Home ఆఫ్ బీట్ హోలీ రంగుల రంగేళి

హోలీ రంగుల రంగేళి

holi

సహజ రంగులతో ఆరోగ్యానికి రక్ష రసాయనిక పొడులతో జాగ్రత్త కళ్లకు హాని కలిగించే చర్యలు వద్దు

మన తెలంగాణ/సిటీబ్యూరో : హోలీ అనగానే మనకు గుర్తొచ్చేది రంగులు చల్లుకోవడం. బృందావనంలో శ్రీ కృష్ణుడు కూడా గోపికలతో హోలీ ఆడినట్లు పురాణ కథనాలు ఉన్నాయి. చారిత్రక ప్రాధాన్యమున్న ఈ హోలీ వేడుకలతో హృదయం నిండా ఆనందం నింపుకొనేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్చి ఒకటిన జరిగే హోలీ పండుగను పురస్కరించుకుని నగరంలోని వివిధ ప్రాంతాలలో హోలీ సామాగ్రి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రధానంగా మార్కెట్‌లో రసాయన రంగులు విరివిగా లభిస్తున్నాయి. వీటిలో లెడ్ ఆక్సైడ్, అల్యూమినియం, బ్రొమెడ్, మెర్యూరీ సల్ఫైడ్, కాపర్ సల్ఫైడ్ వంటి రసాయనా లు ఉంటాయి. వాటి గాఢతను బట్టి అవి కళ్లలో పడితే చూపు పోయే ప్రమాదం ఉంది. గులాల్ వంటి రంగులు, పొడులతో ఆస్తమా, చర్మ సంబంధిత వ్యాధులు సంభవిస్తాయి. రసాయనాలతో తయారు చేసిన రంగులు కాకుండా ప్రకృతి నుంచి సహజ సిద్ధంగా లభించే పువ్వులు, ఆకులు, ఇతరత్రా వాటితో తయారయ్యే రంగులను హోలీ రోజున వినియోగించాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. వినాయకచవితి రోజు వినియోగించే గోగి పువ్వులను నీటిలో మరిగిస్తే కాషాయం రంగు వస్తుంది. అదే విధంగా పలు రకాల పూలు, ఆకులతో రంగు ల్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చని వారు సూచిస్తున్నారు.

రంగులతో జర జాగ్రత్త
* -హానికరమైన రసాయనిక రంగుల వల్ల కళ్లకు హాని కలగకుండా సన్ గ్లాసెస్ ధరించాలి. దంతాలపై రంగులు పడకుండా పళ్లకు డెంటల్ కాప్స్ వేసుకోవాలి.
* -పాత మందపాటి దుస్తులు ధరించాలి. ఇలాంటి వాటి నుంచి చర్మానికి కొంత రక్షణ లభిస్తుంది. రంగులు పడిన దుస్తులను మళ్లీ ఉపయోగించరాదు.
* -బ్రైట్ కలర్ లేదా నలుపు రంగు దుస్తులు హోలీ రోజు ధరించాలి. ఫుల్‌హ్యాండ్స్, షర్ట్‌ని వేసుకోవాలి. చేతులకు గ్లౌసు లు, కాళ్లకు సాక్స్‌లు వేసుకోని రంగులు చల్లుకోవాలి.
* -తలకు శరీరానికి ముందుగానే ఆయిల్ రాసుకుంటే మంచింది. దీనివల్ల హానికరమైన రసాయన రంగుల నుంచి శరీరాన్ని రక్షించుకోవచ్చు.
* -రంగులు పూసుకునేటప్పుడు కళ్లు, పెదాలు తప్పనిసరిగా మూసుకోవాలి. లేకుంటే రంగులు శరీరం లోకి వెళ్లి హాని జరిగే ప్రమాదం ఉంది.
* -జుట్టుపై రంగులు పడకుండా క్యాప్ పెట్టుకోవాలి. దీనివలన రంగుల నుంచి వెంట్రుకలను రక్షించుకోవచ్చు.
* -రోడ్డుపై కారులో వెళ్లుతున్నారా? అకస్మాత్తుగా ఎవరైనా రంగులు చల్లొచ్చు. దీనివలన మీకు అసౌకర్యంతో పాటు కారు సీట్లు పాడవుతాయి. అందువల్ల కారు అద్దాలను పూర్తిగా క్లోజ్ చేసుకుని వెళితే మరీ మంచింది.
* -హోలీ తరువాత గోరు వెచ్చని నీటితో రంగులు శుభ్రం చేసుకోవాలి. ఈ సమయంలో కూడా రంగు నీళ్లు కళ్లు, నోట్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

జాగ్రత్తలు పాటించండి
* -హోలీ రోజున రంగుల వల్ల అనుకోని ప్రమాదాలు తలెత్తితే సొంత వైద్యం వద్దు. వెంటనే అందులోబాటులో ఉన్న వైద్యులను సంప్రదించాలి.
* -రంగులు, పొడులు కళ్లలో పడితే నిర్లక్షం చేయవద్దు. వెంటనే చల్లటి నీటితో శుభ్రంగా కడుకోవాలి.
-కళ్ల నుంచి నీరు రావడం, ఎరుపెక్కడం జరిగితే వీలైనంతా త్వరగా కంటి వైద్యుడిని సంప్రదించాలి.
* -రంగులతో మంట, దద్దులు లాంటివి వస్తే వెంటనే శరీరాన్ని శుభ్రంగా కడిగి కొబ్బరి నూనెను రాసి చర్మ వైద్య నిపుణులను సంప్రదించాలి.

ఇవి చేయకండి
-* హోలీ సందర్భంగా పిల్లలు కోడి గుడ్లు, బురద మురికి నీరు ఇతరుల మీద చల్లకుండా నివారించాలి.
* -మీకు హోలీ జరుపుకోవడం ఇష్టం లేకపోతే హాయిగా ఇంట్లో గడిపేయండి. ఒక వేళ పిల్లలకు ఇష్టంగా ఉంటే వారిని పోత్సహించి తగు జాగ్రత్తలు చెప్పండి. సహజ సిద్ధమైన రంగులు అందుబాటులో ఉంచండి.
* -హోలీ సందర్భంగా మత్తు పదార్థాల జోలికి పోవద్దు. అల్లరి, చిల్లరతో కూడిన పార్టీలకు దూరంగా ఉండండి. ఇవి ప్రశాంతంగా ఉండే కుటుంబ వాతావరణాన్ని గందరగోళం చేస్తాయి.
* -మీరు చల్లుకునేవి రంగు పౌడర్ కలిపిన నీరు మాత్రమే అయి ఉండాలి.
* -కొందరు యువకులు హోలీ వేడుకల పేరుతో దారిన వెళ్లే మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. ఇది సభ్యత, సంస్కారం అనిపించుకోదు.