Tuesday, April 23, 2024

నయీం డైరీస్ చిత్రం ప్రదర్శనపై హైకోర్టు స్టే

- Advertisement -
- Advertisement -

High Court stays nayum diaries movie

హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన నయీం డైరీస్ చిత్రం ప్రదర్శనపై శుక్రవారం నాడు హైకోర్టు స్టే విధించింది. ఈ సినిమాలో బెల్లి లలిత పాత్రను అభ్యంతరకరంగా చిత్రీకరించారంటూ ఆమె కుమారుడు సూర్యప్రకాష్ హైకోర్టును ఆశ్రయించారు. కాగా 1999లో బెల్లిలలితను నయీం హత్య చేయించాడంటూ అప్పట్లో కుటుంబ సభ్యులు ఆరోపించారు.తాజాగా నయీం డైరీ చిత్రంలో బెల్లి లలిత క్యారెక్టర్ పోషించిన లత’ను నయీం లిప్ కిస్ చేసే దృశ్యాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నయీం డైరీస్ సినిమా శుక్రవారమే విడుదలైన క్రమంలో ఈ చిత్రం నిలుపుదల చేయాలంటూ సూర్యప్రకాష్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో చిత్రం డైరెక్టర్, ప్రొడ్యూసర్‌కు హైకోర్టు నోటీసులు ఇస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

అభ్యంతరకర దృశ్యాలను తొలగిస్తాం: నిర్మాత

నయీం డైరీస్ నిర్మాత వరదరాజు బెల్లి లలిత కుటుంబానికి క్షమాపణ చెప్పారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ సినిమాలో నిజజీవితంలో అమరులైన ఒక మహిళ పాత్రను చిత్రించి ఆమె కుటుంబ సభ్యులను, అభిమానుల్ని బాధపెట్టినట్లు మా దృష్టికి వచ్చింది. వారి మనోభావాల్ని గాయపరిచినందుకు మేము భేషరతుగా క్షమాపణ చెప్తున్నామని, మా సినిమా ప్రదర్శనను ఆపివేసి ఆ పాత్రకు సంబంధించిన అభ్యంతరకర దృశ్యాలను, సంభాషణలను వెంటనే తొలగిస్తున్నామని నిర్మాత వరదరాజు పేర్కొన్నారు.

సినిమాను అడ్డుకున్న తెలంగాణ ఉద్యమకారులు

గ్యాంగ్‌స్టర్ నయీం జీవిత చరిత్ర ఆధారంగా విడుదలైన నయీమ్ డైరీస్ సినిమాను తెలంగాణ ఉద్యమకారులు అడ్డుకున్నారు. సినిమాలో తెలంగాణ ఉద్యమకారిని బెల్లి లలితను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించారు. హైదరాబాద్ ఆర్‌టిసి క్రాస్ రోడ్‌లో సంధ్య థియేటర్ వద్ద తెలంగాణ ఉద్యమకారులు ఆందోళనకు దిగారు. నయీమ్ డైరీస్ సినిమా పోస్టర్ ఫ్లెక్సీలను చించివేసి దహనం చేశారు. సినిమాను సంధ్య 35 ఎంఎం థియేటర్‌లో విడుదల కాకుండా అడ్డుకున్నారు. ఉద్యమకారులను కించపరిచే సినిమాలను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్యమకారులు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News