Home ఎడిటోరియల్ సైన్సుతోనే మానవత్వం

సైన్సుతోనే మానవత్వం

Science Books

 

సైన్సు కారణంగా జరిగే మంచికి మనిషి ఎలాగయితే బాధ్యుడో, చెడుకు కూడా మనిషే బాధ్యుడు. వైజ్ఞానిక సమాచారాన్ని తద్వారా అందుబాటులో కొస్తున్న సాంకేతిక నిపుణతను మనిషి ఉపయోగించుకునే విధానాన్ని బట్టి మంచి, చెడూ ఉంటాయి. అంతేకాని, మంచి చెడులు తిథి, వార, నక్షత్రాల పరంగా ఉండవు. మతపరమైన దారుణాలకు మూలాలు ఆయా మత గ్రంథాల్లోనే ఉన్నాయి. వివేచనతో విశ్లేషించుకునే వారికి కనిపిస్తాయి. మూఢ విశ్వాసులకు ఏమీ కనబడవు. సైన్సును అందిపుచ్చుకున్న మనిషే వికాశం వైపు పరుగులు పెడతాడు.

సైన్సు కన్నా మతం వయసులో పెద్దది. కాని, తన పెద్దరికాన్ని అది ఎప్పుడూ నిలబెట్టుకోలేదు. వేల ఏళ్ళుగా మతం ఏం చేస్తోంది? మతం మనిషిని మూర్ఖుణ్ణి చేస్తుంది. మూర్ఖత్వాన్ని వ్యాపింప చేస్తుంది. ఎవరైనా ఆ మూర్ఖత్వాన్ని ప్రశ్నిస్తే అది అసహనంతో పేట్రేగిపోతుంది. ఎదుటివాడి ప్రాణాలు తీయడానికైనా సిద్ధపడుతుంది. నిలువునా నరికేస్తుంది కూడా. దేవుడు దయ్యం భ్రమలంటే విశ్వాసులు అర్థం చేసుకోరు. పైగా శాకినీ, ఢాకినీ, గాలి దయ్యాలను వదిలిస్తామంటారు. భ్రమల్లో బతికే వారికి అవన్నీ భ్రమలే అని కూడా అర్థం కాదు. భ్రమలుంటే వాటిని వారి వరకే పరిమితం చేసుకోవాలి. ప్రపంచ మంతా ఆ భ్రమల్ని వ్యాపింప చేస్తామంటే ఎలా? పచ్చకామెర్ట రోగం వచ్చిన వాడికి అది వాడి వ్యక్తిగతం. ఈ మత పిచ్చి, దైవ పిచ్చి, జ్యోతిష్యపిచ్చి, జాతకాల పిచ్చి, యోగ సమాధిల పచ్చి, ఆత్మ పరమాత్మల పిచ్చి ఉన్నవారికి ప్రపంచ మంతా ఆయా పిచ్చిలో ఉన్నట్లే కనిపిస్తుంది. పైగా ఆ పిచ్చిని ఆనందంగా ప్రచారం చేయాలని చూస్తారు. వారికి ఎవరూ తప్పు పట్టాల్సిన పని లేదు. నిందించాల్సిన పని అంతకన్నా లేదు. అయితే అర్థం చేసుకోవాలి.

మత విశ్వాసులు సంఖ్య మన జనాభాలో అధికంగా ఉందని మనం కూడా వారిని అనుసరిస్తామా? అట్లని వారిని గాలికి వదిలేస్తామా? వాళ్లకు వాస్తవాలు తెలియజేయాలి కదా? ‘మూర్ఖుడి మనసు రంజింపరాదు’ అనే మాట ఊరికే రాలేదు. నిజమే! కాని తెలివిగల నిజాయితీ పరులు మత పిచ్చిలో రగిలిపోయే మూర్ఖ శిఖామణుల్ని వదిలేయడం పరిష్కారం కాదుగదా? ప్రయత్నించాలి కదా? ఒప్పంచాలి కదా? బాధ్యత గల శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు , రచయితలు, జర్నలిస్టులు, హేతువాద దృక్పథం వామపక్ష భావజాలం గల సామాన్య పౌరులందరూ ఎవరి స్థాయిలో వారు పిచ్చిని, భ్రమల్ని వదిలించే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. శారీరక లోపాలున్న వారిని, మానసిక వ్యాధులున్న వారిని వదిలేస్తున్నామా? వారిని బాగు చేసి జీవన స్రవంతిలో కలుపుకోడం లేదా? భిన్నమైన ఆలోచనా ధోరణి గల తీవ్రవాదులు, నక్సలైట్లు లొంగిపోయి, జన జీవన స్రంతిలో కలిసినట్టు అంధ విశ్వాసంలో కళ్లు మూసుకుని, నిర్జీవులుగా బతుకీడుస్తున్న వాళ్లు కాస్త కళ్లు తెరచి, వాస్తవ ప్రపంచాన్నీ, జరుగుతున్న వైజ్ఞానిక ప్రగతిని అర్థం చేసుకుంటే బావుంటుంది.

సైన్సుకూ, మతానికీ ఉన్న తేడాల్ని వివేచనతో ఒక్కసారి గమనిద్దాం. సైన్సు అనునిత్యం ప్రశ్నను ఆహ్వానిస్తుంది. కానీ, మతమేదైనా ప్రశ్నించడాన్ని సహించదు. తన దగ్గర సిద్ధంగా ఉన్న సమాధానాలకు అనుగుణంగా మాత్రమే ప్రశ్నలు రావాలని ఆశిస్తుంది. సైన్సు ప్రశ్నలను సంధించుకుంటుంది. సమాధానాలను మళ్లీ అదే అన్వేషిస్తుంది. సైన్సు కనుగొన్న ప్రతి అంశమూ, ఆవిష్కరణా సమాజ పరమవుతాయి. ప్రాంతాన్ని బట్టి సైన్సు సత్యాలు మారవు. అవి ఏ దేశంలో నైనా ఒకేలా ఉంటాయి. మతాలు చెప్పే అంశాలు ఆ మతంలోని విశ్వాసకులకే పరిమితం. విశ్వజనీనం కావు. సైన్సు తను సత్యమని చెప్పిన అంశాలను పరమ సత్యం అని ప్రకటించదు. అవసరమైతే సవరణలకు సిద్ధపడుతుంది. మతాలు చెప్పే అంశాలకు సవరణలుండవు. పునః పరిశీలనలుండవు. అందుకు అక్కడ అవకాశమే ఉండదు. మతం చెప్పే అంశాలను ఆ మతమే పరమ సత్యాలని నిర్ధారిస్తుంది. పైగా మతాలను బట్టి సత్యాలు మారుతుంటాయి.

తను చెప్పిన దానికి వ్యతిరేకంగా మరో శాస్త్రవేత్త గనక మాట్లాడితే ఏ శాస్త్రవేత్త అతనిపై కక్ష కట్టడు. హింసించడు. బానిసగా చూడడు. హీనంగా తీసి పారెయ్యడు. అదే మతం ధర్మం విషయాలలో అవన్నీ జరుగుతూనే వస్తున్నాయి. ఎవడి డప్పు వాడు కొట్టుకోవడం తప్ప. ఎదుటివాడి ఆలోచన ఏమిటో ఒకసారి విందామన్న సంస్కారం ఉండదు. ప్రతి మతమూ ఇతర మతాలతో విభేదిస్తుంది. వాటిపై కక్ష కడుతుంది. ప్రపంచంలో బానిస విధానం రావడానికి, మత మార్పిడులు జరగడానికి, మత కలహాలతో విధ్వంసాలు జరగడానికి కేవలం మతాలే కారణం. సైన్సులో ముందు పరిశీలన, తరువాత ప్రశ్న, ఆ తర్వాత ప్రయోగం, నిర్ధారణ ఒక వరుస క్రమంలో జరుగుతూ వస్తాయి. పరిశీలన, ప్రశ్న, ప్రయోగం. నిర్ధారణ వంటి వాటికి మతంలో అసలు అవకాశమే ఉండదు.

సైన్సు కారణంగా జరిగే మంచికి మనిషి ఎలాగయితే బాధ్యుడో, చెడుకు కూడా మనిషే బాధ్యుడు. వైజ్ఞానిక సమాచారాన్ని తద్వారా అందుబాటులో కొస్తున్న సాంకేతిక నిపుణతను మనిషి ఉపయోగించుకునే విధానాన్ని బట్టి మంచి, చెడూ ఉంటాయి. అంతేకాని, మంచి చెడులు తిథి, వార, నక్షత్రాల పరంగా ఉండవు. మతపరమైన దారుణాలకు మూలాలు ఆయా మత గ్రంథాల్లోనే ఉన్నాయి. వివేచనతో విశ్లేషించుకునే వారికి కనిపిస్తాయి. మూఢ విశ్వాసులకు ఏమీ కనబడవు. సైన్సును అందిపుచ్చుకున్న మనిషే వికాశం వైపు పరుగులు పెడతాడు. విశాల హృదయం, హృదయ సౌందర్యం ఉన్న వాడే మనిషిని మనిషిగా చూడగలుగుతాడు. విశ్వమంతా తనది, విశ్వ మానవులంతా తనవారు అని బలంగా నమ్మిన వాడే ‘విశ్వ ప్రేమ’ను అర్థం చేసుకున్నట్లు! అదే, మతంలో కూరుకుపోయిన వాడు సంకుచితంగా మారిపోతాడు. తన మతం వాళ్లను తప్ప, ఇతరుల్ని అభిమానించలేదు. ‘విశ్వ ప్రేమ’ అనేది వీరి పరిధిలో ఉండదు. అది అర్థం చేసుకున్నవాడు అసలు మతం చట్రంలో బిగుసుకుపోడు.

ఒకటి మాత్రం నిజం. కళ్లు మూసుకుని భ్రమల్లో బతికే వారితో ప్రపంచం ఈ ఇరవై ఒకటవ శతాబ్దిలోకి రాలేదు. ఈ ప్రపంచమంతా తనది అనుకునే విశాల హృదయులైన వైజ్ఞానికుల వల్లే వచ్చింది. వైజ్ఞానిక స్పృహగల వారి రచనలతోనే, ఉపన్యాసాలతోనే మార్పు వచ్చింది. ఇంకా వస్తూ ఉంది. ఈ అభిప్రాయంతో ఏకీభవించే వారు వారి స్థాయిలో వారు కృషి చేస్తూ ఉండాలి. ఏకీభవించని వారు ఒకటికి పదిసార్లు మళ్లీ మళ్లీ ఆలోచించుకుంటూ ఉండాలి. జీవితంలో తాము ఎన్నుకున్న దారి సరైందా కాదా అని ! మతాల చుట్టూ తిరిగే యోగులు, సన్యాసులు, ముల్లాలు, స్వస్తి కేంద్రాలు నడిపే ఫాదర్‌లు, దిగంబర్‌లు, పైగంబరులు, ఇతరత్రా భక్తులు వారివారి ప్రార్థనల వల్ల, భజనల వల్ల, మంత్రాల వల్ల, పూజల వల్ల సమాజానికి అణుమాత్రమైనా మేలు జరగలేదని తెలుసుకుంటే మంచిది. వారికి వారు ఆటో సజెషన్స్ (AUTO మెదళ్లు మొద్దుబారించుకుని, కాలం వెళ్లబుచ్చడం తప్ప, ప్రపంచానికి పనికొచ్చే ఏ ఆవిష్కరణా వారు చేయలేదు. చేయలేరు కూడా!

సమాధిలో కూర్చుని ధాన్యం చేస్తే గాలిలో పైకి లేచి లోకాలన్నీ తిరుగుతామని చెప్పే వారివి తప్పకుండా అబద్ధాలే. లేదా అవి వారి మానసిక భ్రమలే.. అంతే ! యదార్థమెలా ఉంటుందంటే ఈ కొండ మీది నుండి ఆ కొండ మీదికి ‘రోప్ వే’లో ప్రయాణించినట్టు ఉంటుంది. అదొక సాంకేతిక ఆవిష్కరణ. నేల మీద ఉన్న చెట్ల మీదుగా, వాగుల మీదుగా గాలిలో ప్రయాణించి ‘రోప్ వే’లో వెళ్లొచ్చు. రోప్‌వే అనే కాదు, ఏదైనా, వైజ్ఞానిక సాంకేతిక పరిజ్ఞానం అందరికీ అందుబాటులోకి వస్తుంది. అలా రావాలి కూడా! ఆధ్యాత్మిక సాధన అనేది వ్యక్తిగత భ్రమల్ని సాధించుకునేది. అది పక్కవాడికి పనికి రాదు.

చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఎక్కువ మంది నమ్మేదే సత్యం అని ఎక్కువ మంది విశ్వసించేదే తాము కూడా విశ్వసిస్తే, జీవితం సులభతరమౌతుందని ! దీనికి సమాధానం వేల ఏళ్ల క్రితమే గౌతమ బుద్ధుడు చెప్పాడు. “నాకు మతం అనేది లేదు. ప్రేమే నా మతం. ప్రతి మానవ హృదయం నా దేవాలయం” అని ! మరో మాట కూడా అన్నాడు. …“అందరితో కలిసి చెడు దారిలో వెళ్లే బదులు ఒంటరిగానైనా సరే, మంచి దారిలో వెళ్లడం మేలు” అని! ఈ అత్యాధునిక సమాజం ఆ స్థాయిని ఎప్పుడు అందుకుంటుందో మరి? ఇటీవల థాయ్‌లాండ్ గుహలో చిక్కుకున్న క్రీడాకారులైన పిల్లల్ని బయటికి తేవడమైనా, కేరళ వరదల్లో చిక్కుకున్న లక్షల మందిని రక్షించడమైనా వైజ్ఞానిక, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుని కేవలం మనుషులే చేశారు. వాళ్లే నిజమైన హీరోలు! ఇలాంటి సంఘటనల్ని మానవ విజయాలుగా చెప్పుకోవాలి. మతాల వల్ల, దేవుళ్లవల్ల, మత బోధకుల వల్ల ఏమంటే ఏమీ కాలేదు. సామాన్య జనం ఈ విషయం అర్థం చేసుకోవాల్సి ఉంది. సైన్సు నేపథ్యంలోనే మానవత్వం పరిమళిస్తుంది!

Humanity with science