Home లైఫ్ స్టైల్ అసమ న్యాయంపై, పంపిణీ వ్యత్యాసాలపై అస్త్రం మానవ హక్కుల దండోరా

అసమ న్యాయంపై, పంపిణీ వ్యత్యాసాలపై అస్త్రం మానవ హక్కుల దండోరా

Dandora-Coverఆది జాంబవంతుడు కుల నిర్మూలనా వాది. కుల ప్రజాస్వామికవాది. జాంబవంతుడి పేరిట ఉన్నదే జంబూ ద్వీపం. జంబూ దీపానికి మరో పేరే భారతదేశం. మాదిగలు, డక్కలి వారు, చిందువారు, మాష్టివారు, బైండ్లవారు, చమార్లు, చక్కిలియనులు, మాంగ్‌లు, మాతంగులు, అరుంధతీయులు జాంబవులు, ఆది జాంబవులు ఇలా అనేక పేర్లతో దేశంలో పిలవబడుతున్న చర్మకార కులాల వారంతా ఆది జాంబవంతుని వారసులు. దేశంలోని షెడ్యూల్డు కులాల మధ్యనేగాక, మొత్తం కులాల జనాభా మధ్యనే సింహ భాగం – అత్యధిక జనాభా వీరిది.
చెప్పు, డప్పు, తోలు వస్తువులు సృష్టించి మానవాభివృద్ధినీ, నాగరికతనూ, మానవ సంస్కృతినీ సుసంపన్నం చేసినవారు మాదిగలు. పేదరికం, నిరక్షరాస్యత, అంటరానితనం, దాడులు, అత్యాచారాలు, మాతంగి, మాతమ్మ, జోగినీ వ్యవస్థ, వెట్టి చాకిరి, బాల కార్మిక వ్యవస్థ, మూఢ నమ్మకాలు, పాకీ వృత్తి వ్యవస్థ, పారిశుద్ధ్య పనులు, భూములు, ఆస్తులకు దూరం చేయబడటం మొదలగు రూపాల్లో చరిత్ర నిండా చర్మకారులైన మాదిగలపై హిందూ ఆధిపత్య కులాల వివక్షాపూరిత యుద్ధాలు, హింస, సాంఘిక మినహాయింపులు, అభివృద్ధి చట్రం నుండి నిరంతరం గెంటివేతలు కొనసాగుతున్నాయి.
దేశ వ్యాప్తంగా 1150 షెడ్యూల్డు కులాలున్నాయి. అధిక జనాభా, స్థిర జీవితం కలిగిన మాదిగలు, మాల వంటి కులాలు ఇందులో ఉన్నాయి. సంచార, అర్థ సంచార జీవితం కలిగిన డక్కలి, చిందు, బైండ్ల, మాష్టి, బుడగ జంగం, నులక చందయ్యలు వంటి అల్ప జనాభా కులాలూ ఇందులో ఉన్నాయి. చర్మకార వృత్తి, పాకీవృత్తి, పారిశుద్ధ్య పనులు, సమాన పనికి సమాన వేతనాలు దొరకని వెట్టి పని, వివక్షలు వెలుపలా, లోపల నుంచి కూడా చర్మకారులపై తీవ్రంగా కొనసాగుతున్నాయి. వృత్తి గౌరవం సాపేక్షికంగా అధికంగా ఉన్న కులాలకు అభివృద్ధి అధికార, రాజ్య చట్రం సాపేక్షికంగా అత్యధిక అందుబాటు ఉండే విధంగా కుల వ్యవస్థ రూపొందించబడింది. అంతేగాక సాపేక్షిక వృత్తి గౌరవం కలిగిన కులాలకు సాపేక్షిక సామాజిక ఆధిక్యత కలిగి ఉండే విధంగా కుల వ్యవస్థ స్థిరపరచబడింది. దీనికి అనుగుణంగానే పాకీ వృత్తి, చర్మకార వృత్తిగతమైన సామాజిక అంతస్తుల్లో ఉన్న రెల్లి, మెహతార్, గొడగలి, గొడారి, పాకీ, పంచమ, మాదిగ, మోచి మొదలగు షెడ్యూల్డు కులాల కంటే మాల కులస్తులను ఆధిపత్య కుల వ్యవస్థ అన్నింటా అభివృద్ధికరమైన ఆధిక్యతల సామాజిక స్థాయిలో ప్రతిష్టించింది. ఉదాహరణకు నవ్యాంధ్రప్రదేశ్‌లో చేరి నలభై లక్షల జనాభా కలిగిన సమాన స్థాయిలో మాదిగ, మాల కులాల వారున్నప్పటికీ నాలుగు ఎస్‌సి రిజర్వుడు లోక్‌సభ పార్లమెంటు స్థానాల్లోనూ నేడు మాల వారే కొనసాగుతున్నారు. పార్లమెంట్‌లో మాదిగలకు సింగిల్ ప్రాతినిధ్యం లేదు. అదే విధంగా, ప్రస్తుత ఎపిలో పదిహేడు మంది మాల ఎంఎల్‌ఎలు ఉండగా, కేవలం పది మంది మాత్రమే మాదిగ ఎంఎల్‌ఎలు ఉన్నారు. మిగిలిన షెడ్యూల్డు కులాలకు రాజకీయ ప్రాతినిథ్యం శూన్యం.
2011 జనాభా గణాంకాలననుసరించి తెలంగాణలో 34 లక్షల మంది మాదిగ అనుబంధ కులాల ప్రజలుండగా, 14 లక్షల మంది మాత్రమే మాల అనుబంధ కులాల ప్రజలున్నారు. తెలంగాణలో పది మంది మాదిగ ఎంఎల్‌ఎలు ఉండగా, ఏడు మంది మాల ఎంఎల్‌ఎలు ఉన్నారు. షెడ్యూల్డు కులాల మధ్య కూడా వృత్తిగతమైన సామాజిక ఆధిక్యతలు, అంతస్తులు, అసమానతలు తీవ్రంగా ఉన్నాయి. ఇక్కడ సాపేక్ష ఆధిక్యత, అభివృద్ధి కలిగింది అత్యధికంగా మాలవారే. దక్షిణాది రాష్ట్రాలన్నింటా షెడ్యూల్డు కులాల మధ్య ఇవే రకమైన అభివృద్ధి వ్యత్యాసాలు చోటు చేసుకున్నాయి. ఉదాహరణకి రాజకీయ రంగంలో తమిళనాడు నుంచి సిపిఐ అగ్రనేత డి.రాజా (పరయ కులస్తుడు) కర్నాటక నుంచి కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ నాయకుడు మల్లికార్జున ఖర్గే (హొలియ కులస్తుడు), మహారాష్ట్ర నుంచి రిపబ్లికన్ పార్టీనేత ప్రస్తుత కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖా మంత్రి రాందాస్ అత్వాలే (మహర్ కులస్తుడు), తెలంగాణ నుంచి గొడిసెల వెంకటస్వామి కుటుంబం ఇంకా అనేక మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎస్‌సి సెల్ జాతీయ చైర్మన్, మాజీ ఐఎఎస్ అధికారి కె.రాజు ఇంకా అనేకమందిని పేర్కొనవచ్చు. ఇంకా పత్రికా రంగం, రచనా, సాంస్కృతిక , ఉన్నతాధికార, రాజకీయ తదితర రంగాలను గమనిస్తే సాపేక్షిక రాజ్యాభివృద్ధి దిశగా మాలవారు పురోగమిస్తూ, చర్మకార, పాకీవృత్తి గత ఎస్‌సి కులాలపట్ల అణచివేత దృక్పథాన్ని అనుసరిస్తున్నారని ఈ వ్యాసకర్త అనేక ఉదాహరణలు ఇవ్వగలడు.
ఎస్‌సి రిజర్వేషన్ల హేతుబద్దీకరణ వల్ల మాల వారికి ఎటువంటి నష్టం, అన్యాయం జరగదు. ఇప్పటి వరకు అదనంగా పొందిన అవకాశాలు మాత్రమే నిలిచిపోతాయి. తమకు న్యాయబద్ధంగా అందవలసిన రిజర్వేషన్ అవకాశాలకు పరిమితం కావాల్సి ఉంటుంది. ఉమ్మడి రిజర్వేషన్ విధానంలో తమ జనాభా నిష్పత్తి కంటే అదనంగా రిజర్వేషన్లు ఇప్పటి వరకు వారు పొందుతూ వచ్చారు. ఈ అదనపు అవకాశాలు కోల్పోవడం ఇష్టం లేని కొందరు మాల సోదరులు నయా గాంధేయ వాదంతో ముందుకొస్తున్నారు. రిజర్వేషన్ల హేతుబద్ధీకరణను వ్యతిరేకిస్తున్నారు. అంటరానివారికి విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో ప్రత్యేక రాజ్యాంగ సంరక్షణలు కావాలని డాక్టర్ బి.ఆర. అంబేడ్కర్ లండన్‌లో వైస్రాయి ఏర్పాటు చేసిన రౌండు టేబుల్ సమావేశాల్లో వాదించి, ఒప్పించి, కమ్యూనల్ అవార్డు పేరిట సాధించాడు. హిందువుల్లో అనైక్యత వస్తుందని గాంధీ ఆనాడు కమ్యూనల్ అవార్డుని వ్యతిరేకించాడు. ఇదే మాదిరిగా రిజర్వేషన్లను తెలుగు రాష్ట్రాల్లోని 61 ఎస్‌సి కులాలకు జనాభా దామాషా ప్రకారం
ప్రతి కులానికీ పంపిణీ న్యాయం అందించే దిశగా వర్గీకరణ (హేతుబద్దీకరణ) చేయించాలని మాదిగ ఉద్యమం కోరుతుండగా షెడ్యూల్డు కులాల మధ్య ఇప్పుడేదో ఐక్యత ఉన్నట్టు, ఆ ఐక్యత రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ వల్ల భంగపడుతున్నట్లు అసాంఘికమైన, అన్యాయమైన గాంధేయ వాద వారసులుగా కొద్ది మంది మాల మేధావులు, సంఘాలు వ్యతిరేకించడం దురదృష్టకరం.

drummerswss
రిజర్వేషన్లు అమలు జరుగుతున్న తీరు తెన్నులపై కేంద్ర ప్రభుత్వం 1965లో నియమించిన బి.ఎన్. లోకూర్ కమిటీ అదే సంవత్సరం తన నివేదికను ప్రభుత్వాకి సమర్పించింది. చాలా షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు రిజర్వేషన్లు అందడం లేదనీ, అతి కొన్ని కులాలు, తెగలే మొత్తం రిజర్వేషన్లను, తమ జనాభా దామాషా కంటే సింహ భాగం పొందుతున్నాయని గుర్తించింది. సాపేక్షికంగా అధిక రిజర్వేషన్ ఫలాలు పొందిన అతికొద్ది కులాలు, తెగలను ఎస్‌సి, ఎస్‌టిల జాబితాల నుండి తొలగించాలని తనకందిన ఫిర్యాదులపై సానుకూల సిఫారసులను చేసింది. జాతీయ సమగ్రత కోసం సాపేక్షికంగా అభివృద్ధి చెందిన కులాలను, తెగలను ఎస్‌సి, ఎస్‌టిల జాబితా నుండి తొలగించడమే గాక, రిజర్వేషన్ అవకాశాలు అందుకోలేక వెనకబడిపోయిన కులాలు, తెగలకు రిజర్వేషన్లు తగిన విధంగా అందించేందుకు అవసరమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని లోకూర సూచించింది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం లోకూర్ కమిటీ సిఫారసులను అమలు చెయ్యడానికి పూనుకోవాలి. ఇదే సమయంలో ప్రతి కులం, తెగలోని అర్హులైన వ్యక్తులందరికీ అభివృద్ధి ఫలాలు అందేలాగ మార్గదర్శకాలను, యంత్రాంగాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించి అమలు జరపాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.

ఎస్‌సి రిజర్వేషన్ల హేతుబద్దీకరణ కోసం నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తేదీ 10-9-1996 సాడు జస్ట్టిస్ రామచంద్ర రాజు కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ తేదీ 26-5-1997 నాడు ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. షెడ్యూల్డు కులాలను ఎబిసిడి గ్రూపులుగా వర్గీకరిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1997 జూన్ 6, 7 తేదీలలో నంబర్ 68, 69 ఉత్తర్వులు జారీ చేసి అమలు జరిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 338ని అనుసరించి విధానపరమైన, ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు జాతీయ ఎస్‌సి, ఎస్‌టి కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించాలి. సంప్రదించని కారణంగా హైకోర్టు ఫుల్ బెంచ్ ఈ ఉత్తర్వులను 1997 సెప్టెంబర్ 18 నాడు కొట్టి వేసింది. షెడ్యూల్డు కులాల వర్గీకరణ విధానాన్ని బలపరుస్తూ నాటి ఉమ్మడి రాష్ట్ర శాసన సభ 1998 ఏప్రిల్ 29 నాడు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేయాలని 1998 అక్టోబర్ 1వ తేదీ నాడు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. 1999 డిసెంబర్ 9 నాడు రాష్ట్ర గవర్నర్ ఎస్‌సి వర్గీకరణ ఆర్డినెన్స్‌ను జారీ చేశారు. 2000 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీనాడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, ‘ఎపి ఎస్‌సి కులాల (రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ) చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సారి ఇ.వి. చిన్నయ్య అనే మాల పెద్ద మనిషి ఈ చట్టానికి వ్యతిరేకంగా కేసు వెయ్యగా 2004 నవంబర్ ఐదు నాడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ని ఈ చట్టం ఉల్లంఘించిందని సుప్రీంకోర్టు కొట్టివేసింది. మరలా వర్గీకరణ కోసం అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ నాటి ఉమ్మడి రాష్ట్ర శాసన సభ 2004 డిసెంబర్ పది నాడు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
తెలంగాణ రాష్ట్ర శాసన సభ తొలి అసెంబ్లీ సమావేశాలలోనే ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణ (హేతుబద్ధీకరణ) విధానాన్ని బలపరుస్తూ, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ 2014 నవంబర్ 29 నాడు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం మేరకు ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణ అంశం పరిశీలన కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ 2008 మే నెలలో తన నివేదికను సమర్పిస్తూ “ఒక రాష్ట్ర లేదా కేంద్ర పాలిత ప్రాంతం తమ శాసన సభ తీర్మానం చేసి పంపితే, దాని మీదట ఎస్‌సిలలో ఉప వర్గీకరణకు ఆర్టికల్ 341కి రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్ అనుమతించవచ్చునని, కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా సూచనలు చేసిన సంగతి గమనించాలి. నిజానికి దేశంలో గత 70 ఏళ్లలో జనాభా విపరీతంగా పెరిగింది. రాజ్యాంగం ఏర్పడ్డప్పుడు గమనించని నాటి చిన్న సమస్యలు ఈ రోజు అతి పెద్దవిగా మారాయి. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మహిళలు, మైనారిటీలు మొదలగు వెనకబడిన సాంఘిక దొంతరలలో పంపిణీ వ్యత్యాసాలు పెరిగాయి. దీంతో అభివృద్ధి వ్యత్యాసాలు పెరిగాయి. ఇప్పుడు ప్రతీ సోషల్ కేటగిరీలోని సాపేక్షికంగా అణగారిన సామాజిక వర్గాలు దండోరా ఉద్యమ స్ఫూర్తితో చరిత్రలో “మాకు అన్యాయం, నష్టం జరిగింది. ఇందుకు తగిన పరిహారం, న్యాయం జరిపించుకోవాల”ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమించడం దేశ వ్యాప్తంగా చూస్తున్నాం. బిసిలలో ఎంబిసి ఉద్యమం వచ్చింది. కోలపూడి ప్రసాద్ లాంటి మేధావులు ఎప్పుడో దీన్ని విశ్లేషించి రగిలించారు. మా రోజు వీరన్న నాయకత్వాన బహుజన కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. గిరిజనుల్లో తుడుందెబ్బ ఉద్యమం వచ్చింది. మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వచ్చాయి. దామాషా ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని ఉద్యమిస్తున్నారు. రాష్ట్రాల్లోనూ, దేశ వ్యాప్తంగానూ ఆయా అణగారిన సామాజిక వర్గాలకు పంపిణీ న్యాయం, సాధికారం, అధికార ప్రాతినిధ్యం అందటానికి వీలుగా నేడు భారత దేశంలోని చట్ట సభలు, ప్రభుత్వాలు, మార్గదర్శకాలు, రాజ్య యంత్రాంగాలు, రాజకీయ పార్టీలు ప్రగతిశీల పాత్ర పోషించవలసిన అత్యవసర పరిస్థితి ముందు కొచ్చింది. లేకుంటే దేశంలో అణగారిన సామాజిక వర్గాల్లో అశాంతి ప్రబలుతుంది. సాంఘిక తిరుగుబాట్లు లేదా కాన్షీరామ్ తరహా బహుజన రాజకీయ ఉద్యమాలదే భవిష్యత్తు అంతా. అణగారిన సమాజాల్లో మహత్తరమైన హక్కులు, ఆత్మగౌరవ ఉద్యమ స్ఫూర్తిని మాదిగ హక్కుల దండోరా ఉద్యమం రగిలించింది. వర్గీకరణ కోరుతున్న కులాలకు న్యాయం జాప్యం అవుతున్నది. మాదిగలు, ఇతర అణగారిన సామాజిక వర్గాలు ఈ సామాజిక న్యాయ సమరంలో గెలవాలి.

Krupakar-madiga-2

కృపాకర్ మాదిగ
సామాజిక ఉద్యమకారుడు, రచయిత
99483 11667