Home ఎడిటోరియల్ ఎంతకాలం, ఎంత దూరం!!

ఎంతకాలం, ఎంత దూరం!!

sampadakeyam

అవినీతి పరులు, నేరస్థులైన రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులుగా, పాలకులుగా పల్లకీలెక్కే నీతిబాహ్యత నిరవధికంగా కొనసాగవలసిందేనా? ప్రజాస్వామ్యయుత పరిపాలనకు మూలమైన రాజకీయ వ్యవస్థ నుంచి అవినీతిని, నేరప్రవృత్తిని రూపుమాపాలనే భావనతో ఏకీభవించని రాజకీయ పార్టీలేదు. కాని అందుకనుగుణంగా చట్టాలను కట్టుదిట్టం చేయటానికి సంకల్పం, చొరవ కనిపించదు. లా కమిషన్, ఎన్నికల కమిషన్ ఎన్ని సిఫారసులు చేసినా, సుప్రీంకోర్టు ఎన్ని ఆదేశాలు జారీచేసినా అవి అరణ్యరోదనగానే ఉంటున్నాయి. ప్రజాప్రతినిధులపై దాఖలైన కేసులు దశాబ్దాల తరబడి కోర్టు తీర్పుకు నోచుకోవు. కిందికోర్టు శిక్ష విధిస్తూ ఎంత ఆలస్యంగా తీర్పుచెప్పినా, హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా అప్పీలు వెళుతూ, మళ్లీమళ్లీ ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ప్రజలపై సవారీ చేయటం దీర్ఘకాలం జరిగిపోయింది. రెండేళ్లకుమించి శిక్షపడిన ప్రజా ప్రతినిధి 90 రోజుల్లో అప్పీలు చేసుకుంటే, అది పరిష్కారమయ్యే వరకు అనర్హతకు గురికాని చట్టబద్ధ ఏర్పాటును సుప్రీంకోర్టు 2013లో కొట్టివేసింది. శిక్షాకాలం, ఆ పైన ఆరేళ్లు ఎన్నికల్లో పోటీచేయటానికి వీల్లేని నియమం ఇప్పుడు అమలులో ఉంది. దీనికింద అనర్హతకు గురైన వారిలో లాలుప్రసాద్, ఓం ప్రకాశ్ చౌతాలా, సుఖ్‌రాం, జయలలిత వగైరాలున్నారు.
క్రిమినల్ నేరాల్లో శిక్ష విధింపబడిన వ్యక్తులు ఎన్నికల్లో పోటీచేయకుండా జీవితకాలం నిషేధం విధించటాన్ని ఎన్నికల కమిషన్ సమర్థించింది. శిక్షకు గురైన లెజిస్లేటర్లు ఎన్నికల్లో పోటీచేయకుండా జీవితకాల నిషేధం విధించాలన్న ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా ఇసి ఈ వాదన వినిపించింది. రాజకీయాలను నేరరహితం చేయటంలో ఇది తొలిచర్య అవుతుందని పేర్కొన్నది. అయితే ప్రభుత్వం సానుకూల సమాధానమివ్వకుండా లా కమిషన్, ఎన్నికల కమిషన్ సిఫారసులు క్రియాశీల పరిశీలనలో ఉన్నట్లు తెలిపింది.
అయితే కేసుల విచారణను వేగవంతం చేయాలన్న తమ ఆదేశాలపై చర్యలు తీసుకోకపోవటంపట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయాలు నేరస్థుల మయం కాకుండా నిరోధించటంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవటం ఇది మూడవసారి. విధించబడిన శిక్షపై 90రోజుల్లో అప్పీలు చేసుకుంటే లెజిస్లేటర్లు తమ పదవుల్లో కొనసాగే నిబంధనను 2013జులైలో లిలీథామస్ కేసులో కొట్టివేసిన సుప్రీంకోర్టు, శిక్ష విధించబడిన వెంటనే అనర్హతను విధించింది. అవినీతి, నీచమైన నేరాలతో ప్రజాప్రతినిధులు నిందితులుగా ఉన్న కేసుల విచారణను సంవత్సరంలోపు పూర్తిచేయాలని, 2014మార్చిలో పబ్లిక్ ఇండియా ఫౌండేషన్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశించింది. జాప్యం జరిగే పక్షంలో తమనుంచి ముందుగా అనుమతి కోరాలని స్పష్టం చేసింది. అయితే అది ఆచరణలో అమలు జరగనందున ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసే పథకాన్ని రూపొందించాలని 2017 నవంబర్ 2న కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది.
ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయటమన్నది రాష్ట్రాల వద్ద నిధులను బట్టి ఉంటుందంటూ కేంద్రప్రభుత్వ అడ్వొకేట్ దాటవేత వైఖరి తీసుకోగా, ముఖ్యంగా రాజకీయనాయకులపై క్రిమినల్ కేసుల విచారణకు కేంద్రం ఒక పథకాన్ని తయారు చేస్తే సమస్య పరిష్కారమవుతుందని జస్టిస్‌లు రంజన్ గొగోయ్, నవీన్ సిన్హాలతో కూడిన ధర్మాసనం సూచించింది. డిసెంబర్ 13న తదుపరి విచారణ సమయానికి ఆ పథకాన్ని తమ ముందుంచాలని, అలాగే 2014 ఎన్నికల నాటికి పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులుపై పెండింగ్‌లో ఉన్న 1581 క్రిమినల్ కేసుల పరిస్థితిపై కేసువారీ రిపోర్టు కార్డును కూడా అదే రోజు సమర్పించాలని ఆదేశించింది.
గత 25-30ఏళ్లలో జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడైనా ముందడుగు వేయలేమా అన్నది సుప్రీంకోర్టు ప్రశ్న. డిసెంబర్ 13న కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఏమి చెబుతుందో చూదాం! ఇది జటిలమైన సమస్య. స్వార్థ ప్రయోజనంతో జరిగే నేరాలను, ప్రజల సమస్యలపై ఉద్యమాల సందర్భంగా బనాయించే కేసులను ఒకే గాటకట్టటం సమంజసం కాదు. అందువల్ల కోర్టు ఆదేశాలపై కాకుండా రాజకీయ ఏకాభిప్రాయం ద్వారా చట్టాల సవరణ ఉత్తమం.