Home దునియా దుమ్ము దులిపేద్దాం!

దుమ్ము దులిపేద్దాం!

dust

ఇల్లే స్వర్గం… ఇది ముమ్మాటికీ నిజం. అది చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి..మనది కాబట్టి ఆ ఆనందమే వేరు. ఇంటిని ఆహ్లాదకరంగా ఉంచుకుంటేనే ఆరోగ్యం బాగుంటుంది. మన ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే గబగబా ఇంటిని సర్దేస్తాం. అలాకాకుండా మన కోసం కూడా చక్కగా దుమ్మూ ధూళి లేకుండా సర్దుకోవడం చాలా అవసరం. పండుగలు పబ్బాలప్పుడు మాత్రమే కాకుండా వారానికోసారి ఇంటి దుమ్ము దులిపేస్తే మంచిదంటున్నారు నిపుణులు. మనకు తెలియకుండా చాలా దుమ్ము కణాలు ఇంట్లో తిష్టవేస్తాయి. పైపైన సర్దితే అస్సలు సరిపోదు. దుమ్ము కణాలు దాక్కొని ఉంటాయి. ప్రతిరోజూ వాటి పని పట్టాల్సిందే. ఇప్పుడు మార్కెట్‌లో దుమ్మును వదలగొట్టడానికి బోలెడన్ని గ్యాడ్జెట్లు కూడా దొరుకుతున్నాయి. వాటితోపాటు కొన్ని మొక్కలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల కూడా దుమ్మును వదిలించుకోవచ్చు. ఇల్లంటే, మన వ్యక్తిగత సౌకర్యం కాబట్టి దానిని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. ఆఫీస్ పని ఒత్తిళ్లలోంచి ఇంటికి వచ్చి సేద దీరడానికి అనువైన ప్రదేశం మన ఇల్లే. మనకు మనం సురక్షితంగా, సంతోషంగా భావించే స్థలం మన ఇల్లు.

ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం అనేది నిజంగా ఓ కళే. ఎంత కష్టపడి ఇంటిని శుభ్రపరచుకున్నా ఒక విషయంలో మాత్రం విఫలం అవుతున్నాం. టేబుల్ పై ఉన్న దుమ్మును శుభ్రం చేసిన మరునాడే ఏదో మేజిక్‌లా మళ్ళీ తనదైన శైలిలో ప్రత్యక్షమై చిరాకు పుట్టిస్తుంది ఈ దుమ్ము. దుమ్ము అనేది పోలెన్, డర్ట్, హ్యూమన్ హెయిర్, ఫాబ్రిక్స్‌కి చెందిన ఫైబర్, ఉడ్ యాష్, రసాయనాలు, మనిషి శరీరంలోని మృతకణాలతో తయారవుతుంది. ఇలాంటివన్నీ ఎక్కువగా పేరుకుపోయి ఎక్కడ పడితే అక్కడ మనకు దర్శనమిస్తాయి. వీటిని సరైన సమయంలో శుభ్రం చేయకపోతే దుమ్ము బాగా పేరుకుపోయి పరిసరాలు అశుభ్రంగా మారతాయి. దుమ్ము వల్ల అప్పటికప్పుడు తీవ్రమైన హాని కలగకపోయినా ఇంట్లో నివసించే సభ్యులకు చిన్నపాటి నుంచి తీవ్రమైన ఆరోగ్యసమస్యలు క్రమంగా తలెత్తవచ్చు. ఇంటిని ఎక్కువకాలం డస్ట్ ఫ్రీగా ఉంచుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటే మంచిది.

దుమ్ము ధూళిని వదిలించుకోవాలంటే….

సాధారణంగా ప్రతి ఇంట్లోనూ దుమ్ము ధూళి జమ అవుతూనే ఉంటుంది. అవన్నీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. తుమ్ములు, దగ్గులు, కళ్లల్లో నీళ్లు కారడం, ముక్కు కారడం, ఆస్తమా…లాంటి సమస్యలకు కారణమవుతుంది దుమ్ము.
మన ఇంట్లో దుమ్మే పెద్ద శత్రువు. దుమ్ము కణాలన్నీ మైక్రోస్కోప్‌లో కనిపిస్తాయి. మన శరీరంపై బోలెడన్ని దుమ్ము కణాలు నివాసముంటాయి. ఇవేమీ మనల్ని కరవవు. కానీ ప్రమాదకారకాలు. మనం వీటిని మామూలుగా చూడలేం. ఉన్నట్లు కూడా గమనించలేం. దుమ్ము కణాలు ఎక్కువగా చీకటిగా ఉన్న ప్రాంతాల్లో, తడిగా ఉన్న ప్రదేశాల్లో ఉంటాయి. పడక గదిలో వీటి నివాసం అధికం. పరుపు, దిండ్లు, దుప్పట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి లేకుంటే అంతేసంగతులు. కొన్ని పద్ధతులు పాటిస్తే దుమ్ము కణాలను అడ్డుకోవడం అసాధ్యం కాదు.

How to Get Rid of Dust