Home హైదరాబాద్ జోరుగా విదేశీ మద్యం అమ్మకాలు

జోరుగా విదేశీ మద్యం అమ్మకాలు

Foreign liquor sales in HYD

అక్రమంగా నగరానికి చేరుతున్న కోట్లలో మద్యం
పట్టించుకోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ

సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరంలో విదేశీ మద్యం ఆక్రమ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో విదేశీ మద్యానికున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కొంతమంది ఈ అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సదరు వ్యక్తులు విదేశాల నుంచి ఆకాశ,సముద్ర మార్గాల్లో గుట్టుచప్పుడు కాకుండా విదేశీ మద్యాన్ని ఇక్కడికి తెప్పిస్తున్నారు. కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి, కొంతమంది అధికారులకు మాముళ్లు ముట్టజెప్పి విదేశీ సరుకును ఇక్కడకు తెప్పిస్తున్నారు. అలాగే విదేశాల నుంచి ఇక్కడకు వస్తున్న వారి సహకారంతో కూడ మద్యాన్ని ఇక్కడకు తెప్పించుకుంటున్నారు. కొంతమంది ఈ విదేశీ మద్యాన్ని తాగడానికి వినియోగిస్తుండగా, మరికొందరు వ్యాపార దృక్పథంతో మద్యాన్ని తెప్పించి అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే ప్రభుత్వం దాదాపు అన్ని వైన్‌షాపులకు విదేశీ మద్యాన్ని అమ్మడానికి అనుమతి ఇచ్చింది.

ప్రస్తుతం విదేశీ మద్యం టాలీస్కోర్ 25 ఇయర్ సింగల్ మాల్ట్ విస్కీ(700ఎంఎల్) బహిరంగ మార్కెట్‌లో రూ. 34,200 ధర పలుకుతుంది. జానివాకర్ బ్లూలేబుల్ స్కాచ్ రూ.21,810, సీవస్ రీగల్ 18 ఇయర్స్ గోల్డ్ సిగ్న స్కాచ్ రూ.8,450, రంట్‌బ్లూట్ రోస్ ప్రీమియర్ చాంపన్‌జీ రూ.7,000, క్రంగన్‌మోర్ 12 ఇయర్స్ ఎస్‌ఎస్ మాల్ట్ స్కాచ్ రూ.6,950, డాన్‌జోలియో అనేజో టకీలా రూ.5150, జామ్స్ కింగ్, కాసిల్‌రాక్ విస్కీ, వోడ్కాలు రూ. 3 వేల నుంచి 4 వేల వరకు ధర పలుకుతున్నాయి. కొన్ని బ్రాండ్లు ధరలు 25 వేల నుంచి లక్ష రూపాయల వరకు పలుకుతున్నాయి. అయితే వైన్‌షాపులో లభించే విదేశీ మద్యం అధిక ధరలు పలుకుతుండటంతో కొంతమంది ఈ ఆక్రమ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఆక్రమంగా తీసుకుని వచ్చిన విదేశీ మద్యాన్ని సదరు వ్యక్తులు బ్రాండ్‌ను బట్టి రెండు వేల నుంచి 25 వేల వరకు అమ్ముతున్నారు.

వైన్‌షాపుల్లో కంటే విదేశీ మద్యం ధర తక్కువ ఉండటంతో , ఇక్కడ అమ్మే విదేశీ మద్యం కల్తీ జరుగుతుందనే అనుమానంతో చాలమంది ఆక్రమ కొనుగోళ్లపైనే ఆసక్తి చూపుతున్నారు. దీంతో విదేశీ మద్యం ఆక్రమ వ్యాపారం నగరంలో మూడు పువ్వులు, ఆరుకాయాల్లా వర్ధిల్లుతుంది. ఈ ఆక్రమ వ్యాపారం వలన ప్రభుత్వానికి రావాల్సి ఆదాయానికి గండి పడుతుంది. తద్వారా రాష్ట్ర ఖజానాపై దీని ప్రభావం పడుతుంది. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్‌ఆర్‌నగర్, సికింద్రాబాద్,బొల్లారం, అల్వాల్ తదితర ప్రాంతాల్లో అక్రమంగా విదేశీ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నట్లు తెలిసింది. గత ఏడాది అనుమతి లేకుండా విదేశీ మద్యాన్ని అమ్ముతున్న ఓ ఎమ్మెల్సీని, అతనికి సహకరించిన నలుగురిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసి, వారి నుంచి రూ.1.61 కోట్ల విలువైన విదేశీమద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికైన సంబంధితశాఖ ఉన్నతాధికారులు స్పందించి నగరంలో విదేశీ మద్యం అమ్మకాలకు చెక్ పెట్టాలని పలువురు కోరుతున్నారు.