Home ఎడిటోరియల్ కుత్తుకలపై ‘పరువు’ కత్తులు

కుత్తుకలపై ‘పరువు’ కత్తులు

Honour Killing: Death penalty for family members

కులాల మధ్య అడ్డుగోడలను కూల్చడానికి ఎన్నో ఏళ్లుగా సంఘ సంస్కర్తలు ఉద్యమాలు సాగించారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించారు. ప్రభుత్వం ఈ మేరకు చట్టాలను రూపొందించేలా నిర్విరామ కృషి చేశారు. అయినా కులాల జాఢ్యం జడలు విప్పుకుని బీభత్సం సృష్టించే దారుణాలు ఇంకా జరుగుతుండడం శోచనీయం. కులాంతర వివాహాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వపరంగా ఆర్థిక ప్రోత్సాహాలు లభిస్తున్నాయి. ఎవరైనా వీటిని అడ్డుకుంటే శిక్షించడానికి తగిన చట్టాలున్నాయి. అయినా కులాల ద్వేషం పడగ విప్పి కాటు వేస్తూనే ఉంది. కుల విద్వేషాల మూలాలను సమూలంగా పెకలించడానికి మళ్లీ గ్రామగ్రామాన ఉద్యమాలు హోరెత్తాల్సిందే.

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రం ఎస్‌సి కాలనీకి చెందిన సురేష్, విజయలక్ష్మి ప్రేమ పెళ్లి చేసుకుని నాలుగేళ్లు గడిచినా కులాంతర కక్ష వారిని వెంటాడి చివరకు విజయలక్ష్మి కన్న తండ్రే గొంతు కోసి ఆమెను హతమార్చడం ఘోరాతిఘోరం. తమ పరువు కన్నా కన్న కూతురు ప్రాణం గొప్పది కాదన్న అమానుషం వారిలో హత్యకు పురిగొల్పింది. ఇటువంటి దుర్ఘటనే ఏడాది క్రితం యాదగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో జరిగింది. ప్రేమికులు మనసులు పంచుకుని ఏకమై మనుగడ సాగించాలన్న ముచ్చట మున్నాళ్ల ముచ్చటగా చేయించింది అమ్మాయి కన్నవారి ద్వేషం. తాళి కట్టిన పాపానికి యువ ప్రేమికుడిని రప్పించి తమ గ్రామంలోనే ప్రాణాలు తీశారు. కన్న కూతురిని కూడా హతమార్చారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఈ నేరాలను నియంత్రించగల సరైన వ్యవస్థ లేదు. జాతీయ నేరాల బ్యూరో రికార్డులోనూ ఇవి నమోదు కావడం లేదు. మూడేళ్ల క్రితం యువ దళిత ఇంజినీరింగ్ విద్యార్థి శంకర్ తమిళనాడు తిరువూరు జిల్లా ఉడుమావ్ వేట వద్ద అతి దారుణంగా అందరూ చూస్తుండగా హత్యకు గురికావడం సంచలనం కలిగించింది. అత్యంత బాధాకరమే అయినా ఇది కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సాగిన పోరాటంగా చెప్పక తప్పదు. దళిత యువతీ యువకుల సంఖ్య అధికం. వీరు సమాజంలో అగ్ర వర్ణాలుగా ముద్ర పడిన వారికి చెందిన యువతులను లేదా యువకులను భాగస్వాములుగా చేసుకున్నప్పుడు ఇటువంటి హింసాత్మక సంఘటనలే ఎదురవుతున్నాయి.

శంకర్ తన ప్రాణానికి ప్రాణమైన ప్రేమికురాలైన భార్య కౌసల్య కూడా హత్యకు గురైంది. వీరు చేసిన నేరం కులమతాలను ఎదిరించి ధైర్యంగా ప్రేమించుకోవడమే. ఇటువంటి సంఘటనల నేపథ్యంలో గతంలో కులాంతర వివాహాలపై చర్చ సందర్భంగా అంబేద్కర్ “ప్రభుత్వాన్ని ఎదిరించే రాజకీయ ధిక్కారం కన్నా సంఘాన్ని సమాజాన్ని ఎదిరించే సంఘ సంస్కర్త చాలా ధైర్యవంతుడని” ప్రస్తావించారు. శంకర్‌కు సంఘ సంస్కరణపై అవగాహన ఉండకపోవచ్చు, కానీ శంకర్ లాంటి వారెందరో సామాజిక హింసను సాహసంగా ఎదుర్కొంటున్నారు.

జీవితాలను కోల్పోతున్నారు. కులం, వర్గం, స్త్రీ పై ఆధిపత్యం అనే మూడు అంశాలపై సాగుతున్న ‘పరువు’ నేరాలను సుప్రీంకోర్టు అనాగరికం, అమానుషం, ఫ్యూడల్ భావాల వ్యక్తుల దురభిమానంగా పేర్కొంది. వాజ్‌పేయి ప్రభుత్వ కాలంలో ఈ చర్చ తెర మీదకు వచ్చినా ఏదీ తేలలేదు. ఇలాంటి నేరాలు పాకిస్థాన్ తదితర ఇస్లాం దేశాల్లో జరిగాయే తప్ప భారత దేశంలో కాదని సమర్థించడమైంది. స్త్రీలపై జరుగుతున్న హింసపై ప్రత్యేక నివేదికపై ఐక్యరాజ్య సమితి సామాజిక, మానవీయ, సాంస్కృతిక కమిటీ తరఫున భారత ప్రతినిధిగా ఆహ్లువాలియా ఆనాడు చర్చించారు. పరువు ప్రతిష్ఠలకై భారతదేశంలో హత్యలు జరుగుతున్నాయని ప్రస్తావించారు.

ఈ సంఘటనలపై మహిళా సంఘాలు తీవ్ర నిరసన ఉద్యమాలు సాగించినా సరయిన చట్టాలు రూపొందలేదు సరికదా నేరాల నివారణ చట్టాలకయినా సవరణలు జరగలేదు. పార్లమెంటులో ఈ చర్చ లేవనెత్తడానికి అయిదేళ్లపాటు పోరాటం చేయవలసి వచ్చింది. కుల గౌరవ మర్యాదలు, పరువు ప్రతిష్ఠల పేరుతో సాగే ఈ నేరాల పరంపరపై వామపక్షాలు 2009 జులైలో మొట్టమొదటి సారి చర్చకు తెర తీశారు. ప్రత్యేక చట్టం కోసం డిమాండ్ చేశారు. అయినా ఇవి చాలా స్వల్పమైన డిమాండుగా అప్పటి ప్రభుత్వం భావించింది. అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం వాదనలతోనే ఈ డిమాండ్‌ను సరిపెట్టారు. ప్రత్యేక చట్టం తెస్తామని చెప్పలేదు. అయితే ఎప్పటికైనా ఈ అంశాన్ని చర్చించి నిర్ణయం తీసుకుంటామని సమాధాన పర్చారు. ఈ విషయంలో వాజ్‌పేయి ప్రభుత్వం కన్నా యుపిఎ ప్రభుత్వం కార్యాచరణలో కొంత చొరవ చూపగలిగింది.

యుపిఎ ప్రభుత్వం దీన్ని చట్టపర పరిశీలనకు న్యాయ మంత్రిత్వ శాఖకు పంపింది. 2010లో కొన్ని సిఫారసులు వెలువడ్డాయి. ఇండియన్ పీనల్ కోడ్, మరికొన్ని చట్టాల సవరణలను 2010 బిల్లులో ప్రస్తావించారు. అయితే అప్పటి హోం మంత్రి చిదంబరం నుంచి గట్టి ప్రతిపాదన ఏదీ లేకపోవడం, సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల ఈ నేరాల అంశాన్ని న్యాయ మంత్రిత్వ శాఖ సరిగ్గా స్పృశించలేదు. నేరాల్లోని హత్యలను మాత్రమే స్పృశించింది తప్ప కులాంతర యువ జంట ఎదుర్కొంటున్న హింసలను పేర్కొన లేదు. అలాగే నమూనా బిల్లులో ఎన్నో ఇతర లోపాలున్నాయి. అనుకున్నట్లు గానే బిల్లు నమూనా లోని లోపాలు ఏవీ సమీక్షకు రాకుండానే మంత్రివర్గ బృందం పరిశీలన అన్న సాకుతో చర్చ నుంచి తప్పించుకోడానికి అవకాశం కల్పించారు. అది ఈ చర్చను వాయిదా వేయడానికి యుపిఎ ప్రభుత్వం వేసిన ఎత్తుగడగా భావించవలసి వచ్చింది.

సవరణలు ఏమాత్రం ప్రయోజనం లేనివిగా తేలాయి. ఆల్ ఇండియా డెమొక్రాటిక్ ఉమెన్స్ అసోసియేషన్ చర్చించి “ది ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్స్ ఇన్ ది నేమ్ ఆఫ్ ఆనర్ అండ్ ట్రెడిషన్ బిల్లు” పేరుతో ప్రతిపాదనల చిత్తు నమూనా ప్రభుత్వానికి అందించారు. యువ దంపతుల హక్కులను తొక్కివేస్తూ పరువు నేరాలు నిరాఘాటంగా సాగుతున్నాయని ఆ చిత్తు నమూనాలో వివరించారు. యువతరం తమ జీవితాలను తామే నియంత్రించుకునే హక్కు ఉందని, ఇది వ్యక్తి స్వేచ్ఛకు స్వాతంత్య్రానికి సంబంధించినదని ఇది సామాజిక హక్కులని పేర్కొన్నారు. ఏ వ్యక్తి అయినా తన వివాహానికి లేదా ఇతరత్రా తగిన భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కు ఉందని ఈ హక్కుల ప్రక్రియను నిరోధించడం చట్ట ప్రకారం నేరం అవుతుందని నమూనా బిల్లులో ప్రతిపాదించారు.

హత్యతో సహా అనేక నేరాల జాబితాను ఇందులో వివరించారు. అలాగే ఈ నేరాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను, వివిధ శిక్షలను సూచించారు. కులం పేరుతో ఖాద్ పంచాయితీలు వ్యవహరిస్తున్న విధానాలను పోలీసులు, పాలక వర్గాల జవాబుదారీ తనాన్ని వివరించారు. వాస్తవానికి ఈ సంఘటనలను పరిశీలిస్తున్న మహిళా సంస్థల అనుభవాల ఆధారంగా అన్ని అంశాలు బిల్లులో ప్రతిపాదించారు. జాతీయ మహిళా కమిషన్ ఈ బిల్లుకు మద్దతు పలికింది. ఇటువంటి నమూనా బిల్లునే జాతీయ మహిళా కమిషన్ అంతకు ముందు ప్రభుత్వానికి సమర్పించినప్పటికీ ఆనాడు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ బృందం కానీ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కానీ బిల్లును ముందుకు తీసుకెళ్లలేకపోయారు. రెండేళ్ల తరువాత 2012 ఆగస్టులో ప్రభుత్వ సిఫార్సులను లా కమిషన్ పరిశీలించి 242 పేజీల నివేదికలో తన అభిప్రాయం వెల్లడించింది. జాతీయ మహిళా కమిషన్ ప్రతిపాదనల నివేదికకు తమ డ్రాప్టు చాలా దగ్గరగా ఉందని లా కమిషన్ పేర్కొన్నప్పటికీ వాస్తవానికి ఇది సంకుచితం, సంప్రదాయ బద్ధంగా ఉందని వ్యాఖ్యానించింది. ప్రొహిబిషన్ ఆఫ్ అన్‌లా పుల్ అసెంబ్లీ బిల్లు 2011లో వివాహ సంబంధాలలో అనవసర జోక్యంగా వ్యాఖ్యానించారు.

– పి. వెంకటేశం