Thursday, April 18, 2024

సంపాదకీయం: ఉద్యమానికి మచ్చ!

- Advertisement -
- Advertisement -

CM Nitish kumar in insecurity!

కలలో కూడా తీరం దాటని సముద్రంలా రెండు మాసాల పాటు గడ్డ కట్టించే ఢిల్లీ చలిలో అత్యంత ప్రశాంతంగా ఉద్యమాన్ని నిర్వహించిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ గణతంత్ర దినం నాడు అదుపు తప్పి హింసాత్మకంగా మారడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక వర్గం రైతులు బలప్రయోగంతో పోలీసు అవరోధాలను దురుసుగా తొలగించుకుంటూ ఢిల్లీ నగరంలోకి దూసుకుపోయి భారీ కాపలాలోని ఎర్రకోటపై జెండా ఎగురవేయడం వారి రాజీలేని దీక్షకు, సంకల్ప బలానికి సంకేతమనిపించినప్పటికీ అది వారి క్రమశిక్షణా రాహిత్యాన్నే చాటిం ది. రైతులు ఇచ్చిన మాటను తప్పారనడానికి నిదర్శనంగానే నిలిచిపోయింది. రిపబ్లిక్ డే ఉత్సవాలు ముగిసిన తర్వాత ముందుగా ఒప్పుకున్న మార్గాల్లోనే ర్యాలీని నిర్వహిస్తామని చెప్పి దానిని ఉల్లంఘించారనే అపకీర్తిని వారికి కట్టబెట్టింది. రైతులు అనేక చోట్ల బారికేడ్లను తొలగించుకుంటూ ఢిల్లీ నగరంలోకి ప్రవేశించడంతో పోలీసులకు వారికీ మధ్య ఘర్షణలు చోటు చేసుకొని హింసాయుత పరిణామాలకు దారి తీశాయి.

ఒక ట్రాక్టర్ మితిమించిన వేగంతో అడ్డుగోడను ఛేదించుకుని వెళ్లడానికి ప్రయత్నించగా పైనున్న ఒక రైతు కిందకి పడిపోయి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటనలు ఇతరత్రా అత్యంత గొప్పగా సాగిన రైతు ఉద్యమానికి మచ్చను తెచ్చాయి. ఇందు కు పాల్పడిన వారెవరు అనే ప్రశ్నకు రూఢి సమాధానం లేకపోయినా అనుమానాలను రేకెత్తించే కొన్ని వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎర్రకోట మీద ఉద్యమ జెండా ఎగురవేసిన వారు బిజెపికి అనుకూలురని, గతంలో ప్రధాని మోడీతో కలిసి ఫోటో దిగిన ఒక వ్యక్తి ప్రమేయంతోనే అది జరిగిందని ఈ వార్తలు చెబుతున్నాయి. వాస్తవాలు నిలకడగా గాని పూర్తిగా రూఢిగా వెల్లడి కావు. కాని ఈ ఘటనలు భవిష్యత్తు రైతు ఉద్యమంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రెండు రైతు సంఘాలు ఉద్యమానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఉద్యమం ఎవరి చేతుల్లోనో పావుగా నడుస్తున్నదని ఆ సంఘాల నేతలు ఆరోపించినట్టు వచ్చిన వార్త గమనించదగినది.

ఇంత కాలం దుర్భేద్యంగా సాగుతూ వచ్చిన రైతు కార్యాచరణకు బీటలు పడడం మొదలైందని ఈ వార్తలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వం కూడా చాలా కాలంగా దీనినే కోరుకుంటున్నది. రైతు లు విసిగిపోయి లేక చీలిపోయి ఉద్యమం నీరుగారిపోవాలన్నదే దాని ఆకాంక్ష అని స్పష్టపడిపోయింది. ప్రభుత్వం ఆశించిన దానిని రైతుల్లోని ఒక వర్గమే నెరవేరుస్తున్నదని అనిపించడం తప్పు కాదు. ఇది ఇంకెన్ని ఇటువంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి. మంగళవారం నాటి హింసాయుత ఘటనలకు సంఘ విద్రోహ శక్తులే కారణమని రైతు సంఘాల నాయకులు అంటున్నారు. వారు లోపలికి జొరబడి ఆ ఘటనలు జరిపించారని తమకు ఎటువంటి దురుద్దేశమూ లేదని అనుకున్న దాని ప్రకారమే శాంతియుతంగా ర్యాలీ ని నిర్వహించాలని తాము సంకల్పించామని వారు చెబుతున్నారు. ఈ ఘటనలతో నిరుత్సాహపడి ఉద్యమాన్ని విరమించుకునే ఉద్దేశం లేదని తమ డిమాండ్లు నెరవేరే వరకు కొనసాగించి తీరుతామని కూడా వారు స్పష్టం చేశారు.

ఢిల్లీ నగరంలోకి ప్రవేశించిన రైతు ఉద్యమకారుల మీద ఎక్కడికక్కడ నగర వాసులు పూల వర్షం కురిపించడం వంటి సంఘటనలు కూడా సంభవించాయి. రైతు ఆందోళన పట్ల దేశ మెజారిటీ ప్రజల్లో సానుభూతి చెక్కుచెదరలేదని రుజువవుతున్నది. రెండు మాసాలుగా వేలాది మంది రైతులు ఉద్యమం చేస్తుంటే చర్చల పేరు చెప్పి ప్రభుత్వం కాలయాపన చేసిందే గాని వారి విశ్వాసాన్ని చూరగొనేలా వ్యవహరించి ముగింపు సాధించలేకపోడాన్ని హర్షించగలిగేవారు బహు తక్కువగా ఉంటారు. పార్లమెంటులో ఆదరాబాదరగా ఆమోదింప చేసుకున్న ఆ మూడు కొత్త సాగు చట్టాలు రైతులకున్న కనీస రక్షణలను కూడా తొలగించి వారి శ్రమను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అతి చవకగా అప్పగించి వ్యవసాయదారుల బతుకులను మరింత హీనంగా మార్చడానికి ఉద్దేశించినవేనని సందేహాతీతంగా వెల్లడైపోయింది.

రైతులే వద్దంటున్న చట్టాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అమల్లో పెట్టాలని ప్రభుత్వం ఎందుకు, ఎవరి కోసం అనుకుంటున్నది? ఈ చట్టాలు రైతుల కోసం కాకుండా అమిత పెట్టుబడులు పెట్టి విశేష లాభాలు పొందాలనుకుంటున్న కార్పొరేట్ రంగం కోసమే ఊడిపడ్డాయనే విషయం దేశ ప్రజలు గ్రహించారు. అందుచేత రైతు ఉద్యమం భవిష్యత్తు ఎలా ఉన్నప్పటికీ ఈ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం పునః పరిశీలన జరిపి వాటిని రద్దు చేయడమే దానికి మేలు చేస్తుంది. మొండి ధీమాతో నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం పాలకులకు మేలు చేయదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News