Saturday, April 20, 2024

భార్య ప్రాణం తీసిన అనుమానం

- Advertisement -
- Advertisement -

అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతోనే హత్య
అనుమానం రాకుండా ఇంటి ఆవరణలోనే శవాన్ని పూడ్చిపెట్టిన భర్త

 

 

మన తెలంగాణ/కట్టంగూర్: అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతోనే భార్యను బండరాయితో తలపై కొట్టి, భర్త హతమార్చాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం నారెగూడెం గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. శాలిగౌరారం రూరల్ సిఐ పసుపులేటి నాగదుర్గా ప్రసాద్, మృతురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం… కట్టంగూరు మండలంలోని పరడ గ్రామానికి చెందిన పెండెల కృష్ణకు, నారెగూడెం గ్రామానికి చెందిన బల్గూరి లింగయ్య పార్వతమ్మ దంపతుల కుమార్తె ప్రభ (36)తో 20 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వివాహానంతరం వారి సంసార జీవితం కొంతకాలం సాఫీగా సాగింది. కొన్ని సంవత్సరాల క్రితం బతుకుతెరువు కోసం కృష్ణ తన అత్తగారి గ్రామమైన నారెగూడెం గ్రామానికి వలస వచ్చి, కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. మూడు రోజుల క్రితం కుమార్తె మండల పరిధిలోని పామనగుండ్ల గ్రామంలో బంధువులు ఇంటికి వెళ్లగా, కుమారుడు శనివారం అదేగ్రామంలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. భార్యభర్తలు ఇంటి ఆవరణలో ఆరుబయట మంచంపై నిద్రపోయారు.

గత కొంతకాలంగా కృష్ణ మద్యానికి బానిస కావడంతో భార్యను వేదించేవాడు. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానం కాస్త పెనుభూతంగా మారడంతో గాఢనిద్రలో ఉన్న తన భార్య తలపై బండరాయితో బలంగా కొట్టగా అక్కడికక్కడే మృతి చెందింది. కృష్ణ తన భార్య మృతదేహాన్ని బొంతలో చుట్టి కాళ్లు, చేతులకు తాళ్లు బిగించి, బస్తాలో మూట కట్టి, ఇంటి ఆవరణలో తీసిన గుంతలో పూడ్చివేసాడు. గ్రామంలో ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మంచం దగ్గర పడిన రక్తపు మరకలు కనపడకుండా ఈ ప్రదేశంలో పారతో మట్టిని తొలగించి, పూడ్డిన ప్రదేశంలో పై భాగంలో వేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా పూడ్చిన గుంత పైభాగంలో కట్టెలు పేర్చి, కంప వేశాడు.

ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మృతురాలి తల్లి పార్వతమ్మ ఇంటికొచ్చేసరికి వాకిట్లో కల్లాపి చల్లకుండా ఉండడంతోపాటు ఆరుబయట రక్తపు మరకలు కనిపించడంతో ఒక్కసారిగా ఏడవడంతో గమనించిన ఇరుగుపొరుగు ఆ ఇంటి వద్దకు చేరుకొని, విషయాన్ని స్థానిక సర్పంచ్‌కు సమాచారం అందించారు. ఈ విషయాన్ని స్థానిక సర్పంచ్ పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన నల్లగొండ డిఎస్‌పి వెంకటేశ్వర్‌రెడ్డి, శాలిగౌరారం రూరల్ సిఐ పి. నాగదుర్గాప్రసాద్, స్థానిక ఎస్‌ఐ జికె ప్రసాద్, పోలీస్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని, కట్టెలు తొలగించి, ప్రభ మృతదేహాన్ని బయటకు తీసారు. ఈ సందర్భంగా ఇరుగుపొరుగువారిని విచారించగా, హత్య విషయం బయటపడింది. అనంతరం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్తుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి పార్వతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.

Husband killed his wife in Naragudem
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News