Home ఎడిటోరియల్ కృత్రిమంగా పండించిన పండ్లతో ప్రమాదం

కృత్రిమంగా పండించిన పండ్లతో ప్రమాదం

Dangers with natural fruit

 

పండ్లలో రసాయనాలు కలిపి కృత్రిమ పద్ధతులలో పండించి అమ్మే పండ్ల వ్యాపారస్థులు ఉగ్రవాదుల కంటే ప్రమాదకారులని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించింది. హైదరాబాద్‌లో గడ్డిఅన్నారం మార్కెట్ పండ్ల వ్యాపారానికి ప్రసిద్ధి. హైకోర్టు వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న అప్పటి ప్రభుత్వం పండ్ల మార్కెట్లలో విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. ముఖ్యం గా మామిడి పండ్లని కాల్షియం కార్బైడ్ అనే హానికర రసాయనంతో పక్వానికి వచ్చేటట్లు చేస్తున్నారని తనిఖీల్లో వెల్లడైం ది. ఈ రసాయనం నీటితో చర్య జరిపితే ఎసిటిలిన్ ఉత్పత్తి అవుతుంది. ఈ హానికర రసాయనంతో పండిన పండ్లను తింటే ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతారు. వాంతులు, విరోచనాలతో బాధపడటం జరుగుతుం ది. కడుపులో మంటగా అనిపిస్తుంది. కంటిచూపు కూడా మందగిస్తుంది. క్యాన్సర్ కూడా రావచ్చు. చర్మం పొడిబారుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడతారు. నాడీ వ్యవస్థ దెబ్బతిని క్రమంగా కాళ్ళు, చేతులు చచ్చుబడినట్లు అనిపిస్తాయి.

ముఖ్యంగా గర్భిణీలు తీవ్ర అసౌకర్యానికి గురవుతారు. కొన్ని సందర్భాలలో గర్భస్రావం కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వం కాల్షియం కార్బైడ్ వినియోగాన్ని నిషేధించింది. ఈ రసాయనాన్నే కాకుండా ఇథిలిన్, ఇథిఫాన్ వంటివి కూడా కాయలు పక్వానికి రావడానికి ఉపయోగిస్తుంటారు. వీటిని కొద్ది మొత్తంలో ఉపయోగించడం వలన పెద్దగా అనారోగ్య సమస్యలు ఉండవు. అయితే కొంతమంది వ్యాపారస్థుల మితిమీరిన స్వార్ధం, పండించే రైతులకు సరైన అవగాహన లేకపోవడం వలన ఈ రసాయనాలను ఎక్కువ మొత్తంలో ఉపయోగిస్తుంటారు. ఫలితంగా పండ్లు తమ సహజత్వాన్ని కోల్పోతున్నాయి.

మామిడి పండ్లలోనే కాకుండా బొప్పా యి, అరటి, ఆపిల్, సపోట, బత్తాయి వంటి కాయలు త్వరగా పక్వానికి రావడానికి రసాయనాలను వాడుతున్నారు. కృత్రిమ పద్ధతిలో పండించిన పండ్లు ఆకర్షణీయంగా ఉంటా యి. ఒకే సైజులో, ఒకే ఆకారంలో ఉంటాయి. అరటి పండ్లు అయితే గ్రీన్, ఎల్లో రంగుల్లో ఉండి వాటి కాండం మాత్రం నల్లగా ఉంటుం ది. రసాయనాలతో పండించిన ఫలా లు అంత రుచిగా ఉండవు. త్వరగా పాడవుతా యి. గాలి ప్రవేశం పెద్దగా లేని గదుల్లో కాయలను భద్ర పరిస్తే 4 నుండి 6 రోజుల్లో పక్వానికి వస్తాయి. వరి పొట్టు లేదా గడ్డి మధ్యలో కాయలను పరచి పైన పేపర్ కప్పడం ద్వారా మామిడి, సపోటా వంటి కాయలను సహజ పద్ధతిలో పక్వానికి తీసుకురావచ్చు. 5 లీటర్ల నీరు నింపిన పాత్రలో 10 యం.యల్. ఈథైల్, 2 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ పిల్లెట్స్‌ను కలిపి కాయల దగ్గర పెడితే అవి త్వరగా పక్వానికి వస్తాయి. ఈ పద్ధతిలో పండిన ఫలాలను తింటే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. బొప్పాయి, అరటి కాయలను ఒకే గదిలో ఉంచి సహజ పద్ధతిలో పక్వానికి తీసుకురావచ్చు. కొన్ని ప్రాంతాలలో ఆక్సిటోసిన్, చైనా పౌడర్ వంటివి కూడా వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. బాగా పరిచయం ఉన్న పండ్లు వ్యాపారస్థుల దగ్గర పండ్లు, కూరగాయలు కొనడం మంచిది. శుభ్రంగా కడిగిన తరువాత తొక్కతీసి పండ్లను తినాలి. సీజన్ ముందుగానీ, తరువాత గానీ లభించే పండ్లను కొనకుండా ఉంటే మంచిది. దురదృష్టవశాత్తు రైతులు తాము పండించిన కూరగాయలనుగానీ, కాయలనుగానీ భద్రపరచుకొని అమ్మేందుకు వీలుగా తగినన్ని గిడ్డంగులు లేవు. ప్రభుత్వాలు పెద్ద సంఖ్యలో గిడ్డంగులు నిర్మించి రైతులకు అందుబాటులో ఉంచాలి. దళారుల ప్రమేయాన్ని నియంత్రించాలి. రైతు బజార్లో కూరగాయలతో పాటు పండ్లను కూడా అమ్మేందుకు వీలు కల్పించాలి. పండ్లు లభించే ప్రాంతాన్ని బట్టి వాటి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలకు, ఆకు కూరలకు ఆదరణ లభిస్తుంది. అయితే వీటి ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు. ప్రభుత్వమే సేంద్రియ వ్యవసాయంలో ఉన్న శాస్త్రీయతను పరిశీలించి రైతలను ప్రోత్సహించినట్లయితే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు.

High Court comments on Health Dangers with natural fruit