Friday, April 19, 2024

మహోగ్ర గోదావరి

- Advertisement -
- Advertisement -

భద్రాద్రిని చుట్టుముట్టిన వరద
20లక్షల క్యూసెక్కులకు చేరుకున్న ప్రవాహం

నేడు 70 అడుగులకు చేరుకోనున్న నీటిమట్టం

ఏడు మండలాల్లోని 59 గ్రామాలు జల దిగ్బంధం
సురక్షిత ప్రాంతాలకు 8984 మంది అప్రమత్తంగా ఉండాలని
సిడబ్లూసి హెచ్చరిక భద్రాచలం వంతెన మూసివేత మూడు
రాష్ట్రాలకు రాకపోకలు బంద్ 48గంటలు కొనసాగనున్న ఆంక్షలు
1986 తర్వాత ఇదే తొలిసారి రాములోరి దర్శనానికి రావొద్దని
కలెక్టర్ సూచన ముమ్మరంగా సాగుతున్న సహాయక చర్యలు

మన తెలంగాణ/న్యూస్ నెట్‌వర్క్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో ఉత్తర తెలంగాణవ్యాప్తంగా జనజీవనం అస్థవ్యస్తంగా తయారైంది. ఏ పక్కన ఏ చెరువు తెగుతుందో.. ఏ వాగు విరుచుకుపడుతుందోనన్న ఆందోళనలో భయం గుప్పిట్లో గోదావరి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వారం రోజులుగా ఆకాశం చిల్లు పడినట్టుగా కురుస్తున్న వర్షాలకు జనం నీటిలో నానుతున్నారు. మహారాష్ట్రతోపాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఓ వైపున గోదావరి నదిలో నీరు పరవళ్లు తొక్కుతుంటే మరోవైపున వాగులు, వంకలు, చెరువులు గ్రామాలను నీట ముంచేస్తున్నాయి. దీంతో సామాన్యుల జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఇదిలా ఉండగా.. ఏకధాటిగా కురిసిన వర్షాలకు వందలాది ఇళ్లు నేలమట్టం కాగా, వరద తాకిడితో లక్షలాది మంది జనం నిరాశ్రయులుగా మారి ఎవరికివారుగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, మంచిర్యాల రహదారిలోని వంతెనల మీదుగా గోదావరి నీరు ప్రవహిస్తోంది. బ్రిడ్జిపై భారీగా నీరు వచ్చి చేరడంతో నాగ్‌పూర్, మంచిర్యాల ప్రాంతాలకు కరీంనగర్ జిల్లా మీదుగా వెళ్లే పరిస్థితి లేకుండాపోయింది. 1995లో వచ్చిన వరదల సమయంలో గోదావరిఖని వంతెన మీదుగా వరద నీరు ప్రవహించిందని.. ఆ తరువాత ఇప్పుడే ఆ స్థాయిలో వరదలు వచ్చాయని స్థానికులు చెప్తున్నారు. కరీంనగర్ సమీపంలోని దుబ్బపల్లి వద్ద కూడా భారీగా వరద నీరు రాజీవ్ రహదారి మీదుగా ప్రవహిస్తుండడంతో బుధవారం రాత్రి నుండే కరీంనగర్ నుండి వాహనాల రాకపోకలను నిలువరిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రంగంపల్లి వద్ద కూడా వరద ఉధృతి యథావిధిగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. చుట్టు పక్కల నివాసలు కూడా జలదిగ్భంధనంలో చిక్కుకున్నాయి.
డేంజర్ జోన్‌లో మంథని..
పెద్దపల్లి జిల్లా మంథని డేంజర్ జోన్‌లో చిక్కుంది. ఓ వైపున గోదావరి, మరోవైపున బొక్కలవాగు పొంగిపొర్లుతుండడంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. మంథనికి దిగువన బొక్క ల వాగు నీరు గోదావరి నదిలో కలవాల్సి ఉన్నప్పటికీ గోదావ రి ప్రవహం తీవ్రంగా ఉండడంతో బొక్కలవాగు నుంచి నీరు వెనక్కి వచ్చి వంతెన మీదుగా ప్రవహిస్తోంది.
మంథని సమీపంలోని గాడుదల గండి వద్దకు కూడా వరద నీరు వచ్చి చేరిం ది. మంథని, కాటారం రహదారిలోనూ రాకపోకలు నిలిచిపోయాయి. రెండు రోజులుగా మంథని పట్టణానికి ఇతర గ్రామాలకు సంబంధాలు లేకుండాపోయాయి. మరో రెండు రోజులపాటు వరద ఉధృతి సద్దు మణిగేలా కనిపించడం లేదు.
ఇంటెక్ వెల్ చిక్కుకున్న కార్మికులు
గోదావరిఖని ఇంటెక్ వెల్‌లో ఆరుగురు కార్మికులు చిక్కుకున్నారు. గోదావరినదిలో వరద ఉధృతి తీవ్రంగా ఉండడంతో వారు అక్కడే ఉండిపోయారు. వారిని రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలతోపాటు గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు. బుధవారం రాత్రి కొమురం భీం జల్లాలో వరద ఉధృతిలో ఇద్దరు రెస్క్యూ టీం సభ్యులు కొట్టుకపోయి మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్ చేసేప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వరద నీటిలో కన్నెపల్లి పంప్ హౌస్
భారీ వర్షాలకు వరద నీరు ఎక్కువ చేరి వరంగల్ జిల్లా కన్నెపల్లి పంప్‌హౌస్‌లోని ఫోర్త్ బేయర్ కూలి కన్నెపల్లి పంప్‌హౌస్‌లోకి నీరు చేరాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోను ప్రధాన పంప్‌హౌజ్‌లో పూర్తిగా నీరు చేరడంతో బాహుబలి మోటార్లు పూర్తిగా పాడైనట్లు తెలుస్తోంది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 36 గేట్ల ఎత్తివేత
శ్రీరాంసాగర్ జలాశయానికి ఎగువనుంచి భారీగా వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో 2,50,200 లక్షల క్యూసెక్కు ల వరద వస్తుండగా,36 గేట్లద్వారా గోదావరిలోకి 249850 లక్షల క్యూసెక్కులు, 3000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలివేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు 90టిఎంసీలు కాగా ప్రస్తుతం 1087.03 అడుగులు 74.186టిఎంసీల నీరు నిలువ ఉందని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు.
కాలువలో పడి వివాహిత గల్లంతు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మండలంలోని వడ్యాల్ గ్రామానికి చెందిన గుంట్ల శోభారాణి(27)అనే వివాహిత బుధవారం రాత్రి వడ్యాల్‌లోని వాగువైపు కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లీ అదుపు తప్పి ఆ కాలువలో పడి కొట్టుకుపోయింది.
లోతట్టు ప్రాంతాలు, పునరావాస కేంద్రాలను పరిశీలించిన మంత్రి వేముల
నిజామాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలు, పునరావాస కేంద్రాలను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సందర్శించారు. జిల్లా పరిషత్‌ఛైర్మన్ దాదన్నగారి విఠల్వ్రు, నగర మేయర్ నీతూ కిరణ్, నుడా ఛైర్మన్ ప్రభాకర్‌రెడ్డిలతో కలిసి బాబన్‌సాబ్ పహాడ్, బోధన్ రోడ్డులోగల ఫ్రూట్ మార్కెట్, బైపాస్ రోడ్డు, గంగాస్థాన్ తదితర ప్రాంతాల్లోక్షేత్ర స్థాయిల నెలకొని ఉన్న పరిస్థితులను పరిశీలించారు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాటుచేసిన వైద్య శిబిరాలను మరికొన్ని రోజులపాటు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. గంగాస్తాన్ వద్ద పులాంగ్‌వాగు, బాబన్‌సాబ్ పహాడ్ వద్ద గల కాలువలో నీటి ప్రవాహాన్ని పరిశీలించిన మంత్రి కెనాల్‌లకు ఆనుకుని నివాసముంటున్న సుమారు 100 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.

Huge flood inflow into Godavari at Bhadrachalam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News