Home స్పెషల్ ఆర్టికల్స్ నగరమా, నరకమా?

నగరమా, నరకమా?

విశ్వనగరంగా ప్రకటించిన హైదరాబాద్‌లో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. అత్యాచార ఘటనలు, లైంగిక వేధింపులు, కిడ్నాపులు గగుర్బాటు కలిగిస్తున్నాయి. వావివరుసలు, చిన్నాపెద్దా అనే విచక్షణ మరిచిన మృగాలు ఏవైపు నుంచి వచ్చి కాటేస్తాయో తెలీకుండా ఉంది. రేయింబవళ్లూ కంటికి రెప్పలా పహారా కాస్తున్న పోలీసులకు కామాంధుల దుశ్చర్యలు సవాళ్లుగా మారాయి.

Hyderabad-Women-Harrsment

గత నెల పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్న విద్యార్థినిపై ఓ కారు డ్రైవర్ పలుమార్లు అత్యాచారం చేసి, వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేశాడు.. గత సంవత్సరం ఫామ్‌హౌస్‌లో చోరీకి వెళ్లిన అంతరాష్ట్ర దొంగల ముఠా అక్కడ బాలికను ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఎల్‌బి నగర్‌లోని ఒక ఇంట్లో మైనర్‌ను పనిమనిషిగా చేర్చుకుని తండ్రీకొడుకులిద్దరూ అత్యాచారానికి ఒడిగట్టారు.
అమీర్‌పేట వద్ద క్యాబ్‌లో ఎక్కిన ఓ యువతి నిద్రలోకి జారుకోగానే డ్రైవర్ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి వాటిని వాట్సప్ ద్వారా స్నేహితులకు పంపించాడు. విజయవాడకు వెళ్లడానికి క్యాబ్ ఎక్కిన యువతిని క్యాబ్ డ్రైవర్, అతడి స్నేహితు లు కలిసి అత్యాచార యత్నానికి పాల్ప డడం …ఇవన్నీ నగరంలో జరిగిన అఘాయిత్యాలకు ఉదాహ రణలు. తెలిసినవి ఇవి, తెలియనివి ఇంకెన్నో….
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని, దేశ అభ్యున్నతిలో మహిళలదే కీలక పాత్ర. మహిళలను గౌరవిం చాలి.. అంటూ ఈ మధ్య నగరానికి వచ్చిన రాష్ట్రపతి ప్రసంగించారు. వినడానికి బాగుంది. కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నం. నగరంలో మహిళలపై జరుగు తున్న అన్యాయాలకు అంతే లేకుండా పోతోంది. హైదరాబాద్ నగరంలోనే ఈ సంవత్సరం రెండు నెలల్లో 35 అత్యాచారాలు, 16 కిడ్నాప్‌లు జరిగాయంటే సమాజం సిగ్గుపడాలి. నగరంలో ఇన్నివేల మంది పోలీసులు, ఆధునిక పరికరాలు, కొత్త టెక్నాలజీ ఉన్నా మహిళలపై అన్యాయాలు, లైంగిక వేధింపులు ఎందుకు ఆగడం లేదో, అసలు ఎందుకు జరుగుతున్నాయో తెలీడం లేదు. ఈ ఘోరాలను ఎందుకు నివారించలేకపోతున్నామో అనేది మాత్రం మిలియన్ డాలర్ ప్రశ్న.
అన్ని రంగాల్లోని వారికీ తప్పని వేధింపులు : రాజకీయ, సినీ, పారిశ్రామిక, ఉద్యోగ రంగాల్లోని మహిళలు అధికంగా వేధింపులకు గురవుతున్నారు. ఇటీవల మలయాళ నటి భావన విషయంలో ఆమె డ్రైవర్లే అఘాయిత్య యత్నానికి పాల్పడ్డారు. ఆమె ధైర్యంగా ముందు కువచ్చి బయటి ప్రపంచానికి తెలియజేసింది. ఆ నటిని స్ఫూర్తిగా తీసుకుని మరికొంత మంది హీరోయిన్లు తమకు జరిగిన లైంగిక వేధింపుల గురించి ప్రసార మాధ్యమాల్లో చెప్పడం జరిగింది.
పరిచయస్తులే కాలనాగులు : మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారు పరాయివాళ్లు, తెలీని వాళ్లు కాదు. ప్రతిరోజూ నవ్వుతూ మాట్లాడే పక్కింటి వ్యక్తులు, ప్రేమతో దగ్గరైన స్నేహితులు, బంధువులు, ఒక్కోసారి కన్నతండ్రి చేతిలోనే బాలికలు, యువతులు లైంగిక వేధింపులు, దాడులకు గురవుతున్నారు. మహిళలపై అత్యాచారానికి పాల్పడే దుర్మార్గుల్లో 99శాతం పరిచయస్తులేనని పోలీస్ శాఖ అధ్యయనంలో తేలింది. 2016లో హైదరాబాద్ జోన్ పరిధిలోని 12జిల్లాల్లో నమోదైన అత్యాచార కేసులపై ఈ స్టడీ జరిగింది. గతేడాది నమోదైన 280 అత్యాచార, కిడ్నాప్ ఘటనల్లో కేవలం 4-5 శాతం మంది మాత్రమే బయటి వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రేమికుల్లో 35-45 శాతం మంది యువకులు, ప్రేమిస్తున్నామంటూ అమ్మాయిని నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి వారిపై స్నేహితులతో సహా లైంగికదాడులకు పాల్పడుతున్నారు. అంతటితో ఊరుకోకుండా ఈ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి బెదిరింపులకు దిగడం పరిపాటయింది. ఇంట్లో చెబితే ఊరుకోరని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే అందరికీ తెలిసి పరువుపోతుందనే భయంతో కొంతమంది అమ్మాయిలు ఇవన్నీ భరిస్తూ, సహిస్తూంటారు. దీంతో దాడి చేసిన వారు మరింత రెచ్చిపోయి బాధితురాలి నుంచి డబ్బు గుంజటం కూడా జరుగుతుందని క్రైం రిపోర్టు అధ్యయనంలో తెలిసింది.
15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వారే అధికం : అత్యాచారం ఘటనల్లో ఎక్కువ శాతం బాధితులు 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వారే ఉన్నారు. నిందితులు 1825 ఏళ్లలోపు వారే అధికంగా తేలింది. 50 ఏళ్లకు పైన ఉన్నవారు అత్యాచారం కేసుల్లో పది శాతం ఉన్నారు. నిందితులు అధికశాతం పేదవారు, మధ్యతరగతివారే ఉండటం గమనార్హం. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువగా జరుగు తున్నాయని ఈ నివేదిక గుర్తించింది. నిందితుల విద్యాస్థాయిని పరిశీలిస్తే పదో తరగతి లోపు చదువుకున్నవారే అధికులని తేలింది.
అన్యాయాన్ని ఎదుర్కోవాలి : మహిళలు తమపై జరుగుతున్న దాడులను చాకచక్యంగా ఎదుర్కోవాలి. నగరంలో 60వేలకు పైగా ఉన్న క్యాబ్‌లకు పోలీసులు స్టిక్కర్లను అతికించి రిజిస్టర్ చేశారు. మహిళలు తప్పనిసరి పరిస్థితుల్లో క్యాబ్ ఎక్కాల్సి వస్తే స్టిక్కర్ నెంబర్‌ను నోట్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో నెంబర్‌ను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి స్నేహితులకు, బంధువులకు పంపించాలి. బ్యాగ్‌లో ఎప్పుడూ పెప్పర్ స్ప్రేను వెంటతీసుకెళ్లాలి.
సామాజిక మాధ్యమాలైన ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సప్‌ల ద్వారా ప్రేమ పేరుతో అమ్మాయిలను లొంగదీసుకుని మోసం చేసే మృగాళ్లు ఎంతోమంది ఉన్నారు. వారి వల్లో పడకుండా విచక్షణతో ఆలోచింది సరైన నిర్ణయం తీసుకోవాలి. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా మహిళలు తమను తాము రక్షించుకోగలగాలి. నీడను తప్ప ఎవర్నీ అతిగా నమ్మకూడదు. ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడటం మంచిది. మొబైల్ ఫోన్‌లో అత్యవసర సమయం, ప్రమాద కర సమయంలో కాపాడగలిగే కొన్ని యాప్‌లున్నాయి. వాటిని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మహిళలకు సామాజిక భద్రత కల్పించకపోవడం వల్ల సమాజానికే నష్టం కలుగుతోంది.

– మల్లీశ్వరి వారణాసి