్ వార్డు పోనూ మిగిలిన రెండు వార్డులకు ఒక దానికి రామునాయక్, రెండో దానికి రేవ్యానాయక్‌లను ఎంపిక చేశారు.