Home రాష్ట్ర వార్తలు హోంగార్డులకు తీపి

హోంగార్డులకు తీపి

kcr

జీతం రూ.20 వేలకు పెంపు 

కానిస్టేబుళ్లతో సమానంగా పలు సౌకర్యాలు
ఏడాదికి రూ.1000 ఇ్ంరక్రిమెంట్, అందరికీ డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు
6 నెలలు ప్రసూతి సెలవు, పురుషులకు పితృత్వ లీవ్
పోలీసు రిక్రూట్‌మెంట్‌లో కోటా : ప్రగతిభవన్ సమావేశంలో సిఎం ప్రకటన

హైదరాబాద్: హోంగార్డులపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వరాల జల్లు కురిపించారు. వారి వేతనాలను రూ.12 వేల నుండి రూ.20 వేలకు పెంచారు. పోలీ సు కానిస్టేబుళ్ళతో సమానంగా పలు సౌకర్యాలను కల్పించారు. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె. చేంద్రశేఖర్ రావు బుధవారం హోంగార్డులతో సమావేశమయ్యారు. సమావేశంలో హోంమం త్రి నాయిని నర్సింహారెడ్డి, డిజిపి ఎం.మహేందర్‌రెడ్డి, సలహాదారులు రాజీశ్ శర్మ, అనురాగ్ శర్మ, తెలంగాణ హోంగార్డుల సం ఘం గౌరవాధ్యక్షులు వి.శ్రీనివాస్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు. జనహితలో జరిగిన సమావేశానికి పెద్ద ఎత్తున హోంగార్డులు హాజరయ్యారు. వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో విడుదల చేసింది. హోంగార్డులను ఉద్దేశించి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రసంగిస్తూ రాష్ట్రంలో 18,491 మంది హోం గార్డులు ఉన్నారని, వారికి రెగ్యులర్ పోలీసులతో సమానంగా సౌకర్యాలు కల్పిస్తామని హామీనిచ్చారు. ప్రస్తుతం ఉన్న నెలవారీ జీతాన్ని రూ.12 వేల నుంచి రూ.20 వేలకు పెంచుతామన్నారు. ప్రతీ ఏడాది నెలకు రూ.వెయ్యి చొప్పున ఇంక్రిమెంటు ఇస్తామని, హోంగార్డులందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. ట్రాఫిక్‌లో పనిచేస్తున్న హోంగార్డులకు ఇత ర పోలీసుల మాదిరిగానే 30 శాతం అదనపు వేతనం, కానిస్టేబుళ్ల మాదిరిగా ప్రతీ ఏడాది నాలుగు యూనిఫామ్స్ ఇస్తామన్నా రు. మహిళ హోంగార్డులకు 6 నెలల ప్రసూతి సెలవులు, పురుషులకు 15 రోజుల పితృత్వ సెలవులను మంజూరు చేస్తామని చెప్పారు. బందోబస్తు డ్యూటీ చేసే హోంగార్డులకు కానిస్టేబుళ్లతో సమానంగా డైట్ చార్జీలు ఇస్తామని,అంత్యక్రియలకు ప్రస్తుతం ఇచ్చే రూ.5 వేలను రూ.10వేల కు పెంచుతున్నట్లు వెల్లడించారు.కానిస్టేబుళ్ల మాదిరిగానే పోలీస్ హాస్పిటల్స్ లో హోంగార్డులకు చికిత్సకు అవకాశం కల్పిస్తామని, కుటుంబ సభ్యులందరికీ వర్తించేలా ఆరోగ్య బీమా కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ లో రిజర్వేషన్ పెంపు: హోంగార్డులకు కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో కూడా రిజర్వేషన్‌ను పెంచుతామని సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీసు నియామకాల్లో హోం గార్డులకు కల్పిస్తున్న 10 శాతం రిజర్వేషన్‌ను 25 శాతానికి, ఎఆర్ కానిస్టేబుళ్ళలో 5 శాతాన్ని 15 శాతానికి, సివిల్‌లో 8 శాతాన్ని 15 శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే పోలీసు ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్‌లో డ్రైవర్‌లో హోంగార్డులకు ఉన్న 2 శాతం రిజర్వేషన్‌ను 20 శాతానికి, పిటిఒ మెకానిక్ ఉద్యోగాల్లో 2 శాతం నుండి 10 శాతానికి ఎస్‌పిఎఫ్‌లో 5 శాతంనుండి 10 శాతానికి పెంచనున్నట్లు వెల్లడించారు. అలాగే అగ్నిమాపక శాఖలో 10 నుండి 25 శాతానికి ఎస్‌ఎఆర్‌సిపిఎల్‌లో 5 నుండి 25 శాతానికి, పోలీసు కమ్యూనికేషన్స్‌లో 2 శాతం నుండి 10 శాతానికి హోంగార్డుల రిజర్వేషన్‌ను పెంచుతున్నట్లు వివరించారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణలో వెట్టి చాకిరి ఉండొద్దనే ఈ నిర్ణయాలు తీసుకున్నామని సిఎం కెసిఆర్ అన్నారు. ఒక్కో సమస్యను వరుసగా పరిష్కరించుకుంటూ వస్తున్నామని, చాలా విభాగాల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేలల్లో ఉన్నారని, అసలు సమస్య అర్థం కావాలనే అందరిని పిలిపించుకొని మాట్లాడుతున్నట్లు తెలిపారు.
డిజిపి కృతజ్ఞతలు: హోంగార్డుల జీతాలు పెంపడంతో పాటు, వారి సంక్షేమం కోసం అనేక నిర్ణయాలు ప్రకటించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు డిజిపి ఎం.మహేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు శాఖలో అతి తక్కువ జీతాల తో పనిచేస్తున్న హోంగార్డుల ఇబ్బందులను అత్యంత మానవత్వంతో అర్థం చేసుకుని ముఖ్యమంత్రి చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారని డిజిపి అన్నారు. పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, ఇదే క్రమంలో ఇప్పుడు హోంగార్డుల అపరిష్కృత సమస్యలెన్నో పరిష్కరించారన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో హోంగార్డులలో ఆత్మవిశ్వాసం పెరిగిందని, ద్విగుణీకృత ఉత్సాహంతో విధులు నిర్వర్తిస్తారని మహేందర్ రెడ్డి అన్నారు.
హోంమంత్రికి అభినందనలు : హోంగార్డుల జీతం రూ.1200 నుంచి రూ.20,000కు పెంచు తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించడం పట్ల రాష్ట్రం లో పనిచేస్తున్న హోంగార్డులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేర కు హోంగార్డుల సంఘం నేతలు, టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ బుధవారం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడంలో నాయిని కృషి ఉందని హోంగార్డు నేతలు పేర్కొన్నారు.