Friday, March 29, 2024

రైల్వేకు భారీగా పెరిగిన కేటాయింపులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బడ్జెట్‌లో రైల్వేకు ఈ సారి ఎన్నడూ లేని విధంగా కేంద్రం భారీ కేటాయింపులు జరిపింది. గత బడ్జెట్‌లో రైల్వేకు రూ. 1.4 లక్షల కోట్లు కేటాయించగా ఈ సారి బడ్జెట్‌లో ఏకంగా రూ.2.40 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. 201314లో జరిపిన కేటాయింపులతో పోలిస్తే దాదాపు 9 రెట్లు ఎక్కువ అని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ సారి బడ్జెట్‌లో కొత్త రైళ్ల ప్రతిపాదనలు ఏమీ లేనప్పటికీ మౌలిక సదుపాయాల మెరుగుదలకు భారీగా నిధులు వెచ్చించనున్నారు. రాజధాని, శతాబ్ది, హమ్‌సఫర్, తేజస్ వంటి ప్రీమియర్ రైళ్లలో సౌకర్యాల మెరుగుకు ఈ సారి బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. ్రప్రయాణికులకు ఆహ్లాదకర ప్రయాణాన్ని అందించడం కోసం వెయ్యికి పైగా కోచ్‌లను ఆధునీకరించనున్నారు.

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన వందేభారత్ రైళ్ల కోసం వేగానికి అనుగుణంగా ట్రాకుల సామర్థాన్ని పెంచేందుకు బడ్జెట్‌లో రూ. 17,296 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వీలు ఉన్నప్పటికీ ట్రాకుల సామర్థం సరిగా లేనందున వందేభారత్ రైళ్ల వేగం ప్రస్తుతం 130 కిలోమీటర్లుగా మాత్రమే ఉంది. ఈ ఏడాది ఆగస్టు నాటికి 75 రైళ్లను ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఇదిలా ఉండగా 200 వందేభారత్ స్లీపర్ ట్రైన్లను తయారు చేయడం కోసం త్వరలోనే టెండర్లను ఖరారు చేయనున్నారు కూడా.

బొగ్గు, ఎరువులు, ఆహారధాన్యాలు వంటివాటి రవాణా కోసం 100 క్లిష్టమైన మౌలిక రవాణా ప్రాజెక్టులను గుర్తించామని నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రాధాన్య ప్రాజెక్టులుగా గుర్తిస్తూ వీటికి మొత్తం రూ.75 వేల కోట్లను కేటాయించినట్లు తెలిపారు. నౌకాశ్రయాలు, బొగ్గు క్షేత్రాలు, ఎరువుల కంపెనీలు, ఆహారధాన్యాల గోదాములు వంటి వాటిని అనుసంధానం చేస్తూ ఈ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తారు. ఇందులో రూ.15 వేల కోట్లు ప్రైవేటు మార్గాలనుంచి రానున్నట్లు తెలిపారు. బడ్జెట్‌లో ప్రకటించిన నిధులను రైల్వే ట్రాకులు,వ్యాగన్లు, విద్యుదీకరణ, సిగ్నలింగ్, స్టేషన్ల సౌకర్యాల కల్పన, ప్రయాణికుల భద్రత కోసం వినియోగించనున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా భారతీయ రైల్వేలో ్లప్రయాణికుల ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశమున్నట్లుగా 2023 ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల ట్రాఫిక్ గణనీయంగా వృద్ధి చెందిందని, నవంబర్ 2022 నాటికి ఈ సంఖ్య 418.4 కోట్లకు చేరుకుందని ఆ సర్వేలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పెరిగిన మొబిలిటీ, మరింత వేగవంతమైన, పోటీతో కూడుకున్న రైళ్లకు డిమాండ్ పెరుగుతున్న దృష్టా రాబోయే సంవత్సరాల్లో ప్రయాణికుల ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశముందని ఆ సర్వే పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News