*చెక్ పోస్టుల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయాలి
*వీడియో కాన్ఫరెన్సులో అధికారులకు మంత్రి హరీశ్‌రావుఆదేశాలు
మన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధి : రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతున్న కందుల కొనుగోలు కేంద్రాలలో కందుల కొనుగోలు, దానికి సంబంధించిన ఇతర సమస్యలపై రాష్ట్ర భారీ నీటి పారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీష్‌రావు జిల్లా కలెక్టర్లు, జేసిలు, వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. గురువారం మెదక్ జిల్లా నుండి మంత్రి మాట్లాడుతూ కందులకు మన రాష్ట్రంలో రేటు ఎక్కువగా ఉండటం వల్ల ఇతర రాష్ట్రాల రైతులు ఇక్కడ కందులు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని, వారి ప్రయత్నాలను మొదటి స్థానంలో చెక్ పోస్టుల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేసి నివారించాలని దీని ద్వారా రాష్ట్ర రైతులకు గిట్టుబాటు ధర లభించి లాభం పొందే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. కొందరు మధ్య దళారులు రైతులను మభ్యపెట్టి వారి ద్వారా కందులను మన మార్కెట్‌లలో అన్ని ధృవీకరణ పత్రాలు చూపించి అమ్ముతున్నారని, దీనిని నివారించాలంటే విఆర్‌ఒ ఇచ్చే సర్టిఫికెట్‌తో పాటు అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్‌తో పంట వేసినట్లుగా సర్టిఫికెట్ తీసుకొచ్చినట్లయితేనే మార్కెట్‌లో కొనుగోలు చేయాలని, అనుమానం వచ్చిన సెంటర్లలో తనిఖీలు చేసి కేసులు బుక్ చేయాలన్నారు. చెక్‌పోస్టుల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేసి విజిలెన్స్ టీమ్‌లతో గట్టి తనిఖీలు చేయించాలని అన్నారు. అవసరం లేని చోట కందుల కొనుగోలు కేంద్రాలను మూసివేయాలని ఆయన అన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్ కార్యదర్శి పార్థసారధి అన్ని జిల్లాల కలెక్టర్లతో పలు సమస్యలపై వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతూ రాష్ట్రంలోని అందరు జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు వచ్చే 10, 15 రోజుల్లో కందుల కొనుగోలు కేంద్రాలపై శ్రద్ద వహించాలని ఇతర రాష్ట్రాల నుండి వచ్చే కందులను బార్డర్‌లోనే నిలిపివేసి, అర్హత గల రైతులకు సహాయం చేయాలని, కందులు సాగు చేసిన విస్తీర్ణం తక్కువగా ఉండి, ఎక్కువ మోతాదులో కందులు మార్కెట్‌కు వచ్చినట్లయితే ఆ ప్రాంతంలో రైతుల వారీగా వ్యవసాయ అధికారులు సాగు చేసిన వివరాలు సేకరించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ జిల్లాలో 8వేల హెక్టార్లలో కందులు సాగు చేసినట్లు, దాని ద్వారా 90వేల క్వింటాళ్లు దిగుమతి వస్తున్నట్లు, ఇప్పటికే 48వేల క్వింటాళ్లు, హకా ద్వారా 3,696 క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు, ప్రభుత్వ ఆదేశాలకు అనుసారంగానే కొనుగోళ్లు చేస్తున్నట్లు, ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా అధికారులతో తనిఖీలు చేయిస్తూ, మధ్య దళారుల ప్రమేయం లేకుండా వచ్చే రైతులకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో జాయింట్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి, వ్యవసాయశాఖ అధికారి జి.నర్సింగరావు, మార్కెటింగ్ ఏడి.ఎండి.అలీం, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.