Home ఎడిటోరియల్ హిందుత్వ ‘ట్రంప్’ కార్డు

హిందుత్వ ‘ట్రంప్’ కార్డు

Donald-Trump-Poojaఅమెరికా అధ్యక్ష ఎన్నికలో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ‘ప్రపంచాన్ని ఇస్లామిక్ టెర్రిజంనుంచి రక్షించడంకోసం దిగివచ్చిన అవతార పురుషుడు’గా హిందుత్వ సేన కు కనిపిస్తున్నట్లుంది. ట్రంప్ గెలుపు కోసం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద హిందూసేన బుధవారం ‘హోమం’ జరిపింది. ఆ ప్రదేశం అంతా ‘ ట్రంప్ జిందాబాద్’ నినాదాలతో మార్మోగింది. ‘ డోనాల్డ్ ట్రంప్ ఆయేగా.. ఇస్లామిక్ ఆటంకవాద్ ఖతమ్ హోగా’ (డోనాల్డ్ ట్రంప్ వస్తారు.. ఇస్లామిక్ టెర్రిజం అంత మవుతుంది)అనికూడా అక్కడ గుమిగూడిన చిన్న హిందూ సేన నినదించింది. అక్కడ అందరి దృష్టిని ఆకర్షించేలా హనుమాన్ చిత్రాన్ని ఉంచారు. దానిపైన నవ్వుతున్న ట్రంప్, హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా ఫొటోల పోస్టర్‌ను పెట్టారు. ఇతర హిందూ సేన వారు ‘వుయ్ లవ్ ట్రంప్ ’ అని రాసిఉన్న పోస్టర్లను ఎంతో ఆప్యాయంగా పైకెత్తి పట్టుకున్నారు. ‘డొనాల్డ్ ట్రంప్ ఇస్లామిక్ టెర్రిజం అనే దుష్ట శక్తితో పోరాడగల ధైర్యశాలి’అని హిందూ సేన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. అమెరికాలో నివసిస్తున్న ప్రతి ఒక్క హిందూ సంతతి వ్యక్తీ ఆయనకే ఓటు వేయాలని ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
ఆదిలో అల్లర్లు దాడులతో ప్రచారం తెచ్చుకున్న సేన
2011లో హిందూ సేనను విష్ణు గుప్తా నెల కొల్పారు. ఆదిలో ఆ సంస్థ అల్లర్లు , దాడులు జరపడం ద్వారా జనం దృష్టిలో పడింది. ఇటీవలి కాలంలో టెర్రరిజంతో పోరాటానికి కొంత కృషి చేసింది. ఢిల్లీలోని పాటియాలాహౌస్ కోర్టులో విచారణలో ఉన్న అబ్దుల్ కరీమ్ తుండాను మరోవ్యక్తితో కలిసి విష్ణు గుప్తా చెంపదెబ్బ కొట్టి 2013 ఆగస్టులో విశేష ప్రచారం పొందాడు. లష్కర్-ఇ- తోయిబా కోసం బాంబులను తయారు చేసిన కేసులో విచారణ సాగుతున్న నిందితుడు కరీమ్. అయితే అతను తరువాత అన్ని ఆరోపణలనుంచీ విముక్తుడయ్యాడు. 2014 జనవరిలో హిందూ సేన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంపై దాడి చేసింది. జమ్ము-కశ్మీర్ నుంచి సాయుధ బలగాల ప్రత్యేక అధికారా ల చట్టాన్ని ఉప సంహరించాలని ఆ పార్టీ సభ్యుడు ప్రశాంత్ భూషణ్ డిమాండ్ చేసినందుకు ఈ దాడి జరిపింది. ఆ చట్టం మానవ హక్కుల ఉల్లంఘన కేసులలో సైన్యానికి నేరం అంటకుండా నిరోధిస్తోం దన్నది ఆయన వాదన.
కేరళ హౌస్ కేసులో భంగపడ్డ గుప్తా
హిందూ సేన తీవ్ర నేరంగా భావించే మరో అంశం గొడ్డు మాంసం తినడం. గత ఏడాది ప్రభుత్వం గొడ్డు మాంసంపై నిషేధం విధించడాన్ని నిరసిస్తూ జమ్ము-కశ్మీర్ శాసనసభ్యు డొకరు అదే మాంసంతో పార్టీ ఇస్తుండగా ఆయనపై హిందూ సేన ఇంకు చల్లింది. తరువాత తన పోరాటాన్ని హిందూసేన కేరళ భవన్‌కు తీసుకు పోయింది. అక్కడ క్యాంటీన్‌లో గొడ్డు మాంసం వడ్డించకుండా హెచ్చరించడం కోసం పోలీసులను పిలిపించింది. తప్పుడు ఫిర్యాదు ఇచ్చినందుకు ఈ కేసులో గుప్తాను తరువాత అరెస్టు చేశారు. ఇటీవల హిందూ సేన తన పద్ధతులను మార్చుకొన్నట్టు కనిపిస్తోంది. గతనెల జవహర్ లాల్ నెహ్రూ యూనివ ర్శిటీని ‘పవిత్రం చేయడంకోసం’ శ్రీరామ నవమి ప్రార్థనను జరిపింది. గత ఫిబ్రవరిలో దేశ వ్యతిరేక నినాదాలతో అదిభ్రష్టు పట్టిందని భావించి హిందూ సేన ఈ పని చేసింది.
ట్రంప్‌పై గంపెడు ఆశలు
ఇస్లామిక్ టెర్రరిజం వెన్ను ట్రంప్ విరుస్తాడని గుప్తా ఒక ఇంటర్వూలో చాటారు. ‘ఎక్కడపడితే అక్కడ బాంబులు వర్షిస్త్తున్నాయి. ఇస్లామిక్ టెర్రిజం వల్ల ఇరాన్, ఇరాక్, భారత్ సహా ఎన్నో దేశాలు బాధలకు గురవుతున్నాయి.’ అని గుప్తా విచారం వ్యక్తం చేశారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడయాక తన మొదటి దృష్టిని భారత్‌పై ప్రసరిస్తారని, టెర్రిజానికి వ్యతిరేకంగా ట్రంప్ పోరాటం మన పొరుగు దేశమైన పాకిస్థాన్‌తో మొదలు పెడతారని గుప్తా పేర్కొన్నారు. జైష్-ఎ-మొహమ్మద్ టెర్రరిస్టు సంస్థ వ్యవస్థాప కుడు మాసూద్ అజర్ , నేరస్థుల ముఠా డి- కంపెనీ వ్యవస్థాపకుడు దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లో ఉన్నా రని, ఆ దేశంలో ఒసామా బిన్ లాడెన్ వెంట ఎలా పడ్డారో అలా వారి వెంట కూడా అమెరికా పడాలని, ట్రంప్ ఆ పని చేయగల సమర్ధుడని గుప్తా ట్రంప్‌కు కితాబిచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ చేరు కోలేని చోట్లకు ట్రంప్ చేరుకొం టారని గుప్తా విరించారు. ప్రపంచమంతటి పై ప్రభావం గల వ్యక్తిగా సిరియా, పాకిస్థాన్, ఇరాన్ కు ట్రంప్ వెళ్లగలరని తెలిపారు. ట్రంప్ ప్రసంగాలు హృదయ రంజకంగా తనకు అనిపించినట్లు చెప్పారు. అమెరికానుంచి ఇస్లామ్‌ను నిషేధిస్తానని ట్రంప్ అనడాన్ని చాలా హృద్యమైన ప్రకటనగా గుప్తా ప్రత్యేకించి ప్రశంసించారు. యుద్దంనుంచి పారిపోయి వస్తున్న సిరియా శరణార్థు లను వెనక్కి పంపుతానన్న ట్రంప్ విధానానికి గుప్తా మద్దతు ప్రకటించారు. మెక్సికన్ శరణార్థులను రాకుండా చేయడానికి సరిహద్దుల గుండా గోడకడ తానన్న ట్రంప్ ప్రకటనను మెచ్చుకొన్న గుప్తా భారత్ కూడా బంగ్లా శరణార్థులు రాకుండా అదే ఉపాయం అనుసరించాలని అన్నారు. ప్రజల భావాలు ట్రంప్ మాటల్లో ప్రతిఫలిం చాయని పేర్కొన్నారు. ట్రంప్ అనుకూల వాఖ్యలు చేస్తున్నది గుప్తా ఒక్కరే కాదు. అమెరికాలో ఫ్రీడం పార్టీ ముఖ్య నాయకుడు, ఆదేశపు ప్రముఖ శ్వేత జాతీయవాదులలో ఒకరైన విలియమ్ జాన్సన్ కూడా అలాగే ట్రంప్‌ను మెచ్చుకొంటారు. మనం మాట్ల్లాడలేని విషయాలను ట్రంప్ మాట్లాడు తున్నా రని, తాను ఈ అంశాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకుపోతాడని జాన్సన్ అన్నారు.
ట్రంప్ ప్రచారంలోని ఇతర కోణాల గురించి గుప్తా అంతగా అవగాహన లేనట్లు మాట్లాడారు. స్త్రీద్వేషం వెళ్లగ్రక్కుతూ చేసిన వ్యాఖ్యలు ,మహిళలపై చేసిన విరుద్ధ వ్యాఖ్యల గురించి తనకు తెలియదని గుప్తా చెప్పారు. ఆయన దృష్టిలో ప్రధాన అంశం టెర్రిజమేతప్ప మరోటి కాదు. భారత , చైనా, జపాన్‌లు తమ వస్తూత్పత్తి రంగం లోని ఉద్యోగాలను తన్నుకు పోతూ, సొమ్ము చేసుకొంటున్నాయని ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల గురించికూడా గుప్తాకు తెలిసినట్లు లేదు. ‘ట్రంప్ తన సొంత దేశంకోసం చేసే వ్యాఖ్యలతో సమస్య లేదు. ఎవరైనాతన దేశ క్షేమమే ముందు కోరుకొంటారు’ అని గుప్తా సమర్ధించారు. వలసలను తగ్గించడానికి నియమాలను కఠినతరం చేయాలన్న ట్రంప్ ప్రతిపాదన గురించి గుప్తా వ్యాఖ్యానిస్తూ‘ భారతీయ విద్యార్థులను అమెరికా నుంచి బయటకు విసిరివేయ కూడదని ట్రంప్ అన్నట్టు వివరించారు. ‘అసలు మనవాళ్లు కేవలం డబ్బు కోసం విదేశాలకు పోవడం ఎందుకు?వాళ్లు దేశంలోనే ఉండి పనిచేయాలి’ అని గుప్తా అన్నప్పుడు దేశంలో అన్ని ఉద్యోగాలు లేవని ఎవరో గుర్తు చేశారు. ‘అది మోడీ పని’ అని గుప్తా జవాబిచ్చారు.
ట్రంప్ ప్రచారంలోని ఇస్లామ్ వ్యతిరేక వ్యాఖ్యల పట్ల సంబరపడి, ఆయనప్లై హిందూ సేన మక్కువ పెంచుకొందన్నది సుస్పష్టం. – ధనుష్