Home ఎడిటోరియల్ హోం గార్డుల చట్టం తేవాలి

హోం గార్డుల చట్టం తేవాలి

HOMEGUARDS

54 సం॥రాల మానసిక వత్తిడి ప్రవాహం అయింది. 1962 డిసెంబర్ 6న హోం గార్డుల వ్యవస్థ పునర్ వ్యవస్థీకరణ జరిగింది. మొదట్లో స్వచ్ఛంద సంస్థగా “నిష్కామ సేవ”గా పోలీస్ శాఖకు అనుబంధంగా సహాయకారిగా అత్యవసర పరిస్థితులలో, విపత్తులు జరిగినప్పుడు హోంగార్డు సేవలు ఉపయోగించుకునే వారు. పరిమిత సమయంలో అంకిత భావంతో దేశభక్తి ప్రధానంగా భావించే యువత పాల్గొని స్వచ్ఛందంగా సేవ చేసేవారు.
కాని కాలక్రమేణ హోంగార్డు విభాగం “పోలీసు శాఖకు సోదర సంస్థగా, అనుబంధ సంస్థగా, పరస్పర సహకార మానసిక పుత్రికగా మారిపోయింది. పూర్తి స్థాయిలో పోలీసు శాఖలో భాగంగా డ్రస్‌పై మమకారంతో ఇష్టంగా వచ్చే వరకు కొందరు, ఆర్థిక పరిస్థితులు బాగోలేక సర్దుకుపోయి డ్యూటీ చేసేవారు కొందరు.
ఈ వ్యవస్థలో హోంగార్డులుగా దాదాపు 30 సం॥ లుగా చాలీచాలని జీతాలతో పని చేస్తున్నవారు ఉన్నారు. ఆనాడు వచ్చిన వారికి నేడు వచ్చిన వారికి ఇచ్చే జీతం, స్థితిగతులలో ఎలాంటి మార్పు లేదు. అదే రూ. 400 లు వర్తించుతాయి. డ్యూటీకి వస్తేనే రూ. 400/- లేకుంటే కట్ అవుతాయి. అంటే దినసరి కూలీ లెక్క మాదిరి, ఉద్యోగ భద్రత లేదు.
అసలు హోంగార్డులు ఏమి కోరుకుంటున్నారు?
1.కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే , “చట్టసభ”లలో ప్రవేశపెట్టి ఆమోదింపజేయగల ప్రక్రియ, “తెలంగాణ రాష్ట్ర హోం గార్డుల ప్రత్యేక చట్టం” ద్వారానే సాధ్యం.
2.దానికి ఒక కమిటీ వేసి డ్రాప్ట్ తయారీ విధానంలో సమయం పడుతుంది కాబట్టి, అంతవరకు హోం గార్డులకు భరోసా కల్పించే విధంగా ప్రస్తుత సమాజ పరిస్థితులు ఎదుర్కొనే విధంగా వారికి…
3. రోజుకు రూ. 800/- లు, ఆరోగ్య భద్రత, బస్‌పాస్, వైట్ రేషన్ కార్డు, టిఎ, డిఎ ట్రాన్స్‌ఫర్‌లు అయిన వారికి, ఆక్సిడెంట్, డెత్ ఇన్సూరెన్స్ కవరేజీ, డ్యూటీలో చనిపోయిన కుటుంబానికి ఆర్థిక ప్యాకేజీ, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇపిఎఫ్, ఇఎస్‌ఐ వర్తింపు, 44 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలి.
4. డబుల్ బెడ్‌రూం స్కీమ్‌తో బాటు కెజి టు పిజి వరకు వారి పిల్లలకు వర్తింపు, 25 శాతం విద్యా చట్టం వెసులుబాటు (కార్పొరేట్ స్కూల్స్), తెల్లరేషన్ కార్డు ద్వారా మెడికల్ బెనిఫిట్స్ పూర్తి ఫ్రీ గా ఇవ్వాలి.
5. మహిళా హోంగార్డులకు ఇతర డిపార్ట్‌మెంట్ మహిళలకు ఇచ్చే విధానంలో మెటర్నటీ లీవ్‌లు, మెడికల్ లీవ్‌లు, జీతంతో కూడిన సౌకర్యం కల్పించి వారి ఆత్మ గౌరవాన్ని కాపాడాలి.
6. ఒడి (ఇతర డిపార్ట్‌మెంట్స్)లో పనిచేసే వారికి 1 సం॥ ల తర్వాత మామూలు పోలీసు స్టేషన్లకు తిరిగి పిల్చుకోవాలి. కొత్తవారిని ఒడి లకు వేసే శిక్షణ పొందుతారు. ఒడి వారికి 3 నుండి 4 నెలల వరకు జీతాలు రాక కుటుంబాలు విచ్ఛిన్నమై ఆత్మహత్యలకు ఎక్కువగా జిల్లాలలో పనిచేసే వారు పాల్పడుతున్నారు. ఒడి హోంగార్డుకు ఉద్యోగ భద్రత భరోసా ఇవ్వాలి.
7. కానిస్టేబుల్ నియామకాలలో అర్హులైన హోం గార్డులకు వెయిట్‌జీ 50 శాతం, రిజర్వేషన్లు ఇవ్వాలి.
8. యూనిఫాం, షూస్, పారేడ్ అలవెన్స్ రూ. 3000 ఇస్తే మన్నికైనవి వారు కొనుకుంటారు.
9. “రెగ్యులరైజ్‌” చేసే వరకు వారాంతపు సెలవు లు, “టైం స్కేల్ ”ఇచ్చి ఇతర అలవెన్స్‌లు సమకూర్చాలి.
10. సమాన పనికి సమాన వేతనము ఇచ్చి జీవించే గౌరవంగా బతికే హక్కులు కల్పించాలి. మానవత్వంతో హ్యూమన్ రైట్స్‌ను కాపాడి హోంగార్డ్సు కూడా బంగారు తెలంగాణలో భాగమవ్వాలని కోరుకుంటున్నారు.
హోంగార్డుల బాధకు లెక్క ఉంది: ఆనాడు స్వచ్ఛంద సంస్థగా మొదలైన వ్యవస్థలో పరిమిత కాలం పని వేళలు ఉండేవి, పని కూడా కొంత మేరకు ఉండేది. కాని నేడు కానిస్టేబుల్ మాదిరిగా వీరు కూడా పని చేస్తున్నారు. వీరు పని చేసే డిపార్టుమెంట్స్ (ఒడి) “లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, సిఎటి, ఐడి, టాస్క్ ఫోర్స్, ఇంటెలిజెన్స్, అంతేకాకుండా మిగతా డిపార్టుమెంట్స్ బిఎస్‌ఎన్‌ఎల్, ప్రసార భారతి, ఎఫ్‌సిఐ, ట్రాన్స్‌కో, ఆర్‌టిసి, బాసర టెంపుల్, సింగరేణి, సిడబ్లుసి, రైల్వే, హెచ్‌ఎండిఎ లలో సంవత్సరాలుగా ఉద్యోగ భద్రత లేక బిక్కుబిక్కుమని క్షణం ఒక యుగంగా బతుకుతూ ఏమైపోతామోనని నిద్రలో కూడా ఉలిక్కిపడుతున్నారు.
వీరికి ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత, తెల్లరేషన్ కార్డు, ఆరోగ్య శ్రీ వర్తింపు, బస్‌పాస్, వారాంతపు సెలవులు, సిక్ లీవులు, పెయిడ్ లీవులు, మెడికల్ లీవులు, మెటర్నటీ లీవ్‌లు ఇవాలి. పుష్కరాలలో తదితర బందోబస్తు డబ్బులు ఇవ్వాలి. ట్రాన్స్‌ఫర్స్ 70 కి.మీ నుండి 100 కి.మీ. లోపల అయితే ఆ 400 /- లలో 200/- రూ. లు బస్ చార్జీలకు పోతున్నాయి. టిఎ, డిఎ వర్తింపు లేదు.

– గుండ్రాతి శారద గౌడ్, న్యాయవాది , హోంగార్డుల ప్రతినిధి
98488 12024