Thursday, April 25, 2024

ఈసారైనా పట్టణం కట్టండి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలోని పట్టణాల అభివృద్ధి కోసం రానున్న బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని ఇతర పట్టణాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇదే అంశంపై అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. కానీ ప్రతిపాదనలు పంపిన ప్రతిసారి తమకు నిరాశే ఎదురవుతుందన్నారు. పట్టణాల అభివృద్ధికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం చిత్తశుద్దితో చేస్తున్న ప్రయత్నానికి కేంద్రం తోడ్పాటు అందించాలన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే బడ్జెట్‌లోనైనా తగు మొత్తంలో నిధులు కేటాయించాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం కేంద్రానికి కెటిఆర్ ఒక లేఖ రాశారు.

హైదరాబాద్, వరంగల్, ఇతర పురపాలికల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక నిధులు ఇవ్వని పక్షంలో హైదరాబాద్, వరంగల్ లాంటి పట్టణాలకు ఒక ప్రత్యేక ప్యాకేజీ అయినా ప్రకటించాలన్నారు. రాష్ట్రంపై ఉన్న వివక్షతోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అదనంగా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఈ సందర్భంగా కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోడీ సర్కార్ ఇప్పటి వరకు మొండి చెయ్యి చూపినా కూడా పురపాలికలతో పాటు అన్ని రంగాల్లోనూ తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతి ప్రయాణాన్ని కొనసాగిస్తుందన్నారు. ఎంతో ముందుచూపు, దూరదృష్టితో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తీసుకొచ్చిన పాలనా సంస్కరణలు, విప్లవాత్మక కార్యక్రమాలతో రాష్ట్రంలోని పట్టణాలన్నీ సమగ్రంగా అభివృద్ధి చెందుతున్నాయనడానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అవార్డులు, రివార్డులే నిదర్శనమని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు.

తాజాగా కేంద్ర ప్రభుత్వ అవార్డులతో ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వ పనితీరును మోడీ సర్కార్ గుర్తించిందన్న ఆశాభావంతో మరిన్ని నిధులు కేటాయిస్తారన్న నమ్మకంతో ఈ లేఖ రాస్తున్నట్టు పేర్కొన్నారు. 47 శాతం రాష్ట్ర జనాభా పట్టణాల్లో నివసిస్తున్న నేపథ్యంలో అన్ని రంగాల్లో వాటిని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇందుకోసమే నూతన మున్సిపాల్ చట్టం, నూతన భవన నిర్మాణ అనుమతుల చట్టం తీసుకొచ్చామన్నారు. దీంతో ప్రతి పట్టణం కచ్చితంగా 10 శాతం నిధులను గ్రీన్ బడ్జెట్ కింద ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. అలాగే టిఎస్ బి…పాస్ వంటి విప్లవాత్మక కార్యక్రమాలను అమలుచేస్తున్నామన్నారు. భవిష్యత్ అంచనాలు, అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఉన్న 68 పురపాలికలను 142 కు పెంచుకున్న విషయాన్ని తన లేఖలో కెటిఆర్ ప్రస్తావించారు.

వరసగా ఆరోసారి అత్యుత్తమ నగరంగా హైదరాబాద్

రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించడం వల్లే వరసగా అవార్డులు వస్తున్నాయని కెటిఆర్ పేర్కొన్నారు. ప్రదానంగా పాలనాపరమైన నూతన ఏర్పాట్లు చేసిందన్నారు. అలాగే ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలు వేగంగా పూర్తికావడంతోనే మెర్సర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌లో వరుసగా ఆరోసారి అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ స్థానం దక్కించుకుందన్నారు.
పట్టణాల అభివృద్ధికి ముఖ్యంగా హైదరాబాద్ మహానగర అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం, అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలను శీఘ్రగతిన అమలు చేయడం కోసం పరిపాలనాపరమైన ఏర్పాట్లను సైతం చేసుకున్న విషయాన్ని లేఖలో కేటీఆర్ గుర్తుచేశారు.

వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్‌ఆర్‌డిపి), వ్యూహాత్మక నాలా అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్‌ఎన్‌డిపి), కాంప్రహెన్సీ రోడ్ మెయింటనెన్స్ ప్రాజెక్ట్ (సిఆప్‌ఎంపి), హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్- (హెచ్‌ఆర్‌డిసిఎల్), మూసి రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్‌డిసిఎల్), తెలంగాణ ఫైనాన్స్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టియుఎఫ్‌ఐడి)వంటి సంస్థల ఏర్పాటుతో పాటు అనేక స్పెషల్ పర్పస్ వెహికల్ లను ఏర్పాటు చేసినట్టు కెటిఆర్ తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి కెసిఆర్ మానసపుత్రిక అయిన హరితహారంతో హైదరాబాద్ నగరానికి వరల్ గ్రీన్ సిటీగా అవార్డు లభించిందని కెటిఆర్ అన్నారు. మనదేశం నుంచి హైదరాబాద్ నగరానికి మాత్రమే ఆ గుర్తింపు దక్కిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ప్రభుత్వ సంకల్పంతోనే నగరానికి అంతర్జాతీయ గుర్తింపు

ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలోని తమ ప్రభుత్వ సంకల్పంతో హైదరాబాద్ అభివృద్ధి చెందడంతో పాటు అంతర్జాతీయ గుర్తింపు సైతం లభిస్తోందని కెటిఆర్ వివరించారు. దేశ గౌరవ, ప్రతిష్టలను విశ్వవేదికలపై సగర్వంగా నిలబెడుతున్న బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన బాధ్యత మోడీ ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణ పట్టణాల అభివృద్ధికి కావాల్సిన వివిధ ప్రతిపాదనలు, విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచామని, కనీసం ఈ బడ్జెట్ లోనైనా సానుకూల నిర్ణయం తీసుకోవాలని కెటిఆర్ కోరారు.

ఎయిర్ పోర్టు ఎక్స్‌ప్రెస్ మెట్రో ప్రాజెక్టుకు సాయం అందించాలి

హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు ప్రజలకు అత్యంత అనువుగా మారిన నేపథ్యంలో దానికి అనుసంధానంగా భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రో ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిందని కెటిఆర్ తెలిపారు. రూ.6,250 కోట్ల బడ్జెట్ తో 31 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకి సూత్రప్రాయ అంగీకారాన్ని వెంటనే మంజూరు చేయడంతో పాటు కేంద్రం ఆర్థికంగా మద్దతు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కోసం రూ. 450 కోట్లు కేటాయించాలి

హైదరాబాద్ నగరంలో 20 కిలోమీటర్ల మేర నిర్మించే మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం కోసం దాదాపు రూ. 3050 కోట్లు ఖర్చు అవుతున్నాయని కెటిఆర్ వివరించారు. ఇందులో 15 శాతం మూలధన పెట్టుబడిగా రూ. 450 కోట్లను కేంద్రం కేటాయించాలన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ కోసం కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌లోని రూ. 254 కోట్ల బకాయిలు ఐదు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఈ నిధులను కూడా రానున్న బడ్జెట్‌లో విడుదల చేయాలని కెటిఆర్ కోరారు.

హైదరాబాద్ తో సహా తెలంగాణలోని పురపాలికల్లో చేపట్టిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, బయోమైనింగ్ వంటి ప్రాజెక్టుల కోసం దాదాపు 3,777 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ఇందులో కనీసం 20 శాతం అంటే 750 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో కేటాయించాలి. హైదరాబాద్ మహానగరంలో సంపూర్ణంగా మురుగు నీటిని శుద్ధి చేయాలన్న ప్రణాళికలో భాగంగా 4961 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 1591 MLౄ సామర్థ్యంతో 41 ఎస్టిపిల నిర్మాణం జరుగుతుంది. 3722 కోట్ల రూపాయల వ్యయంతో 2232 కిలోమీటర్ల మేర భారీ మురుగునీటి సరాఫరా నెట్ వర్క్ ను ప్రభుత్వం నిర్మిస్తుంది. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరయ్యే 8684 కోట్ల రూపాయల వ్యయంలో కనీసం మూడో వంతును స్వచ్ఛభారత్ మిషన్ లక్ష్యానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం భరించి తెలంగాణకు మద్దతు ఇవ్వాలి.

వార్షిక యాక్షన్ ప్లాన్ లో భాగంగా హైదరాబాద్ నగరంలో వరదలను అరికట్టే బృహత్తర లక్ష్యంతో చేపట్టిన స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ కోసం గతంలో 240 కోట్ల రూపాయలను అడిగిన విషయాన్ని ఈ బడ్జెట్ లో పరిశీలించాలి. హైదరాబాద్ నగరంలో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు 400 కోట్ల స్వచ్ఛ్ భారత్ మిషన్ నిధులను కేటాయించాలి. స్ట్రాటజిక్ రోడ్డు డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్ నగరంలో చేపట్టిన స్కైవాక్, ఫ్లై ఓవర్లు, జంక్షన్ ల అభివృద్ధి మొదటి దశ పూర్తయింది. ఇంతటి భారీ కార్యక్రమానికి బాండ్స్, రుణాల రూపాల్లో డబ్బులను జిహెచ్‌ఎంసీ సమకూర్చుకుంటోంది. ఇప్పటిదాకా పూర్తైన మొదటి దశ ఎస్‌ఆర్డీపీకి కేంద్రం నుంచి ప్రత్యేకంగా ఒక్క రుపాయి కూడా అందలేదు. ఎస్‌ఆర్డీపీకి రెండవ దశకైనా భారీగా నిధులు ఇవ్వాలి. ఇందుకు సంబంధించిన డీటెయిల్స్ ప్లానింగ్ రిపోర్ట్ సిద్ధంగా ఉంది.

హైదరాబాద్ ని విశ్వనగరంగా మార్చే తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికల్లో భాగంగా చేపట్టబోతున్న మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, ఈస్ట్ వెస్ట్ ఎక్స్ ప్రెస్ వే (11500 కోట్లు), ఎస్‌ఆర్డీపీ రెండవ దశ (14 వేల కోట్లు), డెవలప్మెంట్ ఆఫ్ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం- స్కై వేల నిర్మాణం (9,000 కోట్లు) కోసం అవసరమయ్యే 34,500 కోట్ల రూపాయలలో కనీసం పది శాతం అంటే 3,450 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో కేటాయించాలని విజ్ఞప్తి. హైదరాబాద్ లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన లింకు రోడ్ల నిర్మాణంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. ప్రధాన రోడ్లపై భారీగా ట్రాఫిక్ తగ్గింది. 2400 కోట్ల రూపాయలతో చేపట్టే 104 లింక్ రోడ్ల నిర్మాణ వ్యయంలో మూడో వంతు (800 కోట్ల రూపాయలు) కేంద్ర ప్రభుత్వం భరించాలి.

జాతీయ రహదారి 65 పైన ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన డీటెయిలస్డ్ ప్లానింగ్ రిపోర్ట్ సిద్ధంగా ఉంది. ఇందుకయ్యే 500 కోట్ల రూపాయల వ్యయాన్ని వచ్చే కేంద్ర బడ్జెట్లో కేటాయించాలి. తెలంగాణ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించి దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ సానిటేషన్ హబ్ ను ఏర్పాటు చేస్తుంది. ఇందుకు 100 కోట్ల సీడ్ ఫండింగ్ ఇవ్వాలి. మూడవ విడత జిహెచ్‌ఎంసి చేపట్టిన మున్సిపల్ బాండ్స్ కు కేంద్రం నుంచి రావాల్సిన ప్రోత్సాహకాలను విడుదల చేయాలి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన ఆర్థిక ప్రగతిని సాధిస్తు, పన్నుల రూపంలో దేశ ఆర్థిక ప్రగతికి ఒక చోదక శక్తిగా ఉన్నదన్న కేటీఆర్, ఎదుగుతున్న రాష్ట్రానికి మరింత మద్దతు అందిస్తే దేశ ప్రగతి మరింత వేగవంతం అవుతుందన్నారు. అభివృద్ధిలో ముందుండే రాష్ట్రాలను ప్రోత్సహించి కేంద్ర ప్రభుత్వం తన సమాఖ్య స్ఫూర్తిని చాటుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ బడ్జెట్ లోనైనా తెలంగాణ పట్టణాల అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందన్న ఆశాభావాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే అయిన నేపథ్యంలో తెలంగాణకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఎనిమిది సంవత్సరాలుగా వివిధ అంశాల పైన ప్రత్యేక ఆర్థిక మద్దతు కోసం అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి నిరాశపడ్డామన్న కేటీఆర్, రానున్న 2023-24 బడ్జెట్లో ఐనా నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News