Home తాజా వార్తలు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపలేం…

ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపలేం…

High Courtహైదరాబాద్ : సమ్మెకు వెళ్లేముందు ఆర్టీసీ కార్మికులు యాజమాన్యానికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని అడిషనల్ ఎజి తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించలేమని అడిషనల్ ఎజి కోర్టు దృష్టికి తెచ్చారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వం ఎంతగానో ఆదుకుందని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ కార్పొరేషన్ పూర్తిగా నష్టాల్లో కూరుకపోయిందని ఆయన పేర్కొన్నారు. దీంతో ఆర్టీసీలో ఆర్థిక సంక్షోభం నెలకొందని, దీంతో ఈ సంస్థ ఆర్థిక పరిస్థితి అసలే బాగాలేదని ఆయన చెప్పారు. ఈ క్రమంలో కార్మికుల ఆర్థికపరమైన డిమాండ్లను నెరవేర్చలేమని ఆయన హైకోర్టకు తేల్చిచెప్పారు. కార్మికుల సమ్మె కారణంగా ఇప్పటి వరకు ఆర్టీసీకి 44శాతం నష్టం జరిగిందని ఆయన వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపలేమని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ జెఎసి నేతలు విలీనం డిమాండ్‌ను తాత్కాలికంగా పక్కన బెట్టినా, తిరిగి ఏ క్షణమైనా మళ్లీ ఆ డిమాండ్‌ను తీసుకొచ్చి ప్రభుత్వాన్ని కార్మికులు ఇరుకునపెట్టే అవకాశం ఉందని అడిషనల్ ఎజి కోర్టు దృష్టికి తెచ్చారు. కొంతమంది యూనియన్ నేతలు తమ స్వార్థం కోసం మొత్తం ఆర్టీసీ కార్పొరేషన్‌ను నష్టాల్లో నెడుతున్నారని ఆయన చెప్పారు. యూనియన్ నేతలు పనిగట్టుకుని, ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని కష్టాల్లోకి నెట్టేందుకు యత్నిస్తున్నారని అడిషనల్ ఎజి తెలిపారు. పారిశ్రామిక వివాదాల చట్టం సెక్షన్22(1)ఎ ప్రకారం సమ్మె చట్ట విరుద్ధమని ఆయన కోర్టుకు వివరించారు. అడిషనల్ ఎజి వాదనలపై హైకోర్టు స్పందించింది. కార్మికుల సమ్మె చట్ట సమ్మతమో, చట్ట విరుద్ధమో లేబర్ కోర్టు తేలుస్తుందని హైకోర్టు వెల్లడించింది.

High Court Hearing On TSRTC Strike