Home ఎడిటోరియల్ సులభతర వాణిజ్యంలో హైజంప్

సులభతర వాణిజ్యంలో హైజంప్

sampadakeyam

వ్యాపారాలు చేయటాన్ని సులభతరం చేసే విధానాల అమలుకు కొలమానంగా ప్రపంచబ్యాంక్ రూపొందించే అంతర్జాతీయ సూచికలో భారత్ తొలిసారి 100వ స్థానాన్ని చేరుకుంది. మూడేళ్ల క్రితం నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినపుడు 142వ స్థానంలో ఉన్న భారత్ గత సంవత్సరం 130వ స్థానం చేరుకుంది. ఈ ఏడాది 190 దేశాల్లో 100వ స్థానాన్ని చేరుకోవాలన్న ప్రభుత్వ కృషి ఫలించింది. సంస్కరణల అమలును మరింత వేగవంతం చేయటం ద్వారా వచ్చే సంవత్సరాల్లో అగ్రస్థాయిలోని 50దేశాల్లోకి చొచ్చుకు రావాలని ప్రభుత్వం తలపోస్తోంది. 2003 నుండి ఆమోదించిన 37 సంస్కరణల్లో దాదాపు సగం గత నాలుగేళ్లలో అమలు జరగటం వల్ల భారత్ ర్యాంకింగ్ శీఘ్రంగా పెరిగింది. సరళతర వ్యాపార నిర్వహణకు అనువైన చర్యలుగా నిర్ణయించిన 10 సూచికల్లో ఎనిమిదింటిలో భారత్ సంస్కరణలు అమలు జరిపింది. పన్నులు, నిర్మాణ పర్మిట్లు, పెట్టుబడిదారుకు రక్షణ, దివాళా పరిష్కారం అంశాల్లో గణనీయమైన మెరుగుదల ఉంది. వాణిజ్యానికి అంతర్రాష్ట్ర అవరోధాలను తొలగిస్తూ, ఒకే మార్కెట్‌ఒకే పన్ను విధానాన్ని ప్రవేశపెట్టిన జిఎస్‌టి అమలు అనంతరం వ్యాపార వాతావరణాన్ని ఈ నివేదిక పరిగణనలోకి తీసుకోలేదు. జూన్ 1నుంచి జిఎస్‌టి అమలులోకి రాగా ఈ నివేదికకు జూన్ కట్ ఆఫ్ తేదీగాఉంది. ఈ హైజంప్ పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, ఆకలి సూచికలో అధమ స్థానంపట్ల స్పందించరెందుకో! మోడీ ప్రభుత్వం పెట్టుబడి అనుకూల విధానాలు అనుసరిస్తున్నదనటానికి పై రెండు సూచికల మధ్య అగాధమే నిదర్శనం.
వ్యాపారాలను శీఘ్రంగా నెలకొల్పటం, అవరోధాలు లేకుండా అనగా ప్రభుత్వ ఏజన్సీల జోక్యం లేకుండా కొనసాగించే వాతావరణం నెలకొల్పటం ‘సులభతర వాణిజ్య పరిస్థితులకు’ కీలకం. లైసెన్స్ రాజ్‌ను అంతమొందించి స్వేచ్ఛా వాణిజ్యానికి తలుపులు బార్లా తెరవటమనే ఆర్థిక సరళీకరణ విధానం అమలులో ఇది అంతర్భాగం. ప్రభుత్వ నియంత్రణలు, జోక్యాలు లేనప్పుడు స్వదేశీ, విదేశీ పెట్టుబడులు విరివిగా వచ్చి వ్యాపారాభివృద్ధి వేగవంతమవుతుందని, ప్రజలకు సేవలు సులువుగా అందుతాయని నయా ఉదార ఆర్థిక పండితుల సూత్రీకరణ.
సులభతర వాణిజ్య సూత్రీకరణకు నిర్దేశించిన 10 కొలమానాల్లో వ్యాపార
రిజిస్ట్రేషన్ అనంతర ప్రక్రియలను పన్ను రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత రిజిస్ట్రేషన్, లైసెన్సింగ్‌లను సులభతరం చేయటం; నిర్మాణ అనుమతుల ప్రాసెసింగ్ వ్యవధి తగ్గించటం; పన్నుల చెల్లింపు పద్ధతిని సరళతరం చేయటం, ఎగుమతుల కొరకు రవాణా, రేపు సదుపాయాలను పటిష్టం చేయటం, పెట్టుబడులకు రక్షణతోపాటు దివాళా సందర్భంలో సత్వర పరిష్కారాలు, కార్మికులను, వారి సామాజిక భద్రతను నియంత్రించే శాసనాలు చేయటం వగైరా ఉన్నాయి. ప్రపంచబ్యాంక్ నివేదిక ప్రకారం, వ్యాపారం ప్రారంభించటాన్ని భారత్ సులభతరం చేసింది. అందుకు అవసరమైన ప్రొసీజర్స్ తగ్గించింది. బిల్డింగ్ పర్మిట్లు మంజూరు, పరపతి లభ్యత వ్యవధిని తగ్గించింది. మైనారిటీ మదుపుదారులకు రక్షణ మెరుగైంది. పన్నుల చెల్లింపు విధానం సరళతరం చేయ బడింది. అయితే వ్యాపారాల ప్రారంభం, కాంట్రాక్టుల అమలు, నిర్మాణ పర్మిట్ల మంజూరు రంగాల్లో చేయవలసింది ఇంకా ఎంతో ఉందని బ్యాంక్ నివేదిక పేర్కొన్నది.
పెట్టుబడులు ఆకర్షించే నిమిత్తం అనుమతులు, పర్మిట్లు మంజూరును ఎంతో సులభతరం చేశామని రాష్ట్రప్రభుత్వాలు పోటీపడి ప్రకటనలు చేయటం వెనుకనున్న అంతరార్థం వ్యాపారాలు చేయటాన్ని సులభతరం చేయాలన్న కేంద్రప్రభుత్వ ఒత్తిడి. ఆర్థిక సరళీకరణను వేగవంతం చేయటానికి మోడీ ప్రభుత్వం నడుం కట్టింది. పరిశ్రమలు పెట్టటం, మూసివేయటాన్ని సులభతరం చేసినట్లే కార్మికుల హైర్ అండ్ ఫైర్‌ను సులభతరం చేసేందుకు కేంద్రప్రభుత్వం కార్మిక చట్టాలను సవరించే పనిలో ఉంది. కార్మికులు ప్రతిఘటిస్తున్నారు. సులభతర వాణిజ్య ర్యాంకింగ్‌లో ఎగబాకటానికి ఇది ప్రతిబంధకంగా ఉంది. వాణిజ్య సులభతరం పెట్టుబడిదారులకు మేలు చేస్తుంది తప్ప ఉత్పత్తిదారులకు, కార్మికులకు వనగూరేదేమీ ఉండదు.