Tuesday, March 21, 2023

జిల్లాలో వేడెక్కిన రాజకీయాలు

- Advertisement -

party

*రానున్న ఎన్నికల్లో గెలుపుపై కన్నేసిన అన్నిపార్టీల అభ్యర్థులు
మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి : రానున్న 2019 ఎన్నికల్లో గెలుపే లక్షంగా అధికార పార్టీతో సహా కాంగ్రెస్, టిజెఎస్ పార్టీల నుండి అభ్యర్థులు పోటీ చేయడానికి కసరత్తులు మొదలుపెట్టారు. మెదక్ జిల్లాలో ప్రస్తుతం పూర్తి స్థాయిలో రెండు నియోజకవర్గాలు ఉన్నాయి. కేంద్రం నియోజకవర్గాలను పెంచుతుందనే ఆశాభావంతో అభ్యర్థులు ఉవ్విళ్ళూరుతున్నారు. ఇప్పటికే అన్ని పార్టీల నాయకులు నియోజకవర్గాలలో గల పలు మండలాలు, గ్రామాలను చుట్టుముట్టేస్తున్నారు. ముఖ్యంగా ముందు నుండి ఉన్న మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలలో మాత్రం రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయనే చెప్పుకోవాలి. మెదక్ నియోజకవర్గంలోని ప్రస్తుత శాసనసభ్యురాలు పద్మాదేవేందర్‌రెడ్డి ప్రతి రోజు నియోజకవర్గంలో సుడిగాలి పర్యాటనలు చేస్తు పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలతో పాటు ఇప్పటికే జరుగుతున్న పనుల యొక్క పురోగతిని సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులతో అభివృద్ధి పనులపై చర్చిస్తు నియోజకవర్గంలోని కొనసాగుతున్న పనులను వేగవంతం చేయాలని ఆదేశిస్తున్నారు. అంతేకాకుండా మునుపటి గ్రామస్థాయి కార్యకర్తలతో ఎప్పటికప్పుడు సమావేశాలను ఏర్పర్చుకొని ప్రతి రోజు వారితో పార్టీ క్యాడర్ బలోపేతానికై చర్చిస్తున్నారు. అధికార పార్టీలో రానున్న ఎన్నికల్లో మరో అభ్యర్థి నియోజకవర్గం నుండి పోటీలో లేకపోవడం ప్రస్తుత శాసనసభ్యురాలుకు కలిసివచ్చే అంశమని చెప్పుకోవచ్చు. ఇక నర్సాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు చిలుముల మదన్‌రెడ్డి కూడా సుడిగాలి పర్యటనలు చేస్తు పలు అభివృద్ధి పనుల్లో పాల్గొనడమే కాకుండా పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేసేందుకు ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నారు. కానీ నర్సాపూర్ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడు మురళీయాదవ్ కూడా రానున్న ఎన్నికల్లో టిఆర్‌ఎస్ టికెట్టు ఆశిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే మెదక్ నియోజకవర్గ బరిలో మాజీ శాసనసభ్యులు పట్లోళ్ళ శశిధర్‌రెడ్డితో పాటు కంఠంరెడ్డి తిరుపతిరెడ్డి, సుప్రభాతరావు, భట్టి జగపతితో పాటు తొడుపునూరి చంద్రపాల్‌లు ఉన్నట్లు తెలుస్తుంది. వీరిప్పటికే నియోజకవర్గంలో గల అన్ని మండలాల, గ్రామాల కార్యకర్తలతో సమావేశాలను ఏర్పర్చుకొని తమ క్యాడర్‌ను పెంచుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా మిగత వారందరు కూడా కలుపుగోలుగా పనిచేసి మెదక్ నియోజకవర్గంపై కాంగ్రెస్ పాగా వేయాలని పావులు కదుపుతున్నారు. ఇక నర్సాపూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ మంత్రి సునితాలకా్ష్మరెడ్డికి వ్యతిరేకంగా ఎవ్వరూ పోటీలో ఉండనందున రానున్న ఎన్నికల్లో మాజీ మంత్రి సునితాలకా్ష్మరెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లే. ఈ తరుణంలో జిల్లాలో ప్రొఫెసర్ కోదండరామ్ నూతనంగా ఏర్పాటు చేసిన టిజెఎస్ పార్టీ క్యాడర్ కూడా బలోపేతమవుతుంది. ఇప్పటికే మెదక్ నియోజకవర్గం నుండి ప్రముఖ న్యాయవాది కె. జనార్ధన్‌రెడ్డి టిజెఎస్ పార్టీ టికెట్టు ఆశిస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న పలువురు అసమ్మతి నేతలతో చర్చలు కొనసాగిస్తున్నారు. అసమ్మతితో ఉన్న ప్రతి ఒక్కరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేయడంలో తలమునకలయ్యారు. టిజెఎస్ పార్టీ క్యాడర్ బలోపేతమైతే ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా కొనసాగనుంది. ఈసారి ఎన్నికల్లో పార్టీ గుర్తుకంటే ప్రధానంగా అభ్యర్థి వ్యక్తిత్వాన్నే పరిగణలోకి తీసుకునే పరిస్థితి జిల్లాలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News