Home తాజా వార్తలు హైదరాబాద్ జలమయం.. స్తంభించిన ట్రాఫిక్

హైదరాబాద్ జలమయం.. స్తంభించిన ట్రాఫిక్

Rainsహైదరాబాద్: భాగ్యనగరంపై వరణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా నగరంలో బుధవారం ఉదయం కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమయింది. వర్షపు నీరు వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. హైదరాబాద్‌లో మరో రెండుగంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో ఇళ్లలోంచి బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడ్డారు. అత్యవసరమైతే తప్ప.. బయటికి వెళ్లవద్దని నగర వాసులుకు జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రమాదకరమైన మ్యాన్‌హోల్‌లు తెరవద్దని జిహెచ్‌ఎంసి సిబ్బందికి ఆదేశించారు. కాగా, భారీ వర్షానికి రామంతాపూర్‌లోని ఇందిరా ఇంపీరియర్ కాంప్లెక్సు ప్రహరీగోడ కూలి ముగ్గరు మృతి చెందారు. మరొకరికి గాయలయ్యాయి. అమీర్‌పేట, పంజాగుట్ట, అబిడ్స్, నాంపల్లి, బషీరాబాగ్, మారేడుపల్లి, బేగంపేట, బోయిన్‌పల్లి, ఆల్వాల్, పార్శిగూడ, చిలకలగూడ, అడ్గగుట్ట, బొల్లారం, ఉప్పల్, రామంతాపూర్, మన్సూరాబాద్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, మియాపూర్, కూకట్‌పల్లి, ఎస్.ఆర్.నగర్, బోరబండ, యూసఫ్‌గూడ, ఎర్రగడ్డ, తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది.

స్తంభించిన ట్రాఫిక్: భారీ వర్షంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. ఉదయం కార్యాలయాలకే వెళ్లే ఉద్యోగులు, కళాశాలలకు, పాఠశాలలు వెళ్లే విద్యార్థులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి అవస్థలు పడ్డారు. కోఠి నుంచి మలక్‌పేట యశోద ఆసుపత్రి వరకు ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. పాదచారులు కూడా వెళ్లేందుకు వీల్లేని పరిస్థితి నెలకొంది. మియాపూర్ నుంచి అమీర్‌పేట వచ్చేందుకు దాదాపు రెండుగంటల సమయం పడుతుందంటే ట్రాఫిక్ తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓ వైపు మెట్రో పనులతో సతమతవుతున్న నగర వాసులకు భారీ వర్షంతో ట్రాఫిక్ కష్టాలు రెట్టింపయ్యాయనే చెప్పవచ్చు. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో గత 15 ఏళ్లలో ఎన్నడూ చూడనంత భారీ వర్షాలు రాబోయే మూడు రోజుల పాటు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.