Home హైదరాబాద్ కొత్త ఏడాదిలో హెచ్‌ఎండిఎ… పథకాల ప్రణాళిక

కొత్త ఏడాదిలో హెచ్‌ఎండిఎ… పథకాల ప్రణాళిక

మంత్రి కెటిఆర్‌కు వివరించనున్న అథారిటీ
సంక్రాంతికి ముందే మరోమారు అభివృద్ధిపై సమీక్ష
బాలానగర్ ఫ్లైఓవర్‌కు విముఖత
సమీకృత మాస్టర్‌ప్లాన్‌పై ప్రత్యేక శ్రద్ధ

HMDA-1

మన తెలంగాణ/సిటీ బ్యూరో : కొత్త సంవత్సరంలో పాత పథకాలను కార్యరూపంలోకి తీసుకువచ్చేందుకు సిద్ధ్దమైంది హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండిఎ). ప్రభుత్వం అనుమతిచ్చిన పథకాలతో పాటు ప్రతిపాదితంగా ఉన్న వాటికి కూడా ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ తీసుకురావాలని హెచ్‌ఎండిఎ భావిస్తుంది. ఇటీవల పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావుతో జరిగిన అభివృద్ధి సమీక్షా సమావేశంలో పథకాలను సకాలంలో పూర్తిచేయనున్నట్టు అథారిటీ కమిషనర్ చిరంజీవులు వెల్లడించారు. ట్రక్‌పార్కులు, ఇంటర్‌సిటి బస్ టెర్మినల్ పథకాలపై సమగ్ర సమాచారాన్ని మంత్రికి అందించారు. బాలానగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఖరీదుతో కూడుకున్నదని వివరించారు. ఈ నూతన పథకాలను పూర్తిచేసే సమయాన్ని ఖరారుచేసుకుని అందుకు తగినట్టుగా నిర్ణయాలు తీసుకోనేందుకు ఒక సమయ సూచికను తయారు చేసుకునేపనిలో అథారిటీ నిమగ్నమైంది. 2017లో ప్రారంభమయ్యే పథకాలను ఎప్పటిలోగా పూర్తిచేయనున్నామని, వాటి ప్రస్తుత పరిస్థితులను, ఈ సంవత్సరంలో ఏమేరకు లక్షాన్ని చేరుకోగలం. వంటి విషయాలపై సంస్థ ప్రణాళికను తయారు చేసుకుంటోంది.
సంక్రాంతిలోపు ప్రణాళిక…
రెండు ట్రక్‌పార్కులు, ఒక ఐసిబిటితో పాటు సమీకృత మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు సంబంధించి ప్రత్యేక సమయసూచికను హెచ్‌ఎండిఎ తయారు చేసుకుంటోంది. ఈ సూచికను తిరిగి మంత్రి కెటిఆర్ ముందుకు తీసుకువెళ్ళనున్నది. మరో మారు నగరాభివృద్థిపై సమీక్షా సమావేశాన్ని ఈ సంక్రాంతి పండుగకు ముందు కెటిఆర్ ఏర్పాటు చేయనున్నారనేది సమాచారం. ఇప్పటి వరకు ఆ పథకాలు ఏ స్థాయిలో ఉన్నవి..? ఒక సంవత్సరంలో ఏ మేరకు నిర్మాణం చేయగలుగుతామనేది ఈ సమావేశంలో వెల్లడించనున్నారు. వాస్తవానికి మాస్టర్‌ప్లాన్ రూపకల్పన గత ఏడాదే పూర్తయ్యేది. కాని, సాంకేతికపరమైన లోపాలు విపరీతంగా ఉండటం, కొత్త ప్రతిపాదనలు మరిన్ని చోటుచేసుకోవడంతో కాస్తజాప్యం జరుగుతోంది. ఈ మూడు పథకాలే కాకుండా ఎకోపార్కు ఏర్పాటు, మూసీనది సుందరీకరణ పథకాల విషయమై ప్రభుత్వ అనుమతి వచ్చినా సంబంధిత లావాదేవీల సమాచారాన్ని సేకరించడంలో అథారిటీ నిగమగ్నమైంది. భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్ స్కీం)ను హెచ్‌ఎండిఎ త్వరలోనే చేపట్టాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక సూత్రాలను ఈపాటికే సిద్ధం చేసుకున్న అథారిటీ కొత్త సంవత్సరంలో దీనికి శ్రీకారం చుట్టాలని భావిస్తోంది.
బాలానగర్‌కు విముఖం…
నగర ఎస్‌ఆర్‌డిపిలోని బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మాణం వ్యయంతో కూడుకున్నదని అథారిటీ కమిషనర్ చిరంజీవులు మంత్రి కెటిఆర్‌కు వివరించినట్టు తెలిసింది. అక్కడ మెట్రోరైలు రానున్నదని, భూసేకరణకు వందలకోట్లు వెచ్చించాల్సి వస్తుందనే అభిప్రాయాన్ని కమిషనర్ పేర్కొన్నట్టు సమాచారం. ఆ పథకం మొత్తం దాదాపు రూ.400 కోట్లతో కూడుకున్నదని, అందులో రూ.265 కోట్లు భూసేకరణకే కేటాయించాల్సిన పరిస్థితులున్నట్టు మంత్రి దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలిసింది. అథారిటీ అధికార వర్గాలు కూడా బాలానగర్ ఫ్లైఓవర్‌పై విముఖతగా ఉన్నది బహిరంగ రహస్యం. సంస్థకు చెందిన రూ.400 కోట్లు అక్కడ కేటాయించే బదులు గ్రోత్ కారిడార్‌లో వెచ్చిస్తే అభివృద్ధి జరిగి లేఅవుట్లు, భవన నిర్మాణాల అనుమతులు వచ్చి తద్వారా సంస్థకు ఆదాయం చేకూరుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పన్నులు జిహెచ్‌ఎంసికి… వ్యయం అథారిటీకా..?
బాలానగర్ ప్రధాన రహదారిలో ఆస్తిపన్ను, వ్యాపార, వృత్తిపరమైన పన్నులను వసూలు చేసుకునేది జిహెచ్‌ఎంసి. అక్కడ వ్యయమయ్యే అభివృద్ధి పథకం హెచ్‌ఎండిఎకు కేటాయించడంపై అధికార వర్గాల్లో కొంత వ్యతిరేకత వినిపిస్తుంది. నగర శివారు సర్కిళ్ళ నుండి వసూలు చేసుకుంటున్న అభివృద్ధి పన్నును ప్రభుత్వ ఆదేశాల మేరకు అథారిటీకి ఏటా చెల్లించకపోగా ఐటికి తెలిసేలా రూ.600 కోట్లు అందించినట్టు తెలపడంతో నోటీసులు వచ్చాయి. జిహెచ్‌ఎంసి గతంలో కూడా సంజీవయ్య పార్కు వద్ద ఫ్లైఓవర్‌ను సంయుక్తంగా నిర్మించేందుకు సముఖత తెలిపి అనంతరం విముఖత వ్యక్తం చేసిన జిహెచ్‌ఎంసి ఈ మారు కూడా బాలానగర్ ఫ్లైఓవర్‌ను హెచ్‌ఎండిఎకు కేటాయించడంపై అథారిటీ వర్గాలు పెదవి విరుస్తున్నాయి.