Home దునియా కాకతీయ, రెడ్డిరాజులు నిర్మించిన పోచారం చెరువు

కాకతీయ, రెడ్డిరాజులు నిర్మించిన పోచారం చెరువు

History of Pocharam lake

భారతదేశంలోని అత్యంత ప్రాచీన భూభాగాల్లో దక్కన్ పీఠ భూమికి ప్రాధాన్యత ఉంది. పూర్వ కాలం నుంచి కొండలను కలుపుతూ చెరువులు నిర్మించినట్లు సుప్రసిద్ధ చరిత్రకారుడు కొశాంబి పరిశోధనల్లో కనిపిస్తుంది. అనాదిగా  జలవనరులకు ప్రాధాన్యత ఇస్తూ అనేక తటాకాలను నిర్మించిన రాజవంశాల పరంపరలో  చెరువుల నిర్మాణం మహా పుణ్యకార్యంగా భావిస్తూ  కాకతీయులు  వేలాది చెరువులను నిర్మించి తెలంగాణను సస్యశ్యామలం చేశారు. అనంతర రాజులు ఈ సంప్రదాయాన్ని గౌరవించడంతో పాటు కాకతీయ రెడ్డి రాజులు నిర్మించిన చెరువులను పరిరక్షించారు. అలాగే కుతుబ్‌షాహీలు, ఆసఫ్ జాహీలు జల వనరులకు ప్రాధాన్యత ఇచ్చారు. 17వ శతాబ్దంలో అధికారంలోకి వచ్చిన నిజాం రాజులు సంస్కరణలు చేపట్టి చెరువులు, మోటబావులు, నిర్మించడంతో పాటు దప్తార్‌యే, తలాబ్, బౌలి శాఖను ఏర్పాటు చేసి చెరువులతో పాటు ప్రాజెక్టుల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇచ్చారు. 32 జలవనరులను ఏర్పాటు చేసిన చరిత్ర నిజాంరాజులకు ఉంది. వీటిలో పోచారం ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఉంది.

ఏడవ నిజాం మీర్‌ఉస్మాన్ అలీ ఖాన్ వేటాడే అభయారణ్య ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్టు ఇది. నిజామాబాద్ జిల్లాలోని నాగిరెడ్డి పేట మండలం పోచారం గ్రామంలో 1922 లో 22 లక్షల 11 వేల రూపాయల వ్యయంతో ప్రాజెక్టును నిర్మించారు. అలేరు వాగుపై నిర్మించిన ఈ జలాశయం నేటికి వేలాది ఎకరాలకు నీరు అందిస్తుంది. 42 గ్రామాలకు సాగునీరు అందిస్తున్న పోచారం ప్రాజెక్టు 10 గేట్లతో జలకళ సంతరించుకుంటుంది. నీటి ఫుల్ ట్యాంక్ లెవల్ 20.5 అడుగులు ఉండగానీటి నిల్వ సామర్థం 1.82 టి.ఎంసిలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు ఆధునీకరణకు శ్రమించడంతో జలకళతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది.  ఒకవైపు ప్రాజెక్టు జల కళ, మరో వైపు దండకారణ్యం ఉండటంతో నిజాం రాజవంశం ఇక్కడే స్థావరాలు ఏర్పాటు చేసుకుని వేటాడేవారు. అయితే 20వ శతాబ్దంలో పోచారం వన్యప్రాణుల సంరక్షణ  స్థలంగా ప్రకటించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణలో ప్రసిద్ధ పర్యాటకప్రాంతాల్లో ఒకటిగా విరాజిల్లడంతో పాటు రెండు పంటలకు సుమారు 17 వేల ఎకరాలకు పోచారం ప్రాజెక్టు నీరందిస్తుంది. వర్షాలు కురువగానే అనేక కాలువలు, గొలుసుకట్టు చెరువులనీరు ఈప్రాజెక్టులో చేరడంతో పాటు చత్తీస్‌గఢ్  వర్షాల వరదనీరు  ఈ ప్రాజెక్టులోకి  చేరుతుంటుంది.