Friday, February 3, 2023

భార్యను కాల్చి… భర్త ఆత్మహత్య?

- Advertisement -

 

టెక్సాస్‌లో హైదరాబాదీల విషాదాంతం

పోలీసుల దర్యాప్తు

మన తెలంగాణ/హైదరాబాద్: అమెరికాలోని టెక్సాస్‌లో నివసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన (భారతీయ అమెరికన్) దంపతులు శ్రీనివాస్, శాంతిలు అనుమానాస్పదంగా మృతి చెందారు. మృత దేహాలపై తుపాకీతో కాల్పులు జరిగిన గాయాలను పోలీసులు గుర్తించారు. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 5.40 గంటలకు వరుసగా తుపాకీ కాల్పుల శబ్దాన్ని విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో భార్యాభర్తలిద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్న విషయాన్ని గమనించారు. కాల్పులు జరిగిన సమయంలో వారి కుమార్తె పక్క గదిలోనే నిద్రిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సమస్యల కారణంగా భార్య శాంతిని భర్త శ్రీనివాస్ తుపాకీతో కాల్చి చంపి ఆ తర్వాత అదే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అప్పటికి అరగంట ముందు శ్రీనివాస్‌కు ఒక ‘ఇ మెయిల్’ వచ్చిన విషయాన్ని కూడా పోలీసులు తెలుసుకున్నారు. అయితే అందులోని వివరాలను మాత్రం అక్కడి మీడియాకు వెల్లడించడానికి పోలీసులు నిరాకరించారు. వివరాల్లోకి వెళ్తే& టెక్సాస్ నగరంలో హైదరాబాద్‌కు చెందిన నకిరేకంటి శ్రీనివాస్, అతని భార్యత శాంతి, కుమారుడు, కుమార్తె కలిసి షుగర్‌ల్యాండ్‌లో నివాసం ఉంటున్నారు. సోమవారం (ఈనెల 18) తెల్లవారు జామున 5.40 నిమిషాలకు కాల్పుల శబ్దం వచ్చినట్లు స్థానికుల ఫిర్యాదు మేరకు అక్కడికి చేరుకున్నామని, ఇద్దరూ అప్పటికే చనిపోయారని షుగర్‌ల్యాండ్ పోలీస్ చీఫ్ ఎరిక్ రాబిన్స్ పేర్కొన్నారు. శ్రీనివాస్ పడకగదిలో గన్ దొరికిందని, శాంతి మృతదేహంపై నుదుటిమీద తుపాకీ పాయింట్ బ్లాంక్ గుర్తులు ఉన్నాయని, శ్రీనివాస్‌కు ఛాతీ భాగంలో బుల్లెట్ గాయం ఉందని పేర్కొన్నారు. మృతుడు శ్రీనివాస్ తన భార్య శాంతిని చంపిన అనంతరం ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాధమిక విచారణలో వెలుగుచూసిందన్నారు. సంఘటన జరిగిన సమయంలో కుమార్తె పక్క గదిలోనే నిద్రలో ఉందని, 21 ఏళ్ల కుమారుడు మాత్రం ఆ సమయంలో ఇంట్లో లేడని తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా శ్రీనివాస్ ‘ఇ మెయిల్’లను పరిశీలించామని తెలిపారు. శ్రీనివాస్ హైదరాబాద్‌లోని జెఎన్‌టియులో ఇంజనీరింగ్ పూర్తి చేశారని, శాంతి ఉస్మానియా యూనివర్శిటీ ఇంజనీరింగ్ చదివిందని తెలిసింది. దీర్ఘకాలంగా అమెరికాలోనే ఉంటున్న శ్రీనివాస్ ప్రస్తుతం ‘ఇండో అమెరికన్ ఛారిటీ ఫౌండేషన్’కు అధ్యక్షుడిగా ఉన్నాడని, గతంలో రిలయెంట్ ఎనర్జీ సంస్థలో డైరెక్టర్‌గా పనిచేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. గతంలో హోస్టన్‌లో పనిచేసిన సంస్థలోనే ప్రస్తుతం సలహాదారునిగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఆయన భార్య శాంతి మాత్రం యునైటెడ్ ఎయిర్‌లైన్‌లో అర్కిటెక్ట్‌గా పనిచేస్తున్నట్లు తేలింది. వీరి కుమారుడు టెక్సాస్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. కుటుంబ సమస్యల కారణంగానే హత్య, ఆత్మహత్య జరిగి ఉంటుందని, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు వివరించారు.

Hyderabad Couple Suicide in Texas
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles