Home తాజా వార్తలు కోటి నోముల ఫలం కార్తీక పౌర్ణమి

కోటి నోముల ఫలం కార్తీక పౌర్ణమి

karthika pournami

 

పర్వదినాల మాసం కార్తీకమాసం. కార్తీక పున్నమి మరింత విశిష్టత కలిగింది. ఈ మాసంలో మిగిలిన అన్ని రోజులూ చేసే స్నానం, దానం, దీపం, జపం, ఉపవాసాలు చేయడం సహజం. కానీ కార్తీక పౌర్ణమి రోజు చేసే పూజల ఫలితం అత్యంత ఫలప్రదంగా చెబుతారు పెద్దలు. కార్తీక పౌర్ణమినాడు తెల్లవారు జామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం మంగళకరం. నదిలో స్నానం చేసే అవకాశం లేకుంటే ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించుకుని గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకోవాలి. రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు భక్తులు. రోజుకు ఒక వత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ వత్తులు. కొందరు దీపాలను అరటిదొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు.

శివాలయాల్లో దీపాలు వెలిగించేవారు కొందరుంటే, ఆ అవకాశం లేనివారు ఇంట్లోనే తులసికోట ఎదుట దీపం వెలిగించొచ్చు. దేవాలయాల్లో సహస్ర లింగార్చన, మహా లింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే. ఇలా చేస్తే సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుందని అంటారు. కార్తీక పౌర్ణమినాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. కార్తీక పౌర్ణమి జైనులకు, పంజాబీలకు, సిక్కులకు కూడా విశిష్ట పర్వదినం. ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తారు.

ఈ రోజున మహిళలు పగలంతా ఉపవాసం ఉండి, రాత్రి దీపారాధన చేసి, చలిమిడిని చంద్రుడికి నివేదించి, ఫలహారంగా స్వీకరించాలని శాస్త్రోక్తి. ఇలా చేయడం వల్ల కడుపు చలవ (బిడ్డలకు రక్ష) అని పెద్దలు చెబుతారు. ఆరోగ్యపరంగా గమనిస్తే ఇలా చేయడం వల్ల గర్భాశయ సమస్యలు దరిచేరవని ఆయుర్వేద శాస్త్రం వల్ల తెలుస్తోంది. శివాలయాల్లో జరిపే జ్వాలాతోరణం కార్తీక పౌర్ణమి మరో ప్రత్యేకత. వృషవ్రతం, మహీఫలవ్రతం, నానా ఫలవ్రతం, సౌభాగ్యవ్రతం, మనోరథ పూర్ణిమావ్రతం, కృత్తికా వ్రతం లాంటి వ్రతాలు, నోములు నోచుకుంటారీ రోజు. వీటితోపాటు లక్షబిల్వార్చన, లక్షప్రదక్షిణ, లక్షవత్తులు, లక్షరుద్రం లాంటి పూజలూ చేస్తారు. దైవ దర్శనం, దీపారాధన, దీపదానం , సాలగ్రామ దానం, దీపోత్సవ నిర్వహణ ఇవన్నీ కార్తీక పున్నమి రోజు విశేష శుభ ఫలితాలను ఇస్తాయని కార్తీక పురాణం చెబుతోంది. అరుణ గిరిపై వెలిగించే కార్తీక దీపం ఎంతో విశిష్టమైనది. వందల టన్నుల ఆవునెయ్యిలో వేల టన్నుల నూలు వస్త్రాన్ని ముంచి, అరుణగిరి కొండలపై వెలిగించే ఈ దీపం ముందు ఆనాటి పున్నమి వెన్నెల చిన్నబోతుంది. పదిరోజులపాటు వరుసగా పున్నమి వెన్నెలను వెదజల్లడం ఈ దీపం ప్రత్యేకత. ఇదంతా చూడాలంటే రెండు కన్నులు చాలవు కదా!

history importance of karthika pournami in telugu