Home Default జెఎన్‌యులో దాడి మా పనే

జెఎన్‌యులో దాడి మా పనే

JNU Violence

 

వెల్లడించిన హిందూ రక్షాదళ్

న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు)లో ఆదివారం పాయంకాలం జరిగిన హింసాకాండకు తమదే బాధ్యత అని రైట్ వింగ్ గ్రూప్ హిందూ రక్షాదళ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో ద్వారా తెలిపింది. సోమవారం పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ఎవరికైనా జెఎన్‌యు విద్యార్థులు, అధ్యాపకులకు పట్టిన గతే పడుతుందని పింకీ చౌదరి అని తనను తాను పరిచయం చేసుకున్న వ్యక్తి ఆ వీడియోలో చెప్పారు. ‘జాతి వ్యతిరేక కార్యకలాపాలతో సంబంధమున్న మిగిలిన వారు కూడా ఇలాంటి దాడుల్ని ఎదుర్కోవలసి ఉంటుంది’ అని అతను ఆ తర్వాత న్యూస్ ఛానల్స్‌కు చెప్పారు. చౌదరి ప్రకటనపై వెంటనే ఏ రియాక్షన్ రాలేదు.

‘జెఎన్‌యు చాలాకాలం నుంచి కమ్యూనిస్టులకు కోటగా ఉంది. మేం దాన్ని సహించం. జెఎన్‌యులో జరిగిన దానికి హిందూ రక్షాదళ్‌కు చెందిన భూపేంద్ర తోమర్, పింకీ చౌదరి బాధ్యత వహిస్తున్నారు. దాడి చేసిన వారంతా మా వాలంటీర్లే. భారతమాతకోసం ఆమాత్రం పనిచేయకుంటే వారికి దేశంలో నివసించే హక్కు లేదు’ అని చౌదరి చెబుతున్నట్టు ఆ వీడియోలో ఉంది. ‘దేశంకోసం ఎలాంటి త్యాగానికైనా మేం సిద్ధం. మతానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సహించం’ అని హెచ్చరించాడు. చౌదరి ఫోన్ అందుబాటులో లేకపోవడంతో అతని ఉనికి తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ ఎబివిపి వలంటీర్లే దాడి చేశారని జెఎన్‌యు ఎస్‌యు ఆరోపించింది.