Home తాజా వార్తలు డెక్కన్ దవాఖానా పర్మిషన్ రద్దు

డెక్కన్ దవాఖానా పర్మిషన్ రద్దు

Hyd pvt hospital barred from Covid treatment

 

కొవిడ్ చికిత్సకు అధిక ధరలు వసూలు చేసినందుకు ప్రభుత్వం కొరడా
బాధితులు ఫిర్యాదు చేస్తే మిగతా ఆసుపత్రులపైనా చర్యలు
వైద్య శాఖ వ్యాట్సాప్ నంబర్(9154170960)కు ఇప్పటికే వెయ్యి ఫిర్యాదులు
వీటిలో పూర్తిస్థాయి విచారణ అనంతరం చర్యలు : హెల్త్ డైరెక్టర్

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా చికిత్సలో దోపిడికి పాల్పడుతున్న ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులపై వైద్యశాఖ కొరడా ఝులిపిస్తుంది. తాజాగా హైదరాబాద్‌లోని సోమాజిగూడలో ఉన్న డెక్కన్ ఆసుపత్రి పర్మిషన్‌ను రద్దు చేస్తూ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పేషెంట్ల నుంచి ఇష్టారాజ్యంగా అధిక బిల్లులను వసూలు చేసినందుకు డెక్కన్ ఆసుపత్రిలో కోవిడ్ చికిత్సను నిలిపివేయాలంటూ హెల్త్ డైరెక్టర్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. కరోనా చికిత్సకు ప్రభుత్వం జారీ చేసిన జి.ఓను ఉల్లంఘించినందుకు ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897 ప్రకా రం చర్యలు తీసుకున్నామని డా. జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

ఇటీవల పలువురు బాధితుల ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రైవేట్ దోపిడికి గురైన బాధితులు ఫిర్యాదులు చేస్తే మిగతా ఆసుపత్రులపై కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. అది ఏ స్థాయి ఆసుపత్రి అయినా సహించేది లేటదని ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మానవత్వం మరిచి ప్రవర్తిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ అనుమతులను ఖచ్చితంగా రద్ధు చేస్తామని హామీ ఇచ్చారు.

డెక్కన్ ఆసుపత్రి అసలేం జరిగింది…?
కరోనా సోకడంతో జూలై 15వ తేదిన సత్యనారాయణరెడ్డి అనే వ్యక్తి డెక్కన్ ఆసుపత్రిలో చేరారు. సుమారు 13 రోజుల పాటు చికిత్స పొందిన అతనికి 28వ తేదిన ఆరోగ్యం పూర్తిస్థాయిలో విషమించి అదే రోజు చనిపోయారు. అయితే అతని చికిత్సకు ఏకంగా ఆసుపత్రి యాజమాన్యం రూ.17 లక్షల 50వేలు బిల్లు వేసింది. అయితే తాము అప్పటికే రూ.10 లక్షలు చెల్లించామని, మిగతా డబ్బులు ఇస్తేనే డెడ్‌బాడీ ఇస్తామని సదరు ఆసుపత్రి చెప్పినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. ఈ కథనాలు పలు ఛానళ్లు, పత్రికల్లో రావడంతో ఎట్టకేలకు ఆసుపత్రి యాజమాన్యం సత్యనారాయణరెడ్డి ట్రీట్‌మెంట్‌కు కేవలం రూ.12 లక్షలు వేశామని, కానీ వారు రూ. 10 లక్షలు మాత్రమే చెల్లించినట్లు ఆసుపత్రి ప్రెస్‌మీట్ పెట్టి మరి వివరణ ఇచ్చారు.

అయితే సత్యనారాయణ రెడ్డి చనిపోయిన రోజే అతని భార్య కూడా మరో ఆసుపత్రిలో చనిపోయింది. అంతకు ముందు అతని అన్న కొడుకు కూడా కరోనాతో చనిపోయారు. దీంతో మానసికంగా కృంగిపోయిన సత్యనారాయణ రెడ్డి కొడుకు జరిగిన విషయాన్ని కెటిఆర్‌కు ట్విట్టర్‌లో తెలిపారు. వెంటనే స్పందించిన మంత్రి జరిగిన ఘటనపై విచారించి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దీంతో రంగంలోకి దిగిన వైద్యశాఖ పూర్థిస్థాయిలో విచారించి చర్యలు తీసుకున్నట్లు సమాచారం. దీంతో పాటు ఇదే డెక్కన్ ఆసుపత్రిలో నెగటివ్ వచ్చినా పాజిటివ్ పేరిట చికిత్స చేసి రూ. 3 లక్షలు వరకు వసూల్ చేసినట్లు ఓ న్యాయవాది పోలీసులను ఆశ్రయించారు. దీంతో వైద్యశాఖ మరింత వేగంగా చర్యలు తీసుకున్నట్లు అధికారులు అంటున్నారు.

మిగతా ఆసుపత్రులపై కూడా చర్యలకు సిద్ధం…
ప్రైవేట్ ఆసుపత్రులపై ఫిర్యాదు చేసేందుకు వైద్యశాఖ ఏర్పాటు చేసిన వాట్సాప్ నెంబర్‌కు ఇప్పటి వరకు సుమారు వెయ్యికి పైగా ఫిర్యాదులు వచ్చాయి. వీటిని కూడా పూర్తిస్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటామని హెల్త్‌డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Hyd pvt hospital barred from Covid treatment